Share News

Kishan Reddy On Fertilizers: రైతులకు గుడ్ న్యూస్.. ఎరువులపై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన

ABN , Publish Date - Oct 28 , 2025 | 06:11 PM

తెలంగాణలో రైతుల అవసరాలకు అనుగుణంగా సరిపోయే యూరియాను కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల్లోని ఎరువుల తయారీ కంపెనీల నుంచి ఎరువులను సేకరించడంతోపాటుగా.. విదేశాల నుంచి పెద్దఎత్తున దిగుమతి చేసుకోవడం ద్వారా.. దేశంలో యూరియా కొరత తగ్గించేందుకు కేంద్రం చొరవ తీసుకుందని పేర్కొన్నారు కిషన్‌రెడ్డి.

Kishan Reddy On Fertilizers: రైతులకు గుడ్ న్యూస్.. ఎరువులపై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన
Kishan Reddy on Fertilizers

ఢిల్లీ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎరువుల ఉత్పత్తి కంపెనీలకు న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ (NBS) అమలు చేయాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయంపై.. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఇవాళ(మంగళవారం) పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం గత 11 ఏళ్లుగా కారక్రమాలు చేపడుతోందని తెలిపారు. ఈ క్రమంలో ఇవాళ(మంగళవారం) కేంద్ర కేబినెట్ మరో చారిత్రక నిర్ణయం తీసుకుందని తెలిపారు. రైతులపై ఎరువుల ధరలు భారం పడకుండా, ఎరువుల ఉత్పత్తి కంపెనీలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రూ.37,952 కోట్ల న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ (NBS) అమలు చేయాలని నిర్ణయించిందని పేర్కొన్నారు కిషన్‌రెడ్డి .

అంతర్జాతీయంగా వివిధ కారణాలతో ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ.. ఈ ధరల ప్రభావం ఏమాత్రం రైతులపై పడకుండా చర్యలు తీసుకుంటోందని చెప్పుకొచ్చారు. ఈ ప్రయత్నంలో భాగంగా.. ఎరువుల ఉత్పత్తి కంపెనీలపై పడుతున్న భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని వెల్లడించారు కిషన్‌రెడ్డి.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఇవాళ సమావేశమైన కేంద్ర కేబినెట్.. 2025-26 రబీ సీజన్‌కు సంబంధించి.. డై అల్యూమినియం ఫాస్పేట్ (DAP), మోనో అల్యూమినియం ఫాస్పేట్ (MAP), మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (MOP), ట్రిపుల్ సూపర్ ఫాస్పేట్ (TSP), 3 గ్రేడ్స్ ఆఫ్ సింగిల్ సూపర్ ఫాస్పేట్ (SSP), పొటాష్ డెరైవ్‌డ్ మొలాసెస్ (PDM), అల్యూమినియం సల్ఫేట్ (AS) వంటి దాదాపు 28 NPKS Complex ఫెర్టిలైజర్స్‌ను ఉత్పత్తి చేసే కంపెనీలకు NBS (న్యూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీ) అమలు చేయాలని నిర్ణయించిందని వివరించారు కిషన్‌రెడ్డి.

ఇందుకోసం.. అంతర్జాతీయంగా పెరిగిన ధరలతో ఈ ఎరువుల ఉత్పత్తి కంపెనీలపై భారం పడకుండా.. NBSలో భాగంగా.. 2025 - 2026 రబీ సీజన్‌ కోసం రూ.37,952 కోట్లు కేటాయిస్తున్నట్లు కేబినెట్ నిర్ణయించిందని వెల్లడించారు. ఇది ఎరువులు ఉత్పత్తి కంపెనీలకు కూడా భారం పడకుండా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పుకొచ్చారు కిషన్‌రెడ్డి .


కరోనా సమయంలో అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, దీని ప్రభావం రైతులపై పడకుండా.. ఆ భారాన్ని కేంద్రమే భరించిందని స్పష్టం చేశారు. దీంతో.. రూ.1,350లకే.. 50 కేజీల DAP బస్తా రైతుకు అందిందని వివరించారు. ఆ తర్వాత కూడా.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ధర పెరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. కరోనానంతర పరిస్థితుల్లోనూ, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా.. ఎరువుల తయారీ కంపెనీలపై ఆర్థికభారాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తోందని చెప్పుకొచ్చారు కిషన్‌రెడ్డి .

