Share News

Actress Aamani: బీజేపీలోకి సినీనటి ఆమని.. ముహూర్తం ఫిక్స్

ABN , Publish Date - Dec 20 , 2025 | 10:20 AM

ప్రముఖ సినీనటి ఆమని శనివారం భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరనున్నారు. ఈ చేరిక కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరగనుంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకోనున్నారు.

Actress Aamani: బీజేపీలోకి సినీనటి ఆమని.. ముహూర్తం ఫిక్స్
Actress Aamani

హైదరాబాద్, డిసెంబరు20 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీనటి ఆమని (Actress Aamani) ఇవాళ (శనివారం) భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరనున్నారు. ఈ చేరిక కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరగనుంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకోనున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఆమని రాజకీయ రంగప్రవేశం చేయడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.


ఆమనితో పాటు మరికొందరు సినీనటులు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సినీ రంగానికి చెందిన ప్రముఖులు రాజకీయ పార్టీలో చేరడం కొత్తేమీ కాకపోయినా.. ఆమని చేరికకు ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోంది. ఆమెకు ఉన్న అభిమాన బలం, సామాజిక అంశాలపై గతంలో ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు బీజేపీకి ఉపయోగపడతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.


ఇటీవలే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో ఆమని భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, బీజేపీ లక్ష్యాలు, ప్రజాసమస్యలు వంటి పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళా సాధికారత, యువతకు అవకాశాలు, సంస్కృతి – సంప్రదాయాల పరిరక్షణ వంటి అంశాలపై ఆమని ఆసక్తి వ్యక్తం చేశారు.


ఈ సమావేశంలో తాను బీజేపీలో చేరనున్నట్లు ఆమని స్పష్టంగా ప్రకటించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాజకీయాల్లోకి రావాలన్న తన నిర్ణయం వెనుక ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్షే ప్రధాన కారణమని ఆమని పేర్కొన్నారు. సినీ రంగంలో పనిచేసిన అనుభవంతో పాటు సమాజాన్ని దగ్గర నుంచి గమనించిన నేపథ్యంలో ప్రజాసమస్యలను రాజకీయ వేదికపై లేవనెత్తాలని ఆమని భావించారు.


ఈ నేపథ్యంలో నేడు ఆమని బీజేపీలో చేరనుండటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆమె చేరికతో బీజేపీకి సినీ, సాంస్కృతిక రంగాల్లో మరింత బలం చేకూరుతుందని పార్టీ నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.


రానున్న రోజుల్లో ఆమని ఏ విధమైన రాజకీయ పాత్ర పోషిస్తారు, ఆమెకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు సినీ అభిమానుల మద్దతు, మరోవైపు పార్టీ శ్రేణుల సహకారంతో ఆమె రాజకీయ ప్రయాణం ఎలా సాగుతుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తంగా, సినీనటి ఆమని బీజేపీలో చేరిక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు, అంచనాలకు దారితీయనుందని చెప్పొచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

సింగరేణి కార్మికుల సమస్యలు పట్టవా.. రేవంత్ ప్రభుత్వంపై కవిత ఫైర్

రామ్ సుతార్ మృతి శిల్ప కళకు తీరని లోటు: కేసీఆర్

Read Latest Telangana News and National News

Updated Date - Dec 20 , 2025 | 10:33 AM