Top Maoists Surrender: మావోయిస్టులకు బిగ్ షాక్.. అగ్రనేతల లొంగుబాటు
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:18 PM
తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు కేంద్ర కమిటీ మెంబర్ పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ శంకరన్న, చంద్రన్న, మావోయిస్టు రాష్ట్ర కమిటీ మెంబర్ బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ లొంగిపోయారు. అయితే, పుల్లూరి ప్రసాద్ రావుపై రూ.25 లక్షల రివార్డు ఉంది.
హైదరాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులు వరసగా లొంగిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అదే బాటలో మరికొంతమంది మావోయిస్టు అగ్రనేతలు చేరారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivdhar Reddy) ఎదుట మావోయిస్టు అగ్రనేతలు ఇవాళ (మంగళవారం) లొంగిపోయారు. డీజీపీ ఎదుట మావోయిస్టు కేంద్ర కమిటీ మెంబర్ పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ శంకరన్న, చంద్రన్న, మావోయిస్టు రాష్ట్ర కమిటీ మెంబర్ బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ లొంగిపోయారు. అయితే, పుల్లూరి ప్రసాద్ రావుపై రూ.25 లక్షల రివార్డు ఉంది.
అలాగే, బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్‌లపై రూ.20 లక్షల రివార్డు ఉంది. అయితే, అజ్ఞాతంలో 64 మంది తెలంగాణ మావోయిస్టులు ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం 427 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అందులో 8 మంది రాష్ట్ర కమిటీ, మరో ఇద్దరు కేంద్ర కమిటీ మెంబర్లు లొంగిపోయారు. 9 మంది మాత్రమే తెలంగాణలో, మిగిలిన వారు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. సెంట్రల్ కమిటీలో 5 మంది తెలంగాణ మావోయిస్టులు ఉన్నారు. 10 మంది స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 20 మంది డిస్ట్రిక్ కమిటీ, 14 మంది ఏరియా కమిటీల్లో, 10 మంది తెలంగాణ కమిటీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు: డీజీపీ శివధర్ రెడ్డి
మావోయిస్టులు చంద్రన్న, బండి ప్రకాశ్ అజ్ఞాతం వీడారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పిలుపు మేరకు.. మావోయిస్టులు అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిశారని పేర్కొన్నారు. పుల్లూరి ప్రసాద్ రావుది పెద్దపల్లి జిల్లా అని తెలిపారు. చంద్రన్న15 ఏళ్లు కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారని గుర్తుచేశారు. చంద్రన్న మొదట రాడికల్ స్టూడెంట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారని వెల్లడించారు డీజీపీ శివధర్ రెడ్డి.
1980లో కిషన్‌జీకి కొరియర్‌గా చంద్రన్న పనిచేశారని గుర్తుచేశారు. 2008లోనే కేంద్ర కమిటీ మెంబర్‌గా చంద్రన్న ఉన్నారని తెలిపారు. 2024 డిసెంబర్ వరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీగా ఆయన ఉన్నారని వివరించారు. అక్టోబరు 21వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చంద్రన్న జన జీవన స్రవంతిలో కలిశారని చెప్పుకొచ్చారు. చంద్రన్న ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో అజ్ఞాతం వీడారని పేర్కొన్నారు డీజీపీ శివధర్ రెడ్డి.
మావోయిస్టు పార్టీలో చీలిక వచ్చింది: పుల్లూరి ప్రసాద్ రావు
మావోయిస్టు పార్టీలో చీలిక వచ్చిందని లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ మెంబర్ పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ శంకరన్న తెలిపారు. తీవ్ర అనారోగ్య కారణాలతో తాను జనజీవన స్రవంతిలో కలిశానని చెప్పుకొచ్చారు. ఇప్పటి నుంచి ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని వెల్లడించారు. మావోయిస్టు భావజాలానికి తానేప్పుడూ కూడా విజ్ఞుడినేనని స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీలో వచ్చిన విభేదాలు, చీలికలతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు. నక్సలైట్లు తమ సోదరులని.. లొంగిపోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి పిలుపుమేరకు తాము ప్రజలతో కలిసి పని చేయాలని భావించామని పేర్కొన్నారు. అలాగే, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు మేరకు సరెండర్ అయ్యామని పుల్లూరి ప్రసాద్ రావు స్పష్టం చేశారు.
అభివృద్ధిలో కలిసి పనిచేయడానికి లొంగిపోయాం..
‘మాది లొంగుబాటు కాదు.. అభివృద్ధిలో కలిసి పనిచేయడానికి లొంగిపోయాం. ఇప్పటివరకు ఉద్యమంలో పీడిత ప్రజల కోసమే పని చేశాను. భవిష్యత్తులో కూడా ప్రజల కోసమే పని చేస్తాను. మా సిద్ధాంతం ఓడిపోలేదు, ఓడించడం ఎవరితరం కాదు. మా భావాజాలంతో భవిష్యత్తులో మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రజల మధ్య ఉండి నేను సేవ చేయాలనుకున్నాను. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిప్పర్తి అలియాస్ దేవ్‌జీని ఎన్నుకున్నారు. దేవ్‌జిని నేను సపోర్ట్ చేస్తున్నాను. ఆయుధాలను పార్టీకి ఇచ్చి లొంగిపోయాను. కేంద్రప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్‌తో మేము లొంగిపోయాం. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడంతోనే మేము లొంగిపోయాం. రేవంత్‌రెడ్డి సూచనలతోనే జనజీవన స్రవంతిలోకి వస్తున్నాం. ఇది లొంగుబాటు కాదు.. రాబోయే రోజుల్లో ప్రజల కోసమే వస్తున్నాం. నేను ఏమి ఆశించడం లేదు. చాలామంది మావోయిస్టులు చనిపోయారు.. మా సిద్ధాంతం మేరకు ముందుకెళ్తున్నాం. మావోయిస్టు పార్టీలో అంతర్గత చీలికలు జరిగాయి. దేవోజి సీపీఐ మావోయిస్టు కార్యదర్శిగా ఉన్నారు. ఎవరి మార్గం వాళ్లు ఎంచుకున్నారు.. మేము లొంగిపోవాలని అనుకున్నాం. సోనీ మమ్మల్ని వ్యతిరేకిస్తోంది. దేశమంతా పనిచేయడానికి కేడర్ ఉంది’ అని పుల్లూరి ప్రసాద్ రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల పరిస్థితిపై సీఎం సమీక్ష..
రైలు, విమాన సర్వీసులకు బ్రేక్
Read Latest Telangana News And Telugu News