Share News

Telangana DGP Retirement: డీజీపీ జితేందర్ కంటతడి... ఎందుకంటే

ABN , Publish Date - Sep 30 , 2025 | 10:57 AM

గత 33 సంవత్సరాలుగా ఏపీ, తెలంగాణలో పోలీస్ శాఖలో కీలక పదవుల్లో పని చేశానని డీజీపీ జితేందర్ చెప్పారు. పంజాబ్‌లో పుట్టి పెరిగానని.. పోలీస్ శాఖలో ఉండి ప్రజలకు సేవ చేయడం మర్చిపోలేని అనుభవం అని అన్నారు.

Telangana DGP Retirement: డీజీపీ జితేందర్ కంటతడి... ఎందుకంటే
Telangana DGP Retirement

హైదరాబాద్, సెప్టెంబర్ 30: తెలంగాణ డీజీపీ డాక్టర్ జితేందర్ (Telangana DGP Jitender) ఈరోజు పదవి విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ అకాడమీలో డీజీపీకి పోలీస్‌ శాఖ పరేడ్, వీడ్కోల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబం గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టారు. ‘ఇటీవలే నా తల్లి చనిపోయారు.. నన్ను అర్థం చేసుకుని నాకు సహకరించిన నా భార్య, పిల్లలకు కృతజ్ఞతలు. తల్లి, తండ్రి ఇద్దరినీ కోల్పోయాను.. ఉద్యోగ రీత్యా ఫ్యామిలీ, బంధువులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అర్థం చేసుకున్నారు అని అనుకుంటా’ అంటూ తల్లిని గుర్తు తెచ్చుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు జితేందర్.


ఇది మర్చిపోలేని అనుభవం..

ఇక మిగితా విషయాలపై ఆయన మాట్లాడుతూ.. గత 33 సంవత్సరాలుగా ఏపీ, తెలంగాణలో పోలీస్ శాఖలో కీలక పదవుల్లో పని చేశానని చెప్పారు. పంజాబ్‌లో పుట్టి పెరిగానని.. పోలీస్ శాఖలో ఉండి ప్రజలకు సేవ చేయడం మర్చిపోలేని అనుభవం అని అన్నారు. తన 40 ఏళ్ల జీవితం 40 రోజులా గడిచిపోయిందని తెలిపారు. డీజీపీగా అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో గత 15 నెలల్లో లా అండ్ ఆర్డర్, సైబర్ క్రైమ్, నేరాలు అదుపులో ఉన్నాయని.. నక్సలిజం, టెర్రరిజం వంటి సంఘాలు నుంచి ప్రజలకు రక్షణ కల్పించామని అన్నారు.


అన్నింటినీ ఎదుర్కున్నాం...

వరదలను సమర్థంగా ఎదుర్కున్నామని డీజీపీ తెలిపారు. గణేష్ నిమజ్జనం, శ్రీరామ నవమి, బక్రీద్ వంటి పండగల్లో చిన్న తప్పిదం లేకుండా నిర్వహించామన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ కేవలం తెలంగాణ ప్రజల కోసమే కాకుండా ఇతర రాష్ట్రాల కోసం కూడా పని చేసిందని వెల్లడించారు. అందుకు సాక్ష్యం బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులను అరెస్ట్ చేయడం, సైబర్ నేరగాళ్లనీ అరెస్ట్ చేశాం, ఆర్థిక నేరాలు చేసే వారిని అరెస్ట్ చేశామన్నారు.


తెలంగాణ పోలీస్ శాఖ నెంబర్ వన్..

‘నాకు తెలంగాణ పోలీస్ మీద నమ్మకం ఉంది... శాంతి భద్రతలు కాపాడటంలో ఎప్పుడు ముందుంటారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖ నెంబర్ వన్ స్థానంలో ఉంది. నేరాల నియంత్రణకు టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. డ్రగ్స్, సైబర్ క్రైమ్ ప్రస్తుత రోజుల్లో సవాలుగా మారాయి. టెక్నాలజీ ఉపయోగించుకుని కేసులు చేధించడంలో తెలంగాణ పోలీసులు ముందున్నారు. కాబోయే నూతన డీజీపీ శివధర్ రెడ్డి డీజీపీ పదవికి అర్హుడు. శివధర్ రెడ్డికి నాకు మంచి స్నేహబంధం ఉంది. ఎన్నో ఏళ్ళు పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. శివధర్ రెడ్డి సేవలు తెలంగాణ ప్రజలకి ఎంత గానో ఉపయోగపడతాయి’ అని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు.


జితేందర్ ఐడియాలజీ ఆదర్శం: శివధర్ రెడ్డి

తెలంగాణ నూతన డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. గత 14 నెలల నుంచి తెలంగాణ పోలీస్ శాఖకు తన సేవలు అందించిన జితేందర్‌కు అభినందనలు తెలియజేశారు. ఇద్దరం కలిసి గుంటూరు జిల్లాలో కలిసి పనిచేశామని గుర్తుచేశారు. జితేందర్ ఐడియాలజీ తనకు ఆదర్శనీయమన్నారు. జితేందర్ పాలనా దక్షత తమకు మార్గదర్శకం అవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. డీజీపీగా ఉంటూ కీలక సేవలు అందించారని శివధర్ రెడ్డి వెల్లడించారు. ఇక రేపు (బుధవారం) తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినున్నారు.


ఇవి కూడా చదవండి..

220 కేవీ టవర్ ఎక్కిన వ్యక్తి.. భయాందోళనలో గ్రామస్తులు

కృష్ణా, గోదావరి లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 30 , 2025 | 11:19 AM