Indian Gooseberry Side Effects ఉసిరితోనూ సైడ్ ఎఫెక్ట్స్.. వీటిని ఎవరు తినకూడదంటే..
ABN , Publish Date - Aug 28 , 2025 | 10:33 PM
ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఉసిరితో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఉసిరి తినొద్దని నిపుణులు చెబుతున్నారు. మరి ఉసిరి తినకూడదని వారు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఆయుర్వేద, యునానీ చికిత్సలో విరివిగా వినియోగించే ఉసిరిలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. వీటిల్లో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సీ, పీచు పదార్థం, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. రోగనిరోధక శక్తి, జీర్ణశక్తి, చర్మ సౌందర్యం, బ్లడ్ షుగర్‌పై నియంత్రణను ఉసిరి మెరుగుపరుస్తుంది. ఉసిరిలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఇది అందరికీ తగినది కాదని నిపుణులు చెబుతున్నారు. మరి ఉసిరి విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్న వారు ఉసిరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉసిరిలోని పాలీఫీనాల్స్ ఇన్సులీన్ సెన్సిటివిటీని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గేలా చేస్తాయి. కాబట్టి హైపోగ్లైసీమియా సమస్య ఉన్న వారు ఉసిరిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలో బాగా తగ్గి తలతిరిగినట్టు ఉండటం, అలసట, కన్ఫ్యూజన్ వంటివి కలగడంతో పాటు మూర్ఛపోయే ప్రమాదం కూడా ఉంది.
కడుపులో ఇబ్బందులు ఉన్న వారు కూడా దీని జోలికి వెళ్లకూడదని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సీ అధికంగా ఉండే ఉసిరికి ఆమ్ల స్వభావం ఎక్కువ. దీని వల్ల పొట్ట లోపలి పొరల్లో చికాకు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, యాసిడ్ రిఫ్లక్స్, అల్సర్స్, కడుపులో నొప్పి ఉన్న వారు ఉసిరిని కాస్త తక్కువగా తినాలి.
ఉసిరిలో రక్తాన్ని పలుచగా చేసే గుణాలు ఉంటాయి. కాబట్టి, ఆస్పిరిన్, క్లోపిడోగ్రల్ వార్ఫేరిన్ వంటి బ్లడ్ థిన్నర్స్ ఔషధాలను వాడే వారు కూడా ఉసిరిని కాస్త తక్కువగా తినాలి. లేకపోతే రక్తస్రావం ముప్పు మరింత పెరుగుతుంది. సర్జరీలు, గాయాలకు చికిత్స తరువాత ఉసిరికి దూరంగా ఉండటం మంచిది.
ఉసిరిలోని విటమిన్ సీ వల్ల కిడ్నీ సమస్యలు ఉన్న వారికి ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. శరీరంలో విటమిన్ సీ.. ఆక్సాలేట్ అనే రసాయనం కింద మారుతుంది. దీని వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి, రోగులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
గర్భంతో ఉన్న మహిళలు, పాలిచ్చే తల్లులు కూడా ఉసిరి విషయంలో కాస్త అప్రమత్తత పాటించాలని కొందరు చెబుతారు. గర్భంతో ఉన్న మహిళలు పచ్చి ఉసిరి తింటే జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు, మోషన్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఉసిరి వల్ల అలర్జీ ప్రమాదం చాలా తక్కువే అయినప్పటికీ ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫుడ్స్ కారణంగా దురదలు, స్కిన్ ర్యాష్ వంటి సమస్యలు బారిన పడ్డ వారు ఉసిరికి దూరంగా ఉంటేనే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
రాత్రిళ్లు 9 గంటల పాటు నిద్రపోతే ఆరోగ్యం మెరుగవుతుందా
బీపీ ఔషధాలు పని చేయట్లేదా.. కారణాలు ఇవే..