Share News

KTR On Fire: 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కేటీఆర్ డిమాండ్

ABN , Publish Date - Aug 30 , 2025 | 11:04 AM

అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులు లేదా అంతకు మించి నిర్వహించినా తాము సిద్ధమే అని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా, అన్నింటికీ సరైన సమాధానం ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు.

KTR On Fire: 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కేటీఆర్ డిమాండ్

హైదరాబాద్: నేడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సంక్షోభంపై భారత రాష్ట్ర సమితి వినూత్న నిరసన చేపట్టింది. ఇందులో భాగంగా కనీసం 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆయన గన్‌పార్క్‌ వద్ద మీడియాతో మాట్లాడారు..


అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులు లేదా అంతకు మించి నిర్వహించినా తాము సిద్ధమే అని కేటీఆర్(KTR) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా.. అన్నింటికీ సరైన సమాధానం ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని ఏ అంశం పైననైనా సభలో చర్చకు పెడితే ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ విస్తీర్ణంతో పాటు వ్యవసాయ సంక్షేమానికి మాజీ సీఎం కేసీఆర్ చేసిన కార్యక్రమాలు, పథకాల గురించి వివరిస్తామని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం గురించి కూడా సమాధానం చెబుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.


అసమ్మతి ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలని ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే అసమ్మతి ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు(శనివారం) శాసనసభను తమకు అనుకూలంగా ఉండేలా నడిపించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రైతుల సమస్యలపైన, రాష్ట్రంలో ఉన్న ఎరువుల సంక్షోభంపైన మాట్లాడటం లేదని మండిపడ్డారు. 10 సంవత్సరాల పాటు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఇలాంటి ఎరువుల కొరత రాలేదని ఉద్ఘాటించారు. రైతులు గంటలు తరబడి లైన్లలో నిలబడాల్సిన దుస్థితి రాలేదని స్పష్టం చేశారు.


మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెప్పులను లైన్లో పెట్టడం, ఆధార్ కార్డులను లైన్లో పెట్టే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు..? పండుగ రోజు కూడా రైతులు ఎరువుల కోసం లైన్లలో నిలబడి, వర్షంలో తడిసి ఇబ్బందులు పడే దుస్థితి ఎందుకు వచ్చిందని ధ్వజమెత్తారు. పంట నష్టపోయిన రైతుల గురించి కానీ, భారీ వర్షాల వల్ల ఇబ్బందుల గురించి గానీ సుదీర్ఘంగా చర్చించే అవకాశం అసెంబ్లీలో ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ సంక్షోభం పైన అసెంబ్లీలో చర్చ పెట్టాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 600కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 75 లక్షల మంది రైతులు ఈరోజు అవస్థలు పడుతున్నారని చెప్పుకొచ్చారు.


రైతులకు కాంగ్రెస్ చేసిన మోసంపైన అసెంబ్లీలో చర్చ జరగాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీల నుంచి 420 హామీల అమలు వైఫల్యాల దాకా అన్ని అంశాల పైన చర్చిద్దామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వాటి పైన కూడా చర్చ జరగాలని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండే ఒకటి రెండు అంశాల పైననే మాట్లాడే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల కష్టాలు, సమస్యలపైన చర్చలకు అసెంబ్లీ వేదిక కావాలని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరంతో పాటు అన్ని అంశాలపైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అది పీసీ గోష్ కమిషన్ కాదు, అది కాంగ్రెస్ పార్టీ వేసుకున్న పీసీసీ గోష్ కమిషన్ అని ఎద్దేవా చేశారు. దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి:

ఉసిరితోనూ సైడ్ ఎఫెక్ట్స్.. వీటిని ఎవరు తినకూడదంటే..

బీపీ ఔషధాలు పని చేయట్లేదా.. కారణాలు ఇవే..

Updated Date - Aug 30 , 2025 | 11:05 AM