Police Visit Minister Konda Surekhas Residence: మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు హైడ్రామా
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:34 AM
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రభుత్వం సుమంత్‌ను మంగళవారమే ఓఎస్డీ పోస్టు నుంచి తొలగించగా..
ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం మంత్రి నివాసానికి వచ్చిన పోలీసులు
వాగ్వాదానికి దిగిన సురేఖ కుమార్తె సుస్మిత
తమ కుటుంబంపై సీఎం రేవంత్, పొంగులేటి, వేం నరేందర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు
రెడ్లు అంతా కలిసి బీసీ మంత్రి అయిన తన తల్లిని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్
సుమంత్ డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులను రివాల్వర్‌తో బెదిరించారని ఆరోపణలు
ఉత్తమ్ ఫిర్యాదు మేరకు పోలీసుల చర్యలు?
హైదరాబాద్/ వరంగల్/ బంజారాహిల్స్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రభుత్వం సుమంత్‌ను మంగళవారమే ఓఎస్డీ పోస్టు నుంచి తొలగించగా.. బుధవారం ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని మంత్రి నివాసంలో సుమంత్ ఉన్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి మఫ్టీలో అక్కడికి వెళ్లారు. ఈ సమయంలో మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద హైడ్రామా చోటుచేసుకొంది. అక్కడికి వచ్చిన టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కొండాసురేఖ కుమార్తె సుస్మిత వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ ఇంటి బయటికి వచ్చారు అదే సమయంలో జూబ్లీహిల్స్ పోలీసులు, మీడియా కూడా అక్కడికి చేరుకున్నారు. మంత్రి సురేఖ కారులో బయటికి వెళ్లిపోగా.. సుస్మిత మీడియాతో మాట్లాడారు. అయితే తన నియోజకవర్గం హుజూర్‌నగర్ పరిధిలో ఉన్న డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులను సుమంత్ రివాల్వర్‌తో బెదిరించారని మంత్రి ఉత్తమ్ సీఎంకు ఫిర్యాదు చేశారని.. ఆ కారణంతోనే మాజీ ఓఎస్డీ అరెస్టుకు రంగం సిద్ధమైందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వచ్చిన సమయంలోనే కొండా సురేఖ సుమంత్‌ను తన కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారని సమాచారం. అయితే ఏకంగా మంత్రి నివాసానికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు రాత్రి సమయంలో వెళ్లడం, ఆమె ఓఎస్డీగా పనిచేసి, ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన వ్యక్తిని అరెస్టు చేయడానికి ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది.
రెడ్లు అంతా కలసి మాపై కుట్ర: సురేఖ కుమార్తె సుస్మిత
సుమంత్‌ను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో కొండా సురేఖ కుమార్తె వాగ్వాదానికి దిగారు. ‘‘మేం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా? వేరే ప్రభుత్వంలో ఉన్నామా? సుమంత్ మా ఇంట్లో ఉన్నాడు.. అయితే తప్పేంటి? మేం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్నవారిపై ఇలా వ్యవహరించడమేమిటి?’’ అని పోలీసులపై మండిపడ్డారు. అనంతరం అక్కడికి వచ్చిన మీడియాతో సుస్మిత మాట్లాడారు. తన తల్లి సురేఖను, తండ్రి కొండా మురళిని వేధించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బంఽధువులకు చెందిన డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యాన్ని సుమంత్ ఆయుధం చూపించి బెదిరించారంటూ పోలీసులు కేసు పెట్టారని.. తన తండ్రిని కూడా ఇరికించాలనే కుట్రతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, మరికొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘‘డెక్కన్ సిమెంట్స్ కంపెనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి కొన్నిరోజుల క్రితం సుమంత్‌ను పిలిపించి మాట్లాడారు. అనంతరం వారిద్దరూ కలిసి డెక్కన్ సిమెంట్స్ కంపెనీకి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. మరి సుమంత్‌పై కేసుపెట్టిన పోలీసులు రోహిన్‌రెడ్డిని ఎందుకు విస్మరించారు?’’ సుస్మిత ప్రశ్నించారు. బీసీ మంత్రి అయిన తన తల్లిని అణగదొక్కేందుకు పార్టీలోని రెడ్లు అంతా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు రాహుల్‌గాంధీ బీసీల కోసం పనిచేస్తామని చెబుతుంటే.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చర్యలతో బీసీలను తొక్కేస్తుందా? అని ప్రశ్నించారు. తన తండ్రికి ప్రాణభయం ఉందని పేర్కొన్నారు. వరంగల్ ఈస్ట్‌లో గతంలో వేం నరేందర్‌రెడ్డి పోటీచేసి ఓడిపోయారని గుర్తుచేశారు. ఇప్పుడు తమ కుటుంబాన్ని అణగదొక్కాలనే కుట్ర వెనుక వేం నరేందర్‌రెడ్డి, కడియం శ్రీహరితోపాటు సీఎం పాత్ర కూడా ఉందని ఆరోపించారు.
సీఎం పర్యటనకు దూరంగా సురేఖ
వరంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం గమనార్హం. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దశదిన కర్మలో పాల్గొనేందుకు రేవంత్ వరంగల్‌కు వచ్చారు. సీఎం వెంట ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కానీ వరంగల్‌కు చెందిన సురేఖ ఆ పర్యటనకు దూరంగా ఉన్నారు. మేడారంలో రూ.71కోట్లతో సమ్మక్క సారక్క గద్దెల ఆధునీకరణకు పిలిచిన టెండర్లను తనకు తెలియకుండానే మంత్రి పొంగులేటి తన సొంత కంపెనీలకు ఇప్పించుకున్నారని.. అది కొండా దంపతులకు నచ్చలేదని ప్రచారం జరిగింది.