TG Police: పనివాళ్లతో జర భద్రం సుమా..
ABN , Publish Date - Sep 30 , 2025 | 10:37 AM
ప్రస్తుతం హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా గుర్తింపు పొందింది. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి లక్షలాది మంది బతుకుదెరువు కోసం ఇక్కడికి వస్తున్నారు. వారిలో కొంతమంది కార్మికులుగా, ఇళ్లలో పనివాళ్లుగా, డ్రైవర్లు, ప్లంబర్లు, పెయింటర్లుగా చేరుతున్నారు.
- నమ్మకంగా నటించి నట్టేట ముంచుతున్న కొందరు కేటుగాళ్లు
- ప్రాణాలు తీసేందుకూ వెనుకాడని వైనం
- ఇబ్బడిముబ్బడిగా వెలసిన కేర్‌టేకర్ ఏజెన్సీలు
- పని మనుషుల ఎంపికలో యజమానులు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
- ఆధార్, బయోమెట్రిక్ తప్పనిసరిగా తీసుకోవాలి
- నేరచరిత్ర తెలుసుకున్న తర్వాతే పనిలో పెట్టుకోవాలి: డీసీపీ సురేష్
హైదరాబాద్ సిటీ: ప్రస్తుతం హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా గుర్తింపు పొందింది. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి లక్షలాది మంది బతుకుదెరువు కోసం ఇక్కడికి వస్తున్నారు. వారిలో కొంతమంది కార్మికులుగా, ఇళ్లలో పనివాళ్లుగా, డ్రైవర్లు, ప్లంబర్లు, పెయింటర్లుగా చేరుతున్నారు. నగరంలో ఇంటి పనివారికి, కేర్ టేకర్లకు, డ్రైవర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. దాంతో యజమానులు ఎవరిని పడితే వారిని నమ్మి పనిలో పెట్టుకుంటున్నారు. మరికొందరైతే ప్రైవేట్ ఏజెన్సీలను ఆశ్రయించి, వారు ఎవరిని పంపిస్తే వారినే పనిలో పెట్టుకుంటున్నారు. ఇలా పెట్టుకున్న కొందరితో ఒక్కోసారి ముప్పు వాటిల్లుతోంది.
పదిరోజులకే యజమానురాలి హత్య
కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్ దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు పనివాళ్లు పనిలో చేరిన పదిరోజులకే ఇంట్లో ఉన్న బంగారం, డబ్బుపై కన్నేసి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో యజమానురాలైన రేణు అగర్వాల్‌ను కాళ్లు చేతులు కట్టేశారు. ఇంట్లో బంగారం, నగదు ఎక్కడుందో చెప్పాలని చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత కుక్కర్‌తో తలపై మోది, కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేసి ఇంటి నుంచి పరారయ్యారు. ఈ దారుణ హత్య వెలుగులోకి రావడంతో స్థానికులు, పోలీసులు ఉలిక్కిపడ్డారు.
ఇటీవల జరిగిన ఘటనలు..
ఫ దోమలగూడ పరిధిలో ఓ ఇంట్లో పనికి చేరిన నేపాల్ దొంగలు.. నెలరోజుల్లోనే దొంగతనానికి పాల్పడ్డారు. వృద్ధులకు భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చి, రూ. కోటిన్నర విలువైన బంగారం, డబ్బు దోచుకొని ఉడాయించారు. ఇప్పటికీ వాళ్లు దొరకలేదు.
ఫ బతుకుదెరువుకోసం నగరానికి వచ్చిన వ్యక్తి ఓ బంగారం దుకాణంలో పనిలో చేరాడు. చేరిన నాలుగు రోజులకే యజమానికి టోకరా వేసి రూ. 30లక్షలతో చెక్కేశాడు.
- పనిలో చేరిన మరుసటి రోజే 150 తులాల బంగారం, వజ్రాభరణాలతో ఉడాయించిన ఘటన గతంలో ఎస్‌ఆర్‌నగర్‌లో జరిగింది. ఇంటి యజమానులు పనిమీద బయటకు వెళ్లగానే పనిమనిషి ఇంట్లో ఉన్న వృద్ధుల కళ్లలో కారం చల్లి బంగారు నగలతో పరారయ్యారు.
- యజమాని దుకాణంలో రూ. 9లక్షలు దోపిడీ చేసిన ఘటన ఈస్ట్ జోన్ పరిధిలో ఇటీవల వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన వ్యాపారి సుల్తాన్‌బజార్ పరిధిలో మొబైల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అందులో పనికి కుదిరిన రాజస్థాన్‌కు చెందిన వర్కర్ యజమాని వద్ద నమ్మకంగా పనిచేశాడు. యజమాని అతడితో మరో దుకాణం పెట్టించాడు. యజమానికి నష్టం చేకూర్చాలని దుర్బుద్ధి పుట్టిన వర్కర్ పథకం ప్రకారం తన రాష్ట్రం నుంచి స్నేహితుల ముఠాను పిలిపించి పదునైన ఆయుధాలతో షట్టర్ తెరిచి రూ. 9 లక్షలు దోచుకెళ్లారు.
- యజమానిని నమ్మించిన క్యాబ్ డ్రైవర్.. తన స్నేహితులతో కలిసి రూ. 40 లక్షలు దోపిడీ చేసిన ఉదంతం 15 రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది.
యజమానులు తెలుసుకోవాల్సిన అంశాలు
- ఏజెన్సీల ద్వారా కాకుండా తెలిసిన వ్యక్తుల ద్వారా పనివాళ్లను ఎంపిక చేసుకోవాలి.
- వారి చిరునామా, ఆధార్‌కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ లాంటి గుర్తింపు కార్డులను పరిశీలించాలి. ఒక కాపీ మన వద్ద పెట్టుకోవాలి.
- అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలి. వారు విచారణ చేసి రిపోర్టు ఇస్తారు. గతంలో నేర చరిత్ర ఉంటే తెలుస్తుంది.
- ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువుకోసం వచ్చిన వారిని నమ్మలేం.
- డ్రైవర్ల ముందు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలు మాట్లాడకపోవడం మంచిది.
- బ్యాంకు పనులు, ఇంటికి సంబంధించిన ముఖ్యమైన పనులు అప్పగించకపోవడమే మంచిది.
- పనివాళ్ల కుటుంబసభ్యుల ఫోన్ నంబర్‌తో పాటు.. పనివాళ్ల బయోమెట్రిక్ తీసుకోవడం మంచిది.
- సురేష్ కుమార్, డీసీపీ, బాలానగర్
మంచితనం నటించి..
కొందరు కేటుగాళ్లు దోచుకోవడమే లక్ష్యంగా ఇంట్లో పనివాళ్లుగా, కేర్‌టేకర్లుగా, డ్రైవర్లుగా చేరుతున్నారు. కొంతకాలం యజమానులు చెప్పినట్లు నడుచుకొని, అతి మంచితనాన్ని ప్రదర్శిస్తున్నారు. సొంతవాళ్లనే విధంగా యజమానుల మెప్పు పొందుతున్నారు. డబ్బు, బంగారం, ఇతర విలువైన వస్తువులు ఉన్న గదుల్లోకి వెళ్లేంత చనువు పొందుతున్నారు. అదును చూసి ఇంట్లో ఉన్న వృద్ధులను కట్టేసి, మత్తుమందు కలిపిన భోజనం పెట్టి, లేదంటే దారుణంగా హత్య చేసో సొత్తుతో దోచుకుని ఉడాయిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News