Share News

Kanch Gachibowli: కంచగచ్చిబౌలి భూములకు అటవీ లక్షణాలు!

ABN , Publish Date - Apr 17 , 2025 | 05:20 AM

కంచ గచ్చిబౌలిలోని 2374 ఎకరాల భూమికి అటవీ ప్రాంత లక్షణాలు ఉన్నాయని సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారిక కమిటీ (సీఈసీ) నివేదికలో వెల్లడించింది. ఈ భూమి పారదర్శకంగా బదిలీ చేయడం, పర్యావరణ ప్రాధాన్యాన్ని పట్టించుకోకుండా అభివృద్ధి పనులు చేపట్టడం ఆందోళన కలిగించే విషయం అని కమిటీ తెలిపింది.

Kanch Gachibowli: కంచగచ్చిబౌలి భూములకు అటవీ లక్షణాలు!

నిబంధనలు తుంగలో తొక్కి చెట్లు కూల్చేశారు.. జంతుజాలం మనుగడను ప్రమాదంలో పడేశారు

సుప్రీంకు కేంద్ర సాధికారిక కమిటీ నివేదిక

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలిలోని 2374 ఎకరాల 2 గుంటల భూమికి ప్రాథమిక ఆధారాల ప్రకారం అటవీ ప్రాంత లక్షణాలున్నాయని.. ఈ అంశంపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారిక కమిటీ (సీఈసీ) తన నివేదికలో తెలిపింది. అయితే, దీనిపై తమ ఆదేశాల మేరకు ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తున్న సమీక్ష పూర్తయిన తర్వాతే అంతిమ సిఫారసులను సమర్పించగలమని అందులో పేర్కొంది. ఈ భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులనుంచి ఇంకా అనేక పత్రాలు, సమాచారం రావాల్సి ఉందని.. చదును చేసిన భూమి, మిగతా భూమి అటవీ ప్రాంతం క్రిందకు వస్తుందా అన్నదానిపై తుది నివేదిక సమర్పించేందుకు నాలుగు వారాల సమయం అవసరమని పేర్కొంది. చారిత్రక పత్రాలు, ఒప్పందాల ప్రకారం చూస్తే ఈ అటవీ భూమిహైదరాబాద్‌ యూనివర్సిటీదేనని ప్రాథమికంగా స్పష్టమవుతోందని (ప్రైమాఫేసీ) తెలిపింది. ప్రభుత్వం పారదర్శకత, నిజాయితీ లేకుండా టీజీఐఐసీకి ఈ భూమిని బదిలీ చేసిందని కమిటీ అభిప్రాయపడింది. క్రీడల అకాడమీ కోసం గతంలో ఒక సంస్థకు కేటాయించిన ఈ భూమిని టీజీఐఐసీకి ధారాదత్తం చేయడం ఎంవోయూ నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా పరిశీలించాలని తెలిపింది.


ఆ ప్రాంత పర్యావరణ ప్రాధాన్యాన్ని సరిగా పరిశీలించకుండా బీకన్‌ ట్రస్టీ షిప్‌ లిమిటెడ్‌ అనే సంస్థకు భూమిని తాకట్టుపెట్టడం, రూ.పది వేల కోట్ల మేరకు బాండ్లు జారీ చేయాలని నిర్ణయించడం, అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించడం ఆందోళనకరమని సీఈసీ స్పష్టం చేసింది. అక్కడ వంద రకాల చెట్లను కూల్చి వేశారని, వేల సంవత్సరాల రాతి నిర్మాణాలను కుప్పకూల్చేశారని, అనేక జంతుజాలాల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చారని విమర్శించింది. అసలు డీపీఆర్‌ తయారు చేయకుండా, సరైన అనుమతులు లేకుండా ఆగమేఘాలపై టీజీఐఐసి భూమిని చదును చేయాలని ప్రయత్నించడం బాధ్యతాయుత పాలన క్రిందకు రాదని, సంస్థాగత స్వతంత్రత, పర్యావరణ జవాబుదారీకి విరుద్ధమని తీవ్రంగా విమర్శించింది. పర్యావరణ ఉల్లంఘనలు, యాజమాన్య అంశాలను పరిశీలించేందుకు ఒక స్వతంత్ర ఏజెన్సీ దర్యాప్తు అవసరమని, రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత యంత్రాంగం ఈ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేందుకు సరిపోదని తేల్చింది. యూనివర్సిటీకి కేటాయించిన భూమి కూడా ‘కంచ అస్తబల్‌ పోరంబోక్‌ సర్కారీ’గా రికార్డుల్లోకెక్కిందని చెప్పిన కమిటీ.. సుప్రీంకు సమర్పించిన నివేదికలో ఎనిమిది కీలక సిఫారసులు చేసింది. అవేంటంటే..


