Share News

TG Govt On Jobs: గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీ

ABN , Publish Date - Oct 25 , 2025 | 03:47 PM

త్వరలో 14వేల అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల నియామకాన్ని చేపట్టబోతున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహిళా శిశు సంక్షేమాన్ని తమ ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకుందని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.

TG Govt On Jobs: గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీ
Minister Seethakka On Jobs

హైదరాబాద్ అక్టోబరు25 (ఆంధ్రజ్యోతి): త్వరలో 14వేల అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల (Anganwadi Teacher Helpers) నియామకాన్ని చేపట్టబోతున్నామని మంత్రి సీతక్క (Minister Seethakka) స్పష్టం చేశారు. మహిళా శిశు సంక్షేమాన్ని తమ ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకుందని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ఎన్నో సవాళ్లు ఉన్నా ఆకాశాన్ని చీల్చుకొని అంతరిక్షం వరకు మహిళలు చేరుకుంటున్నారని ఉద్ఘాటించారు. ఐసీడీఎస్ సేవలకు భారతదేశంలో దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రాణం పోశారని నొక్కిచెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ వన్ సూపర్‌వైజర్లుగా నియమితులైన అభ్యర్థులకు నియామక పత్రాలని ఇవాళ(శనివారం) మంత్రి సీతక్క అందజేశారు. ఈ సందర్భంగా గ్రేడ్ వన్ సూపర్‌వైజర్లుగా నియమితులైన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో ముచ్చటించారు మంత్రి సీతక్క.


ఇందిరాగాంధీ ప్రతి మహిళకు గౌరవం: మంత్రి సీతక్క

Minister Seethakka.jpg

ఈరోజు 181 మంది సూపర్‌వైజర్లుగా నియామక పత్రాలు అందుకున్నారని చెప్పుకొచ్చారు. వేల మందితో పోటీ పడి మీరు ఈ కొలువులు సాధించారని తెలిపారు. మీ నిరీక్షణలు ఫలించాయని అన్నారు. మీ ఉద్యోగ కలలను సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని ఉద్ఘాటించారు. ప్రజల ఆశలు, అవసరాల మేరకు మీ వృత్తి ధర్మం ఉండాలని సూచించారు. ఉక్కు మహిళ ఇందిరాగాంధీ ప్రతి మహిళకు గౌరవం, ప్రతి చిన్నారికి సంరక్షణ ఉండాలనే లక్ష్యంతో ఐసీడీఎస్ సేవలను, అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించారని గుర్తుచేశారు. అంగన్వాడీ కేంద్రాలకు తెలంగాణలోనే మొదటిసారిగా ప్రారంభించారని వివరించారు. 1970లో మహబూబ్‌గర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అంగన్వాడీ సేవలను ప్రారంభించారని తెలిపారు. అక్కడ సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా అంగన్వాడీ సేవలను ఇందిరా గాంధీ విస్తరించారని పేర్కొన్నారు మంత్రి సీతక్క.


అంగన్వాడీలను పటిష్ట పరుస్తాం..

‘అంగన్వాడీ హెల్పర్ నుంచి మహిళా శాఖ సెక్రెటరీ వరకు ఈరోజు కొలువులు ఉన్నాయంటే అదంతా ఇందిరాగాంధీ చలువే. అందుకే ప్రతి ఒక్క మహిళ ఇందిరా గాంధీకి రుణపడి ఉండాలి. మన రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను పటిష్ట పరుస్తున్నాం. పౌష్టికాహారానికే అంగన్వాడీ కేంద్రాలను పరిమితం చేయకుండా.. ప్రాథమిక విద్యను సైతం చిన్నారులకు అందజేస్తున్నాం. అమ్మ ఆప్యాయతకు నిలయాలుగా అంగన్వాడీ కేంద్రాలు మారుతున్నాయి. అంగన్వాడీ చిన్నారులకు 57 రకాల ఆట వస్తువులు, యూనిఫామ్‌లు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. మన దేశ భవిష్యత్తు అంగన్వాడీ కేంద్రాల్లోనే ఉంది. అందుకే ప్రతి ఒక్క సూపర్‌వైజర్ తన వృత్తి ధర్మాన్ని నిక్కచ్చిగా పాటించాలి’ అని సూచించారు మంత్రి సీతక్క.


తప్పటడుగులు వేయొద్దు..

‘ఒక్కో సూపర్‌వైజర్ కింద 25 అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి. అంగన్వాడీ కేంద్రాల్లో ఎక్కడా చిన్న లోపం లేకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత మీదే. నియామక పత్రాలు అందుకొని ఈరోజు నుంచి మీరు మహిళా శిశు సంక్షేమ శాఖలో సూపర్‌వైజర్లుగా పనిచేస్తున్నారు. మీ ఉద్యోగ బాధ్యతల్లో ఇది ప్రాథమిక దశ... ఎలాంటి తప్పటడుగులు వేయొద్దు. పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. తెలంగాణలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో సూపర్‌వైజర్లు కీలక పాత్ర పోషించాలి. మెరుగైన, బలమైన తెలంగాణ నిర్మాణంలో మీరంతా భాగస్వాములు కావాలి. అంగన్వాడీ చిన్నారులపై కేవలం సానుభూతి ఉంటే సరిపోదు. అంగన్వాడీ సిబ్బందికి ఎన్నో రకాల ప్రయోజనాలు కల్పిస్తున్నాం’ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుండాలకి రక్షణ కల్పిస్తున్న రేవంత్‌ ప్రభుత్వం.. ప్రవీణ్ కుమార్ ఫైర్

నాగుల చవితి.. తెల్లవారే పుట్టలో పాలు పోసిన మండలి బుద్ధ ప్రసాద్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 25 , 2025 | 04:23 PM