CM Revanth Reddy: హీరోలు సినిమా లైఫ్‌ని కాదు.. రియల్ లైఫ్‌ని ఆదర్శంగా తీసుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Jun 26 , 2025 | 07:24 PM
హీరోలు సినిమా పాత్రలనే కాదు.. నిజజీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ జోలికి వెళ్లలేదని చెప్పారు. హీరోలు రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ ఇంత పెద్ద సాయికి ఎదిగారంటే వాళ్లు డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఉండటమే కారణమని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.

హైదరాబాద్: హీరోలు సినిమా పాత్రలనే కాదు.. నిజజీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) సూచించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ జోలికి వెళ్లలేదని చెప్పారు. హీరోలు రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ ఇంత పెద్ద సాయికి ఎదిగారంటే వాళ్లు డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఉండటమే కారణమని ఉద్ఘాటించారు. హీరో విజయ దేవరకొండ కూడా నల్లమల అడవి నుంచే వచ్చారని గుర్తుచేశారు. ఎక్కడ గంజాయి పండించినా ఈగల్ కనిపెడుతుందని అన్నారు. ఈరోజు నుంచి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోని ఈగల్(ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్)గా నామకరణం చేస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఈగల్ లోగోను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. డ్రగ్స్ నియంత్రణ కోసం ఈగల్ వ్యవస్థని ఏర్పాటు చేశామని తెలిపారు. డ్రగ్స్, గంజాయి అమ్మితే వెన్నువిరిచేస్తామని హెచ్చరించారు సీఎం రేవంత్‌రెడ్డి.
ప్రపంచ యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా ఇవాళ(గురవారం) శిల్పా కళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి, సినీ హీరోలు రామ్‌చరణ్, విజయ దేవరకొండ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (TASK), ఇతర భాగస్వాముల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ పలు స్టాల్స్, బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వారం రోజుల పాటు డ్రగ్స్ నివారణపై అవగాహన సదస్సులు జరుగనున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిసలైతే దేశం మనుగడకే ప్రమాదమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. డ్రగ్స్ నివారణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలని కోరుకున్నారు. తెలంగాణ అంటే ఐటీ, ఫార్మా రంగాలకు ప్రాచుర్యం పొందిందని తెలిపారు. ఐటీ, ఫార్మా హబ్‌గా ఉన్న తెలంగాణ డ్రగ్స్ హబ్‌గా మారొద్దని చెప్పారు. ప్రపంచంతో పోటీపడే శక్తి తెలంగాణకు ఉందని ఉద్ఘాటించారు. మనం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే తీరని నష్టం జరుగుతుందని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
డ్రగ్స్‌ను ఉక్కుపాదంతో అణిచివేస్తాం..
‘తెలంగాణ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉంది. పోరాట స్పూర్తి నుంచి వచ్చిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. ఉద్యమ స్పూర్తితో ముందుకెళ్లాల్సిన తెలంగాణ రాష్ట్రానికి డ్రగ్స్ ఆటంకంగా ఉంది. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే రాష్ట్రంలో డ్రగ్స్‌ను ఉక్కుపాదంతో అణిచివేస్తానని చెప్పా.. అలాగే చేస్తున్నాను. అత్యధిక యువత ఉన్న మన దేశం ఒలింపిక్స్‌లో రాణించకపోతుంది. 68శాతంతో ప్రపంచంలో అత్యధికంగా యువత ఉన్న దేశం మన భారతదేశం. యువత గంజాయికి బానిస అయితే దేశం మనుగడ సాధించగలదా..? దేశానికి హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు ఉక్కు కవచంగా ఉండాల్సింది పోయి.. ఆ రాష్ట్రాల్లోని యువత అంతా డ్రగ్స్‌కి బానిసలు అయ్యారు. యువతకు స్ఫూర్తిని, ఆదర్శంగా నిలవడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాను. యువతను సరైన మార్గంలో పెట్టాలి. వారికి సరైన అవకాశాలు కల్పించాలని స్పోర్ట్స్ పాలసీని, స్కిల్ యూనివర్సిటీని తీసుకువచ్చాం. డిమాండ్ అండ్ సప్లైలో ఉన్న గ్యాప్‌ని నింపడానికి స్కిల్ యూనివర్సిటీని తీసుకువచ్చాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
స్పోర్ట్స్ హబ్‌గా తెలంగాణ..
