Sajjanar on Phone Tapping: ఫోన్ ట్యాపింగ్‌పై చర్యలు.. వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 30 , 2025 | 02:10 PM
సోషల్ మీడియాలో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం, కించపరచటం మంచిది కాదు తప్పకుండా చర్యలు ఉంటాయని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరగాలని వీసీ సజ్జనార్ సూచించారు.
హైదరాబాద్, సెప్టెంబరు30 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసుపై రివ్యూ చేస్తామని.. అనంతరం చర్యలపై ఆలోచిస్తామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (Sajjanar) వ్యాఖ్యానించారు. ప్రజల సురక్షితం జీవనానికి పీపుల్ వెల్ఫేర్ పోలీస్ విధానాన్ని తీసుకు వస్తున్నామని పేర్కొన్నారు. సీపీగా కొత్త సంస్కరణలు తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని ఉద్ఘాటించారు. ఇవాళ(మంగళవారం) హైదరాబాద్ సీపీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం వీసీ సజ్జనార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సీపీగా తాను చార్జ్ తీసుకున్నానని.. తనకు అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికీ ధన్యవాదాలు తెలిపారు వీసీ సజ్జనార్.
సెన్సేషనల్ కేసులు చేధించారు..
తనకున్న గత అనుభవంతో హైదరాబాద్ సీపీగా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు. టీం వర్క్‌కు మారుపేరు హైదరాబాద్ కమిషనరేట్ (Hyderabad Commissionerate) అని ప్రశంసించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని పండుగలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరిపామని తెలిపారు. హైదరాబాద్ పోలీసులు సెన్సేషనల్ కేసులు చేధించారని కొనియాడారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రతి ఒక సిటిజన్ ఒక పోలీస్ ఆఫీసర్ అని నొక్కిచెప్పారు. పౌరులు సామాజిక బాధ్యతతో ప్రవర్తించాలని ఆకాంక్షించారు. పీపుల్స్, ఫ్రెండ్లీ పోలీసుకు తెలంగాణ పోలీసులు (Telangana Police) మారుపేరని కీర్తించారు. పీపుల్ వెల్ఫేర్ పోలీసుగా తయారు చేస్తామని ఉద్ఘాటించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య ఉందని చెప్పుకొచ్చారు. పీపుల్ వెల్ఫేర్ పోలీస్ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్దామని తెలిపారు. హైదరాబాద్ విశ్వ నగరం.. మనకు డ్రగ్స్ పెద్ద సమస్య అని వెల్లడించారు వీసీ సజ్జనార్.
డ్రగ్స్‌పై ఉక్కుపాదం
‘డ్రగ్స్‌పై, రౌడీ షీటర్‌లపై ఉక్కుపాదం మోపుతాం.. పీడీ యాక్టులు పెడతాం. అంతకు ముందు డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారి కేసులు పున: పరిశీలిస్తాం. నిందితులకు సంబంధించిన డేటా బేస్ తయారు చేస్తాం. ఈగల్ టీంని మరింత బలోపేతం చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం కూడా డ్రగ్స్‌పై సీరియస్‌గా ఉంది. డ్రగ్స్‌ని అరికట్టడమే హైదరాబాద్ పోలీసులు టాప్ ప్రయారిటీ. రోజుకో కొత్త రకం సైబర్ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రజలు సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ లాంటి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
డబ్బు ఎవరికీ ఊరికే రాదు.. అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సైబర్ నేరాల (Cyber Crimes)పై ప్రజల్లో అవగాహన పెరగాలి. సే నో టు డ్రగ్స్ అంటూ నేను మొదలు పెట్టిన క్యాపెయిన్ విజయవంతం అయింది. బెట్టింగ్ యాప్‌లు బ్యాన్ అయ్యాయి.. జనాల్లో అవగాహన పెరిగింది. ఆన్‌లైన్ బెట్టింగ్, ప్రజలకు హాని కలిగించే యాప్‌లను ఎవరూ ప్రమోట్ చేయొద్దు. కల్తీ ఆహారం పెద్ద సమస్యగా మారింది. ఈ అంశాలపై సమగ్ర దృష్టి సారిస్తాం. ఆహారంలో కల్తీ చేసే గ్యాంగ్‌లపై ఉక్కుపాదం మోపుతాం. ట్రాఫిక్ సమస్య రోజు రోజుకూ జటిలం అవుతోంది. జీఎస్టీ తగ్గడంతో వాహనాల సంఖ్య పెరిగాయి. ట్రాఫిక్‌పై లాంగ్ టర్మ్ లక్ష్యం పెట్టుకుని పని చేస్తాం’ అని వీసీ సజ్జనార్ తెలిపారు.
డ్రంకెన్ డ్రైవ్‌లపై దృష్టి సారిస్తాం..
‘ట్రాఫిక్ నేపథ్యంలో ప్రజల సమయం సేవ్ చేయడానికి, ప్రజల ఆరోగ్యం కోసం పని చేస్తాం. ప్రమాదకరంగా మారిన డ్రంకెన్ డ్రైవ్ (Drunken Drives)లపై దృష్టి సారిస్తాం. డ్రంకెన్ డ్రైవ్ చేసేవారు సూసైడ్ బాంబ్ లాంటి వారు. డ్రంకెన్ డ్రైవ్‌లపై తనిఖీలు ముమ్మరం చేస్తాం. ఏఐ గ్రీవెన్స్ విధానాన్ని తీసుకొస్తాం. డ్రోన్స్, ఏఐ టెక్నాలజీ వినియోగంపై స్టడీ చేస్తాం.. డ్రోన్స్ టెక్నాలజీ, ఏఐ సాంకేతికతో పోలీసులకు శిక్షణ ఇస్తాం. ఆడపిల్లలు , చిన్న పిల్లలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు. ఆడపిల్లల జోలికి వచ్చే ముందు ఇంట్లో తల్లి, పిల్లలను గుర్తు తెచ్చుకోవాలి. డయల్ 100 నెంబర్‌ని ఇంప్రూవ్ చేసే అంశాలపై ఆలోచిస్తాం.. సీసీటీవీలు ఏర్పాటు చేస్తాం.
సీసీటీవీల ఏర్పాటుతో బయటి నుంచి క్రిమినల్ గ్యాంగ్‌లు రావడం ఆగిపోయాయు. ప్రతి బిల్డింగ్‌లో సీసీటీవీలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతాం. హైదరాబాద్ పోలీసులు ఎక్కువగా కష్టపడుతారు. వారి సంక్షేమాన్ని టాప్ ప్రయారిటీగా తీసుకుంటాం. ఉత్తమ విధులు నిర్వర్తించిన పోలీసులను గుర్తిస్తాం.. రివార్డులు ఇస్తాం. ప్రజల వెంట హైదరాబాద్ పోలీసులు ఎల్లప్పుడూ ఉంటారు. ప్రజలకు నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను.. సోషల్ మీడియాలో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం, కించపరచటం మంచిది కాదు తప్పకుండా చర్యలు ఉంటాయి. సివిల్ మ్యాటర్‌తో ఇల్లీగల్ యాక్టివిటీస్‌లో పాలు పంచుకునే పోలీసులపై తప్పక చర్యలు ఉంటాయి. శాంతి, మత సామరస్యానికి హైదరాబాద్ పెట్టింది పేరు. గంగ జమున సంగమం అనే కాన్సెప్ట్‌తో ముందుకెళ్తాం’ అని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మద్యం, మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్...
డీజీపీ జితేందర్ కంటతడి... ఎందుకంటే
Read Latest Telangana News and National News