సుప్రీం తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకూ ఈ భూమిపై ఎలాంటి చర్యలూ తీసుకోరాదు.

అటవీ ప్రాంతంలా ఉన్న భూమిని గుర్తించేందుకు అటవీ అధికారులు, వన్యప్రాణి నిపుణులు, పర్యావరణ వేత్తలు, ఐటీ, రిమోట్‌ సెన్సింగ్‌ నిపుణులు, సర్వే ఏజెన్సీలను కూడా చేర్చి నిపుణుల కమిటీని పునర్వ్యవస్థీకరించాలి.

వన సంరక్షణ, సంవర్ధన చట్టం, 2023 ప్రకారం కచ్చితంగా, పర్యావరణపరంగా, సరైన వర్గీకరణ చేసేందుకు వీలుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల గుర్తింపునకు వేర్వేరు ప్రమాణాలను అవలంబించేలా గౌరవ న్యాయస్థానం ఆదేశించాలి.

టీజీఐఐసీ ఉద్దేశపూర్వకంగానే వాయు కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం 1981, జల కాలుష్య నివారణ చట్టం 1974 కింద అనుమతులకు దరఖాస్తు చేసుకుంది. పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్‌ 2006 కింద అనుమతి పొందకుండా తప్పించుకుంది. ఈ అంచనాను నిర్వహించడాన్ని, పర్యావరణ యాజమాన్య ప్రణాళికను రూపొందించడాన్ని తప్పించుకునేందుకే ఇదంతా చేసినట్లు కనపడుతోంది. అలా చేసినందుకు టీజీఐఐసీకి చెందిన సంబంధిత అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. టీజీఐఐసీకి అనుకూలంగా ఇచ్చిన అనుమతిని రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు వెంటనే రద్దు చేయాలి.

ఈ ప్రాంతంలోఉన్న గొప్ప జీవ వైవిధ్యం, వన్యప్రాణులు, పర్యావరణపరంగా ముఖ్యమైన చెరువులనుదృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ విఽశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న మొత్తం భూమిని పర్యావరణపరంగా సున్నితమైన జోన్‌గా రక్షించే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సమగ్ర పర్యావరణ అంచనాను నిర్వహించేంతవరకూ తదుపరి క్లియరింగ్‌, అభివృద్ధి కార్యకలాపాలను నిరోధించాలి.

13ఏ ఫారమ్‌లో తప్పుడు డిక్లరేషన్‌ ఇచ్చిన టీజీఐఐసీ అధికారులపైన.. పెద్ద ఎత్తున చెట్లను కూల్చివేసిన కాంట్రాక్టర్‌ డెల్టా గ్లోబల్‌ సర్వీసె్‌సపైన గట్టి చర్యలు తీసుకోవాలి. వారు వాడిన యంత్రాలను స్వాధీనపరుచుకోవాలి.

ప్రాథమికంగా ఈ భూమి హైదరాబాద్‌ యూనివర్సిటీ యాజమాన్యంలో ఉన్నట్టు కనపడుతోంది. అయితే ఈ భూమి యాజమాన్య స్థితిని తేల్చేందుకు చట్టపరమైన, పరిపాలనపరమైన సమగ్ర సమీక్ష జరగాల్సి ఉంది. వర్సిటీతో కుదుర్చుకున్న ఎంవోయూను దృష్టిలో పెట్టుకుని.. టీజీఐఐసి వాదనలు చెల్లుతాయా లేదా నిర్ధారించాలి.

మరిన్ని ఆర్థికపరమైన, చట్టపరమైన సమస్యలు రాకుండా.. కోర్టు ఈ భూమి ఎవరిదో తేల్చేంతవరకూ.. టీజీఐఐసీ ఈ భూమిని తాకట్టు పెట్టకుండా, లీజుకు ఇవ్వకుండా, వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించకుండా నిలిపివేయాలి.


..వర్సిటీ ప్రాంగణం బయట తగిన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను ఏర్పరచి.. యూనివర్సిటీలోకి ప్రవహించే అన్ని సీవేజ్‌ అవుట్‌లెట్లనూ 12 నెలల్లోగా జీహెచ్‌ఎంసీ మూసివేయాలని కూడా కమిటీ సూచించింది. ఈ భూమికి సంబంధించి అనేక తీవ్రమైన ఉల్లంఘనలు, ఆర్థిక అవకతవకలు జరిగిన రీత్యా.. అనుమతుల చట్టబద్ధత, థర్డ్‌ పార్టీ హక్కుల కల్పన, టీజీఐఐసీ అధికారుల పాత్రపై ఒక ప్రత్యేక ఏజెన్సీ ద్వారా స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కూడా కమిటీ అభిప్రాయపడింది.

