Hyundai Motor India: వచ్చే ఐదేళ్లలో రూ 45000 కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Oct 16 , 2025 | 05:15 AM
దక్షిణ కొరియా వాహన తయారీ దిగ్గజం హ్యుండయ్ మోటార్ భారత అనుబంధ విభాగం హ్యుండయ్ మోటార్ ఇండియా భారీ ప్రణాళికను ప్రకటించింది. తదుపరి దశ వ్యాపార వృద్ధి కోసం వచ్చే ఐదు...
మార్కెట్లోకి 26 కొత్త మోడళ్ల విడుదల
2027కల్లా జెనిసిస్ బ్రాండ్ కార్ల లాంచ్
హ్యుండయ్ మోటార్ భారీ ప్రణాళిక
ముంబై: దక్షిణ కొరియా వాహన తయారీ దిగ్గజం హ్యుండయ్ మోటార్ భారత అనుబంధ విభాగం హ్యుండయ్ మోటార్ ఇండియా భారీ ప్రణాళికను ప్రకటించింది. తదుపరి దశ వ్యాపార వృద్ధి కోసం వచ్చే ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2029-30 నాటికి) భారత మార్కెట్లో రూ.45,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ జోస్ మునోజ్ బుధవారం వెల్లడించారు. అందులో 60 శాతం పెట్టుబడులను ప్రొడక్ట్ అండ్ ఆర్ అండ్ డీ కోసం, మిగతా 40 శాతం తయారీ సామర్థ్యం పెంపు, ప్లాంట్ల అప్‌గ్రేడేషన్ కోసం వినియోగించనున్నట్లు ఆయన చెప్పారు. హ్యుండయ్ మోటార్ ఇండియా స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాక తొలిసారిగా ఏర్పాటు చేసిన వాటాదారుల సమావేశంలో మునోజ్ మాట్లాడారు.
మరిన్ని విషయాలు..
2030 నాటికి భారత్‌ను తమ రెండో అతిపెద్ద మార్కెట్‌గా చేసుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం హ్యుండయ్‌కి భారత్ మూడో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. కంపెనీ ప్రపంచవ్యాప్త విక్రయాల్లో భారత్ వాటా 15 శాతంగా ఉంది.
2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి భారత మార్కెట్లోకి 7 కొత్త కార్లు సహా 26 మోడళ్లను విడుదల చేయనున్నట్లు మునోజ్ తెలిపారు. అందులో భాగంగా సంస్థ ఓ మల్టీ యుటిలిటీ వెహికిల్ (ఎంయూవీ), ఆఫ్ రోడ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎ్‌సయూవీ) సైతం ప్రవేశపెట్టనుంది. అలాగే, దేశీయ డిజైనింగ్‌తో అభివృద్ధి చేసి, తయారు చేసిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత మార్కెట్ కోసం 2027లో అందుబాటులో తేవాలనుకుంటోంది.
హ్యుండయ్ మోటార్ తన లగ్జరీ కార్ బ్రాండ్ జెనిసిస్‌ను 2027 నాటికి భారత మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటోంది.
భారత్‌లో కంపెనీ విక్రయాలను మరింత పెంచేందుకు తమ సేల్స్ ఫైనాన్స్ విభాగం హ్యుండయ్ క్యాపిటల్ వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో భారత్‌లోకి ప్రవేశించనుందని, దశలవారీగా ఈ విభాగాన్ని విస్తరింపజేయనున్నట్లు మునోజ్ తెలిపారు.
ఆదాయంలో ఎగుమతుల వాటా 30 శాతానికి పెరిగింది. వార్షిక ఆదాయం 1.5 రెట్ల పెరిగి రూ.లక్ష కోట్ల మైలురాయిని దాటింది.
భారత్‌లో మార్కెట్ వాటాను 15 శాతానికి పెంచుకోవడం. కంపెనీ షోరూమ్‌లు, సర్వీసుల నెట్‌వర్క్‌ను దేశంలోని 85 శాతం జిల్లాలకు విస్తరించడం. మొత్తం భారత విక్రయాల్లో గ్రామీణ మార్కెట్ వాటాను 30 శాతానికి పెంచుకోవడం.
చిన్న కార్ల విభాగంలో కొనసాగుతాం..
భారత్‌లో చిన్న కార్లకు గిరాకీ కొనసాగనుందని హ్యుండయ్ మోటార్ సీఈఓ మునోజ్ అన్నారు. ఈ విభాగం నుంచి హ్యుండయ్ వైదొలగబోదన్నారు.
తరుణ్ గార్గ్‌కు కంపెనీ పగ్గాలు
హ్యుండయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓగా తరుణ్ గార్గ్‌ను నియమించే ప్రతిపాదనను కంపెనీ బోర్డు ఆమోదించింది. 2026 జనవరి 1 నుంచి ఆయన కంపెనీ పగ్గాలు చేపట్టనున్నారు. హ్యుండయ్ మోటార్ ఇండియా సారథ్య బాధ్యతలు చేపట్టనున్న తొలి భారతీయుడు ఈయనే. ప్రస్తుతం గార్గ్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. ప్రస్తుత సీఈఓ ఉన్సూ కిమ్ మాతృ సంస్థ హ్యుండయ్ మోటార్‌లో ఈ డిసెంబరు 31 నుంచి వ్యూహాత్మక బాధ్యతలు చేపట్టనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి...
జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telugu News