Jubli Hills: నాన్న కోటలో.. అక్కా వర్సెస్ తమ్ముడు
ABN , Publish Date - Oct 16 , 2025 | 10:54 AM
నగరంలో ఆ నియోజకవర్గానికి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన చరిత్ర దివంగత పీజేఆర్‌కు ఉంది. ప్రత్యర్థులను కూడా తన వాళ్లు చేసుకొని రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పీజేఆర్ వారసులు ఇప్పుడు ఆదిపత్యం కోసం పోరాడుతున్నారు.
- జూబ్లీహిల్స్‌లో పీజేఆర్ వారసుల పోరాటం
- అభిమానులను కలుపుకుంటూ ప్రచారం
- ప్రత్యర్థులను తట్టుకొని నిలబడగలరా?
- అభ్యర్థులను గెలిపించేందుకు ప్రత్యర్థులుగా ఇద్దరు
హైదరాబాద్: నగరంలో ఆ నియోజకవర్గానికి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన చరిత్ర దివంగత పీజేఆర్(PJR)కు ఉంది. ప్రత్యర్థులను కూడా తన వాళ్లు చేసుకొని రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పీజేఆర్ వారసులు ఇప్పుడు ఆదిపత్యం కోసం పోరాడుతున్నారు. ఇద్దరు కూడా తాము పనిచేస్తున్న పార్టీలను గెలిపించే బాధ్యత భుజాన వేసుకున్నారు. ఎన్నికల బరిలో దిగి ప్రచారాలు మొదలు పెట్టారు. ప్రత్యర్థులను తట్టుకొని వారసత్వాన్ని నిలుపుకునేందుకు ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్నారు.

తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న పీజేఆర్ రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు విష్ణువర్థన్‌రెడ్డి(Vishnuvardhan Reddy) తండ్రి పార్టీలోనే ఉన్నప్పటికీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. మరో వారసురాలు బీఆర్‌ఎస్ టికెట్టుపై పోటీ చేసి కార్పొరేటర్‌గా విజయం సాధించాక రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రె్‌సలోకి వచ్చారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి నాన్న కోట అయిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నమ్మిన పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇద్దరు కూడా పీజేఆర్ వారసత్వాన్ని నిలుపుకుంటారా? లేదా? అనే దానిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
సందర్భం ఏదైనా.. చర్చ ఆయనదే..
నగర రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్ర. పేదలు, మధ్య, ధనిక వర్గాల్లో ఇప్పటికీ ఆయనంటే అభిమానం. అంతెందుకు మురికివాడల్లో ఆయన నామస్మరణ చేస్తే ఇప్పటికీ ఓట్లు పడతాయంటే నమ్మి తీరాల్సిందే. మేమే ఆయన వర్గీయులమని చెప్పుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బస్తీ ఓటర్లకు గాలం వేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆయనే పి.జనార్దన్‌రెడ్డి. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్(Khairarabad, Jubli Hills) నియోజకవర్గాల్లో దివంగత నేత పీజేఆర్‌ది ఇప్పటికీ చెరగని ముద్ర. ఆయన హయాంలో ఏర్పాటైన బస్తీలు అనేకం.

ఆయన పేరిట ఏకంగా దేవాలయమే వెలిసింది. ప్రతీ యేట ఇక్కడ పీజేఆర్ జయంతి రోజు పండుగలా వేడుకలు జరుగుతాయి. ఇప్పుడు రాజకీయ పార్టీల అభ్యర్థులకు కూడా ఆయనే దిశానిర్ధేశకుడిగా మారారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని క్వారీ ప్రాంతంలో కబ్జాలు పెరిగిపోయాయి. అప్పటికే అక్కడ ఉన్న వలస వచ్చిన వారిని ఆక్రమణదారులు తరిమేస్తుండడంతో అప్పటి మంత్రి పీజేఆర్ అడ్డుకున్నారు. బస్తీలను ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించారు. బస్తీవాసులంతా కలిసి పీజేఆర్ తల్లిదండ్రులు శివమ్మ, పాపిరెడ్డి పేరును నామకరణం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం ఎస్‌పీఆర్ హిల్స్‌గా గుర్తింపు వచ్చింది. పీజేఆర్ తరహాలో పనిచేసే వారికే ఇక్కడి ప్రాంతవాసులు ఓట్లు వేసి గెలిపిస్తుంటారు.
