KCR: రామ్ సుతార్ మృతి శిల్ప కళకు తీరని లోటు: కేసీఆర్
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:40 AM
ప్రపంచ ప్రఖ్యాత శిల్పకారుడు, పద్మ భూషణ్ రామ్ వంజీ సుతార్ మృతిపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.
హైదరాబాద్, డిసెంబరు19 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాత శిల్పకారుడు, గుజరాత్ సర్దార్ పటేల్ ఐక్యతా శిల్పం రూపకర్త, హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ రూప శిల్పి, పద్మ భూషణ్ రామ్ వంజీ సుతార్ (Ram Vanji Sutar) మృతిపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రముఖుల విగ్రహాలకు రూపం పోసి.. ప్రపంచ స్థాయి ప్రతిభను కనబరిచి, శిల్ప కళా రంగంలో కోహినూర్ వజ్రంగా పోల్చదగిన రామ్ సుతార్ శిల్ప కళా సేవలను, బాబా సాహెబ్ అంబేద్కర్ రూపంలో తెలంగాణ రాష్ట్రం వినియోగించుకోవడం గర్వ కారణమని కీర్తించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్మాణంలో, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా, డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తులో అత్యంత సుందర మనోహరంగా తీర్చిదిద్దారని కొనియాడారు. రామ్ సుతార్ తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని ప్రశంసించారు.
వారి మరణం, శిల్ప కళా రంగానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. నిండు నూరేళ్ల జీవితాన్ని పరిపూర్ణంగా కొనసాగించి దివంగతులు అయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా రామ్ వంజీ సుతార్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగరేణి కార్మికుల సమస్యలు పట్టవా.. రేవంత్ ప్రభుత్వంపై కవిత ఫైర్
హైదరాబాద్‌లో చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం.. అట్లకాడతో కాల్చి..
Read Latest Telangana News and National News