DGP Jitender Comments on Maoists: మావోయిస్టు సుజాత లొంగుబాటుకు కారణం ఇదే..! డీజీపీ క్లారిటీ
ABN , Publish Date - Sep 13 , 2025 | 01:32 PM
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాత తెలంగాణ డీజీపీ జితేందర్ ఎదుట శనివారం లొంగిపోయారు. సీపీఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్‌గా ఉన్నారు సుజాత.
హైదరాబాద్, సెప్టెంబరు13 (ఆంధ్రజ్యోతి): మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాత తెలంగాణ డీజీపీ జితేందర్ (Telangana DGP Jitender) ఎదుట ఇవాళ(శనివారం) లొంగిపోయారు. సీపీఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్‌గా (CPI Maoist Central Committee) సుజాత ఉన్నారు. సుజాత అలియాస్ పోతుల కల్పన గద్వాలకు చెందిన వారు. 1984లో కిషన్‌జీని వివాహం చేసుకున్నారు సుజాత. ఆమె మొత్తం 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు. 43 ఏళ్లుగా ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. సుజాత లొంగుబాటు అనంతరం డీజీపీ జితేందర్ మీడియాతో మాట్లాడారు.
మావోలతో చర్చలతో ఉపయోగం లేదు..
‘మావోయిస్టులతో చర్చలతో ఏలాంటి ఉపయోగం లేదు. గతంలో జరిగిన చర్చలతో ఏలాంటి ఫలితాలు రాలేదు. 43 ఏళ్లుగా నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో పనిచేశారు సుజాత (Sujatha). అనారోగ్యం దృష్ట్యా సుజాత లొంగిపోయారు. ఆమెపై రూ.25 లక్షల రివార్డు ఉంది. ఆ రివార్డు మొత్తాన్ని డీడీ రూపంలో సుజాతకు అందజేస్తాం. పునరావాసంలో భాగంగా అన్ని ప్రయోజనాలు అందేలా చూస్తాం. ఆగు మల్లోజుల కోటేశ్వరావు అలియాస్ కిషన్‌జీని ఆమె వివాహం చేసుకున్నారు. 2011 నవంబర్‌లో కిషన్ జీ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. సుజాత తన అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఏడాది ఇప్పటివరకు 404 మంది యూజీ క్యాడర్లు, నలుగురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక డివిజన్ కమిటీ కార్యదర్శి, 8 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 34 మంది ఏరియా కమిటీ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు’ అని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు.
మావోల లొంగుబాటు సాధ్యం కాదు..
‘ప్రస్తుతం సీపీఐ మావోయిస్టు పార్టీలో తెలంగాణకి చెందిన వారు 78 మంది మాత్రమే ఉన్నారు. 15 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో 10 మంది తెలంగాణకు చెందినవారు ఉన్నారు. మావోయిస్టుల (Maoist Surrender process) లొంగుబాటు అనేది అంత సులభంగా జరుగదు. మావోయిస్టులు రెండు, మూడు రోజుల్లో లొంగుబాటనేది సాధ్యం కాదు. పోలీసులకు మావోలు లొంగిపోవాలంటే ప్రాసెస్ ఉంటుంది. దాని ప్రకారం లొంగిపోతారు. గతేడాది 22 మంది మావోయిస్టులు తెలంగాణలో (Telangana) జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. గతంలో కూడా పోలీసులకు మావోయిస్టులకు మధ్య చర్చలు జరిగాయి... అయినా కూడా ఎలాంటి ప్రగతి సాధించలేదు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టులు వారిని కాపాడుకునేందుకే చర్చల ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. తెలంగాణ కమిటీలో 11మంది మావోయిస్టులు తెలంగాణ వారు, ఇతర రాష్ట్రాల వారు 62 మంది ఉన్నట్లు గుర్తించాం. తెలంగాణ కమిటీలో మొత్తం 73మంది మావోయిస్టులు ఉన్నట్లు గుర్తించాం’ అని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ రచ్చ.. వరంగల్ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి..
భాగ్యనగరంలో మూసీ ఉగ్రరూపం.. అధికారులు అలర్ట్
Read Latest Telangana News and National News