Minister Uttam ON Irrigation Department: ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
ABN , Publish Date - Oct 07 , 2025 | 06:50 PM
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి పారుదల శాఖ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ప్రకారం కొనసాగిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్, అక్టోబరు7 (ఆంధ్రజ్యోతి): మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) నీటి పారుదల శాఖ (Irrigation Department) అధికారులతో ఇవాళ(మంగళవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ప్రకారం కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఉద్ఘాటించారు. తుమ్మడిహట్టి వద్ద రెండు ప్రత్యామ్నాయ మార్గాలపై పరిశీలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నొక్కిచెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల పునరుద్ధరణలో ఐఐటీని భాగస్వామ్యం చేస్తామని వెల్లడించారు. వర్షాకాలం అనంతరం రూపకల్పన చేసి ఒక సంవత్సరంలో వీటిని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అలాగే, కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ -II విచారణ పురోగతిపై సమీక్షించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
సమ్మక్క – సారక్క ప్రాజెక్టు, దేవదుల ప్రాజెక్టులపై సమీక్షించారు. భూ సేకరణ పరిహారంగా రూ.33 కోట్లు విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. డిండి ప్రాజెక్టుపై మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. రిజర్వాయర్ల సామర్థ్య పెంపు కోసం కొత్త విధానం సిద్ధం చేయాలని మార్గనిర్దేశం చేశారు. ఐఎస్‌డబ్ల్యూఆర్డ్, సీడీఓ బలోపేతంపై ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.
కేంద్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించాలి..
అలాగే, పౌరసరఫరా శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. వర్షాకాలం ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ రికార్డ్ సాధించిందని తెలిపారు. 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని వివరించారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధం చేశామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 67.57 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోందని చెప్పుకొచ్చారు. 40.75 లక్షల ఎకరాల్లో సన్నాలు వేశారని వివరించారు. 26.82 లక్షల ఎకరాల్లో దొడ్డు వడ్ల సాగవుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బియ్యం సబ్సిడీ రూ.6,500 కోట్లు తక్షణమే విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Read Latest Telangana News And Telugu News