‘చాలా చిన్న దేశమైన సౌత్ కొరియాలోని ఒక్క అమ్మాయి మూడు మెడల్స్ సాధిస్తే, 140 కోట్ల జనాభా ఉన్న మనం ఒక్కటి కూడా సాధించలేదు. వేరే దేశాల నుంచి నాణ్యమైన కోచ్‌లను హైదరాబాద్‌కు తీసుకువచ్చి, ఒక స్పోర్ట్స్ హబ్‌గా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దబోతున్నాం. 2047 వరకు 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ స్థాయికి మన రాష్ట్రాన్ని తీసుకెళ్లాలి. నేను కూడా జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానంటే నా కమిట్‌మెంటే కారణం. స్కూలు, కాలేజ్ యాజమాన్యాలు కూడా డ్రగ్స్ నిషేధం కోసం బాధ్యత తీసుకోవాలి. విద్యార్థుల చెడు ప్రవర్తనను మార్చేందుకు మంచి సైకాలాజికల్ టీచర్స్‌ని నియమించుకోండి. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా డ్రగ్స్‌పైన అవగాహన కల్పించాలని కలెక్టర్లకు, రాష్ట్ర సీఎస్‌కు ఆదేశిస్తున్నాను. పాఠశాల పరిసరాల్లో డ్రగ్స్ ఐస్‌క్రీమ్, డ్రగ్స్ చాక్లెట్లు అమ్మితే మాకు సమాచారం ఇవ్వండి. మీరు, మేము కలిస్తేనే ఆరోగ్య తెలంగాణను సాధిస్తాం. ముంబై , ఢిల్లీతో కాదు మనం న్యూయార్క్‌తో పోటీపడాలి. నిఖత్ జరీన్ , మహమ్మద్ సిరాజ్ లాంటి క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి ఒక్కసారి కూడా సిగరెట్, డ్రగ్స్ తీసుకోలేదు: ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన జీవితంలో ఒక్కసారి కూడా సిగరెట్, డ్రగ్స్ తీసుకోలేదని బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి మన అందరికీ ఆదర్శమని కొనియాడారు. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా మాదక ద్రవ్యాలని నిరోధించడానికి చాలా నిధులు వెచ్చిస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను కేటాయించిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌కి దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సూచించారు.
కన్స్యూమర్లను డీ అడిక్షన్ సెంటర్లకు తరలిస్తాం: సందీప్ శాండిల్య
ఒక్క గోవాలోనే ఒక్కో హవాలా ఆపరేటర్ 2 రోజుల్లో రూ.50 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ని అమ్ముతున్నారని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా సరే చట్టరీత్యా నేరమేనని హెచ్చరించారు. గతంలో డ్రగ్స్ కన్స్యూమర్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపే వాళ్లమని, కానీ ఇప్పుడు ఈ పాలసీలో మార్పులు తెస్తున్నామని అన్నారు. డ్రగ్స్ తీసుకుంటే కస్టడీకి తీసుకుని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని తెలిపారు. కన్స్యూమర్లను డీ అడిక్షన్ సెంటర్లకు తరలిస్తామని సందీప్ శాండిల్య పేర్కొన్నారు.
డ్రగ్స్‌కి దూరంగా ఉండాలి: పుల్లెల గోపీచంద్
డ్రగ్స్, స్మోకింగ్ చాలా సంతోషం ఇస్తాయని కొంతమంది అనుకుంటారని.. కానీ అదంతా భ్రమే అని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. ఒక్కసారే అని చెప్పి డ్రగ్స్‌ని అలవాటుగా చేసుకోని జీవితాలను కోల్పోతున్నారని అన్నారు. డ్రగ్స్‌కి దూరంగా ఉండాలని పుల్లెల గోపీచంద్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాకిస్థాన్‌పై మరోసారి నిప్పులు చెరిగిన రక్షణ మంత్రి
నదిలో పడిన బస్సు.. ఒకరు మృతి.. ప్రయాణికులు గల్లంతు
For Telangana News And Telugu News