టీజీఐఐసీ నిర్లక్ష్యం..

టీజీఐఐసి మొదటి దశలో 122 ఎకరాల భూమిని అభివృద్ధి చేసే ప్రయత్నం చేసిందని సీఈసీ తెలిపింది. అందులో భాగంగా భారీ యంత్రాలను ఉపయోగించి చెట్లను కుప్పకూల్చివేశారని పేర్కొంది. తెలంగాణ జల, భూమి, వృక్షాల చట్టం, 2002 ప్రకారం.. ఒక వ్యక్తి తన భూమిలో మినహాయింపు పొందిన చెట్లను కూల్చి వేయాలంటే ఫారెస్ట్‌ డివిజనల్‌ అధికారికి 13 ఏ క్రింద అనుమతి కోరుతూ స్వీయ ధ్రువీకరణ ఇచ్చి, నిర్దిష్ట రుసుము కట్టి కూల్చివేసుకోవచ్చనని తెలిపింది. కానీ చిల్కూరు అటవీ రేంజ్‌ అధికారి ఆ ప్రాంతాన్ని తనిఖీ చేసినప్పుడు ఎలాంటి మినహాయింపు లేని 125 చెట్లను కూడా కూల్చివేసినట్లు తేలిందని.. దీనిపై కేసు కూడా నమోదు చేశారని, అక్కడున్న మూడు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారని వివరించింది. ఈ పత్రాల ప్రకారం 1524 చెట్లను కూల్చివేయగా, అందులో 1399 చెట్లకు మినహాయింపు ఉన్నదని తెలిపింది. అలాగే.. అసలు ఎన్ని ఎకరాలను క్లియర్‌ చేశారో కూడా స్పష్టత లేదని, అధికారిక సమావేశంలో 122 ఎకరాలను క్లియర్‌ చేస్తున్నామని చెప్పిన టీజీఐఐసీ.. డీఎ్‌ఫవోకు సమర్పించిన 13ఏ ఫారమ్‌లో మాత్రం 150 ఎకరాలని పేర్కొందని, పోలీసు శాఖకు పంపిన లేఖలో 400 ఎకరాలని వివరించిందని సీఈసీ వెల్లడించింది.


ఆ ప్రాంతంలోని పర్యావరణ ప్రాముఖ్యం, సుసంపన్నమైన జీవ వైవిధ్యం గురించి టీజీఐఐసీకి ఎలాంటి పట్టింపూ లేదని విమర్శించింది. ఇక్కడ అత్యంత అరుదైన, పర్యావరణ పరమైన రాతినిర్మాణాలున్నాయని.. పుట్టగొడుగు శిల వంటి ప్రత్యేక నిర్మాణాలు కూడా ఉన్నాయని.. అవి ఏర్పడేందుకు భౌగోళిక ప్రక్రియ ద్వారా వేలాది సంవత్సరాలు పడుతుందని తెలిపింది. ఈ ప్రాంతపు సహజమైన వారసత్వ సంపదలో ఇది ముఖ్యమైన భాగమని పేర్కొంది. అవి సరీసృపాలు, పక్షులు, కీటకాలు, చిన్న క్షీరదాల వంటి వివిధ జంతు జాతులకు నిలయమని సీఈసీ తన నివేదికలో వివరించింది. అయితే ఇటీవల చదును చేసే ప్రక్రియలో భాగంగా ఇలాంటి ఎన్నో రాతి నిర్మాణాలను భారీ యంత్రాలతో నిర్లక్ష్యంగా కుప్పకూల్చి విధ్వంసం చేశారని.. దీని వల్ల పూడ్చలేని నష్టం జరిగిందని తెలిపింది. అనేక జంతుజాతుల మనుగడ ప్రమాదంలో పడడం మాత్రమే కాక పర్యావరణ సమతౌల్యం దెబ్బతిన్నదని వెల్లడించింది. ఈ భూముల్లో జింకలు, నెమళ్లు, సరీసృపాలు ఉన్నాయని.. పీకాక్‌ లేక్‌, గున్నేరు లేక్‌, గుంట్లకుంట, చిలుకల కుంట అనే నాలుగు చెరువులు ఉన్నాయని తెలిపింది.


ఇవి కూడా చదవండి...

Rahul Gandhi: రెండు రకాల గుర్రాలు.. గుజరాత్‌లో కాంగ్రెస్ వ్యూహంపై రాహుల్

BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్

Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ

Ramdev: రామ్‌దేవ్ 'షర్‌బత్ జిహాద్' వ్యాఖ్యలపై దిగ్విజయ్ కేసు

Updated Date - Apr 17 , 2025 | 05:20 AM