దీనికితోడు, 2025 సంవత్సరానికి గానూ.. మార్చ్, జూలై నెలల మధ్యలో అంటే.. 5 నెలల్లోనూ.. ఫర్టిలైజర్ల ఇన్‌పుట్ కాస్ట్‌ దాదాపు 25శాతం వరకు (ఉదాహరణకు మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ - MOP) పెరిగిందని తెలిపారు. ఈ భారం ఎరువుల ఉత్పత్తుల కంపెనీలపై పడకుండా.. NBS ద్వారా.. పరిహారం అందించేందుకు కేంద్రప్రభుత్వం దశలవారిగా నిధులను విడుదల చేస్తోందని వెల్లడించారు. ఇవాళ్టి కేంద్ర కేబినెట్ రూ. 37,952 కోట్లను 2025-26 రబీ సీజన్ కోసం విడుదల చేయాలని నిర్ణయంచడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు కిషన్‌రెడ్డి .


ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. మన రైతులకు ఎరువుల కొరత ఉండకూడదనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే.. రష్యా - ఉక్రెయిన్ యుద్ధ సమయం, ఆ తర్వాత నెలకొన్న జియోపొలిటికల్ సమస్యల సందర్భంలోనూ.. ఎరువుల కొరత దేశంలో లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దీని వల్ల తెలంగాణ రైతులకు కూడా మేలు జరుగుతోందని చెప్పుకొచ్చారు కిషన్‌రెడ్డి.

తెలంగాణలోనూ.. రైతుల అవసరాలకు అనుగుణంగా సరిపోయే యూరియాను కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని స్పష్టం చేశారు. 2025 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి.. 9.8 లక్షల మెట్రిక్ టన్నుల డిమాండ్ ఉండగా.. కేంద్ర ప్రభుత్వం.. 10.28 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచిందని వెల్లడించారు. మొత్తంగా 9.79 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్ముడైనట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని అన్నారు. గతేడాది ఖరీఫ్‌తో పోలిస్తే.. 13వేల మెట్రిక్ టన్నుల ఎక్కువగా అమ్ముడయ్యాయని వివరించారు. వివిధ రాష్ట్రాల్లోని ఎరువుల తయారీ కంపెనీల నుంచి ఎరువులను సేకరించడంతోపాటుగా.. విదేశాల నుంచి పెద్దఎత్తున దిగుమతి చేసుకోవడం ద్వారా.. దేశంలో యూరియా కొరత తగ్గించేందుకు కేంద్రం చొరవతీసుకుందని పేర్కొన్నారు కిషన్‌రెడ్డి .


ఇది కాకుండా.. తెలంగాణలోని రామగుండంలోని RFCLలో వివిధ కారణాలతో ఆగిన ఎరువుల ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించిందని చెప్పుకొచ్చారు. RFCL మొత్తం సామర్థ్యం రోజుకు.. 3,850 మెట్రిక్ టన్నులు కాగా.. అక్టోబర్ 2 (దసరా) నుంచి సామర్థ్యంలో 90శాతం ఉత్పత్తి అంటే.. 3,500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ప్రారంభమైందని తెలిపారు. ఇందులో 45శాతం తెలంగాణ రైతాంగం కోసం కేటాయించిందని స్పష్టం చేశారు కిషన్‌రెడ్డి.

రామగుండం ఎరువుల కర్మాగారంలో సింథటిక్ గ్యాస్ లీకేజీ కారణంగా.. 2025 ఆగస్టు 14 నుంచి ఉత్పత్తి ఆగిపోయిందని చెప్పుకొచ్చారు. విదేశాల నుంచి నిపుణులు రంగంలోకి దిగిన తర్వాత హైడ్రోజన్ వాయువు లీకేజీని ఆపి.. పలు పరీక్షల అనంతరం.. దసరా రోజు నుంచి ఉత్పత్తి ప్రారంభమైందని తెలిపారు. అక్టోబరులో లక్ష మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా.. ఇందులో 45వేల మెట్రిక్ టన్నులు తెలంగాణకు కేటాయించారని స్పష్టం చేశారు. విషవాయువుల లీకేజీని అరికట్టడంలో పనిచేసిన ప్రతి కార్మికుడికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఉత్పత్తి ప్రారంభం కావడంతో మళ్లీ తెలంగాణ రైతాంగానికి అవసరమైనంతమేర యూరియా అందుబాటులోకి రావడం సంతోషకరమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల పరిస్థితిపై సీఎం సమీక్ష..

మావోయిస్టులకు బిగ్ షాక్.. అగ్రనేతల లొంగుబాటు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 28 , 2025 | 06:32 PM