National Herald Case: రాజకీయ ఈడీ కేసు
ABN , Publish Date - Apr 17 , 2025 | 05:16 AM
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ తప్పుడు కేసు నమోదు చేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం చట్టం అతిక్రమించి కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టి, రాజకీయ దృష్టికోణంలో వారిని లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు.

ఈడీ, సీబీఐలు బీజేపీ జేబు సంస్థలుగా మారాయి.. బీజేపీ కేసులకు కాంగ్రెస్ భయపడదు
ఈడీ చార్జిషీట్‌లో సోనియా, రాహుల్ పేర్లు చేర్చడంపై నిరసన, ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్
నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ఈడీ కార్యాలయం ముందు భారీ ధర్నా
రాంనగర్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): నేషనల్ హెరాల్డ్ కేసులో రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తప్పుడు కేసు నమోదు చేసినట్టు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ ఆరోపించారు. తమ పార్టీకి చెందిన పత్రికలో తాము పెట్టుబడులు పెడితే మనీలాండరింగ్ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అమలు, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంతో కాంగ్రెస్, రాహుల్‌గాంఽధీకి వచ్చిన ప్రజాదరణ చూసి తట్టుకోలేకే ఈడీ చార్జిషీట్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ పేర్లను మోదీ ప్రభుత్వం నమోదు చేయించి డైవర్షన్ పాలిట్రిక్స్‌కు పాల్పడుతోందని విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌గాంఽఽధీల పేర్లను ఈడీ చార్జిషీట్‌లో నమోదు చేయడాన్ని నిరసిస్తూ రాజ్యసభ సభ్యులు ఎం.అనిల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో ఆదర్శనగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి టెలికామ్ భవన్ వరకు నల్ల జెండాలతో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీకి వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా మహేశ్ కుమార్‌గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.అంజన్‌కుమార్‌యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, మాజీ ఎమ్మెల్యే కూనశ్రీశైలంగౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడుతున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఈడీ, సీబీఐలు బీజేపీ జేబు సంస్థలుగా మారాయని ఆయన ఆరోపించారు. 2014 నుంచి ఆ సంస్థలు పెట్టిన కేసుల్లో 95 శాతం కాంగ్రెస్ నేతలపైనే ఉద్దేశపూర్వకంగా పెట్టారని విమర్శించారు. బీజేపీ ఎన్ని కేసులు పెట్టినా తమ పోరాటం ఆగదని, కేంద్రంలో బీజేపీని గద్దెదించే వరకు రాహుల్ పోరాడుతూనే ఉంటారన్నారు. బీజేపీ కేసులకు కాంగ్రెస్ భయపడదని చెప్పారు. అంజన్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే పార్టీ అగ్రనేతలపై ఈడీ కేసులు బనాయిస్తున్నట్టు ఆరోపించారు. అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ కేసు ప్రజాస్వామ్యవిరుద్దమన్నారు. కాగా, హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నిరసనల్లో పాల్గొన్నారు. బీజేపీ వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పోరాడుతుంటే తమ పార్టీ అగ్రనేతలను ఈడీ కేసులు, చార్జిషీట్లతో ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి...