Share News

Storm Impact: రైలు, విమాన సర్వీసులకు బ్రేక్‌

ABN , Publish Date - Oct 28 , 2025 | 04:53 AM

మొంథా తుఫాను ఆందోళన కలిగిస్తోంది. కోస్తా జిల్లాలపై అధిక ప్రభావం అంచనాల నేపథ్యంలో రైల్వే శాఖ మంగళవారం భారీగా రైలు సర్వీసులను రద్దు చేసింది.

Storm Impact: రైలు, విమాన సర్వీసులకు బ్రేక్‌

  • ప్రజా రవాణాపై తుఫాన్‌ తీవ్ర ప్రభావం

  • రాష్ట్ర పరిధిలో నడిచే 100 రైళ్లు రద్దు

  • అంతే సంఖ్యలో విమాన సర్వీసులు కూడా..

  • ఉదయం లోపు నడిచే వాటికే అనుమతి

విజయవాడ/విశాఖపట్నం/రాజమహేంద్రవరం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను ఆందోళన కలిగిస్తోంది. కోస్తా జిల్లాలపై అధిక ప్రభావం అంచనాల నేపథ్యంలో రైల్వే శాఖ మంగళవారం భారీగా రైలు సర్వీసులను రద్దు చేసింది. వీటితో పాటు విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం నుంచి నడిచే దాదాపు 100 మేర విమాన సర్వీసులు రద్దయ్యాయి. విజయవాడ డివిజనల్‌ రైల్వే, వాల్తేరు డివిజన్‌ పరిధిలో 100కు పైగా రైళ్ల సర్వీసులను అధికారులు రద్దు చేశారు. కోస్తా జిల్లాల మీదుగా నడిచే మొత్తం 95 రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్లు విజయవాడ డివిజనల్‌ రైల్వే తెలిపింది. ఇప్పటికే రిజర్వేషన్‌ చేసుకున్న వారికి 24 గంటలూ రీఫండ్‌ ఇవ్వటానికి వీలుగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పరిధిలో 43 రైళ్లను రద్దు చేశారు. విజయవాడ డివిజనల్‌ రైల్వే రద్దు చేసిన సర్వీసుల్లో ప్రధానంగా తిరుపతి-విశాఖపట్నం(22708), విజయవాడ-రాజమండ్రి (67262), హైదరాబాద్‌-విశాఖపట్నం (12728), రేపల్లె-మార్కాపూర్‌ రోడ్డు (67238), విజయవాడ-ఒంగోలు (67273), కాకినాడ పోర్టు-విశాఖపట్నం(17267),విశాఖపట్నం-రాజమండ్రి(67286), మహబూబ్‌నగర్‌-విశాఖపట్నం (12862), చెన్నై సెంట్రల్‌-విశాఖపట్నం(22870), భువనేశ్వర్‌-బెంగుళూరు(18463), సికింద్రాబాద్‌-విశాఖపట్నం (12740), భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌(17015), లింగంపల్లి-విశాఖపట్నం(12806), కడప-విశాఖ(18522), రాయగడ-గుంటూరు(17244) తదితర సర్వీసులు ఉన్నాయి.


విజయవాడ నుంచి 36 విమాన సర్వీసులు బంద్‌

సోమవారం రాత్రి విజయవాడ నుంచి విశాఖ వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసు రద్దయిం ది. ఇక్కడి నుంచి 46 సర్వీసులు నడుస్తుండగా.. మంగళ వారం 36 రద్దయ్యాయి. విజయవాడ నుంచి షార్జాకు నడి చే 2సర్వీసులను రద్దు చేసింది. విజయవాడ-విశాఖ మధ్య రెండు, విజయవాడ-బెంగళూరు 2, విజయవాడ-హైదరాబాద్‌ 2 సర్వీసులను రద్దు చేసింది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వెళ్లే 18 ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సర్వీసులు రద్దయ్యాయి. కేవలం ఉదయం 10.30 గంటల వరకు విమానాలు మాత్రమే నడుస్తాయి. రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి మంగళవారం ఉదయం 9.30గంటల లోపు నడిచే సర్వీసులు మాత్రమే యథావిధిగా నడుస్తాయి. తర్వాత ముంబై, తిరుపతి, బెంగుళూరు, చెన్నైలకు వెళ్లే సర్వీసులన్నీ రద్దు చేశారు. విశాఖపట్నం విమానాశ్రయం అధికారులు కూడా విజయవాడ, హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు నగరాలకె వెళ్లే మంగళవారం నాటి ఇండిగో, ఎయిరిండియా సర్వీసులన్నింటినీ రద్దు చేశారు. దాదాపు 56 విమాన సర్వీసులకు బ్రేకులు పడ్డాయి. కాగా, తుఫాన్‌ ముప్పు నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ సోమవారం విజయవాడ డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియాతో అత్యవసర సమావేశం నిర్వహించారు

Updated Date - Oct 28 , 2025 | 09:07 AM