Minister Ponguteti: తెలంగాణలో రైతుల కోసం కొత్త చట్టం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:41 AM
Minister Ponguteti Srinivasa Reddy: పేదవాడికి అండగా ఉండేలా భూభారతి చట్టం తెచ్చామని న్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. . గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణిలోని తప్పులను ఆడిటింగ్ చేసి అసలైన రైతులకు మేలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.
నారాయణపేట జిల్లా: భూ భారతి చట్టంతో రైతుల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇవాళ(గురువారం) నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలో భూభారతి పోర్టల్, రెవెన్యూ సదస్సు, గ్రామసభను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనినాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎన్ని ఇబ్బందులు ఎదురైన అమలు చేసేందుకు ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు తెచ్చినా ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉద్ఘాటించారు.
కేసీఆర్ తెచ్చిన ఆ చట్టంతో కన్నీళ్లు...
2020లో గత కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన రెవెన్యూ చట్టం రైతులను కన్నీళ్లు పెట్టించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సైతం భూభారతి చట్టాన్ని పరోక్షంగా అభినందిస్తున్నారని అన్నారు. పేదవాడికి అండగా ఉండేలా ఈ చట్టం తెచ్చామని చెప్పారు. దేశానికి ఈ చట్టం ఆదర్శం కాబోతుందని ఉద్ఘాటించారు. రైతులు దరఖాస్తు కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేదని చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణిలోని తప్పులను ఆడిటింగ్ చేసి అసలైన రైతులకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఓ అధికారిని నియమిస్తున్నామని.. తద్వారా కోర్టులో లేని రైతుల అన్ని సమస్యలకు భూ భారతితో పరిష్కారం దొరుకుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
పకడ్బందీగా భూ రికార్డులు...
మొదటి విడతలో 6 వేల లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వచ్చే నెల 2వ తేదీలోపు వారికి శిక్షణ ఇచ్చి భూ రికార్డులు పకడ్బందీగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మే ఒకటో తేదీ నుంచి కలెక్టర్లు ప్రతి మండలంలో ఈ చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి 28 జిల్లాల్లో ఒక్కొక్క మండలం చొప్పున భూ భారతి చట్టం అమలు చేస్తామని ప్రకటించారు. జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా భూభారతి చట్టం అమలు జరుగుతుందని తెలిపారు. ప్రతిపక్షాలు కూడా ఈ చట్టంతో వారి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. భూ భారతి చట్టం అమలు జరిగిన తర్వాత ఈ చట్టాన్ని అభినందించకుంటే ప్రతిపక్షాలకు వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
National Herald Case: రాజకీయ ఈడీ కేసు
CM Revanth Reddy: జపాన్‌లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్
Kanch Gachibowli: కంచగచ్చిబౌలి భూములకు అటవీ లక్షణాలు!
Read Latest Telangana News And Telugu News