పీజేఆర్ మరణానంతరం..
పీజేఆర్ మరణించిన తర్వాత జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో పీజేఆర్ వారసులుగా కాంగ్రెస్ తరఫున పి.విష్ణువర్థన్‌రెడ్డి మూడు దఫాలుగా అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు. ఓ సారి విజయం సాధించారు. రెండుమార్లు ఓటమి చవి చూశారు. 2023 ఎన్నికల్లో పార్టీ ఆయనకు టికెట్టు కేటాయించకపోవడంతో బీఆర్‌ఎ్‌సలో చేరారు. కాగా, కాంగ్రెస్ అవకాశం లభించకపోవడంతో బీఆర్‌ఎస్ లో చేరిన విజయారెడ్డి గ్రేటర్ ఎన్నికల్లో అదే పార్టీ నుంచి రెండుమార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. 2018 నుంచి ఆమె ఖైరతాబాద్ బీఆర్‌ఎస్ టికెట్టుపై ఆశలు పెట్టుకున్నారు. కానీ పార్టీ కేటాయించకపోవడంతో కాంగ్రెస్‌లో చేరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. అయితే, ప్రత్యక్ష ఎన్నికల్లో ఇద్దరు ఎప్పుడు కూడా ఎదురు పడలేదు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక రావడం, నానిమేషన్‌ల ప్రక్రియ మొదలవడంతో ఇప్పుడు అక్కా, తమ్ముడు ప్రత్యర్థులుగా ఉంటూ ప్రచారం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీఆర్‌ఎస్ తరఫున ఎన్నికల బరిలో దిగిన మాగంటి సతీమణి సునీతకు మొదటి నుంచి పీవీఆర్ అండగా నిలబడ్డారు. అంతేకాదు గెలుపు బాధ్యతను భుజాన ఎత్తుకున్నారు. తాను ఎలాగైనా, మాగంటి కుటుంబాన్ని గెలిపిస్తానని బహిరంగంగా ప్రకటించాడు. పీజేఆర్ అభిమానులను, పార్టీ శ్రేణులను ఒక్క తాటి మీదకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ఆరంభించారు.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ నవీన్‌యాదవ్‌కు టికెట్టు కేటాయించింది. ఈ నేపథ్యంలో నవీన్‌యాదవ్ మద్దతు కోరుతూ కార్పొరేటర్ విజయారెడ్డిని కలవడమే కాకుండా పీజేఆర్ యూనివర్సల్ నేత అని ప్రకటించాడు. అధిష్ఠానం కూడా నవీన్ గెలుపునకు కృషి చేయాలని విజయారెడ్డికి సూచించడంతో ఆమె వారం రోజులుగా జూబ్లీహిల్స్‌పై దృష్టి పెట్టారు. పీజేఆర్ కోసం పనిచేసిన వారిని కలుసుకుంటూ నవీన్‌కు మద్దతు సమకూర్చేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. కాంగ్రె్‌సకు మద్దతుగా నిలవాలని ప్రచారం చేస్తున్నారు. ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాత్రమే కాదు, పీజేఆర్ వారసుల మధ్య కూడా పోటీ నెలకొందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి పీజేఆర్ వర్గం ఎటువైపు ఉంటుంది అనేది ఎన్నికల ఫలితాల తర్వాతే తెలుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు హైడ్రామా
వచ్చే ఐదేళ్లలో రూ 45000 కోట్ల పెట్టుబడులు
Read Latest Telangana News and National News