Hyderabad Rain Alert: రాబోయే మరికొన్ని గంటల్లో భారీ వర్షం.. హెచ్చరికలు జారీ..
ABN , Publish Date - Sep 13 , 2025 | 06:56 PM
నగరంలోని సికింద్రాబాద్, బేగంపేట్, రసూల్‌పుర, సోమాజిగూడ, మల్కాజ్‌గిరి, కంటోన్మెంట్, తిరుమలగిరి, అల్వాల్‌లో వర్షం కురుస్తోంది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే పరిస్థితికి చేరుకున్నాయి. నగరంలో కొన్ని గంటల నుంచి నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో రహదారులపై నీరు చేరింది. ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో వాహనదారుల ఇక్కట్లు పడుతున్నారు. రాగల రెండు గంటల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
నగరంలోని సికింద్రాబాద్, బేగంపేట్, రసూల్‌పుర, సోమాజిగూడ, మల్కాజ్‌గిరి, కంటోన్మెంట్, తిరుమలగిరి, అల్వాల్‌లో వర్షం కురుస్తోంది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఈ మేరకు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ.. జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. కాగా, జీహెచ్ఎంసీ, హైడ్రా మాన్సూన్ బృందాలు సహాయక చర్యలకు సిద్ధం అవుతున్నాయి.
నగరంలో ఒక్కసారిగా కురిసిన వాన వరదలా మారడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఈ వర్షాలు మొదలయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి
మణిపూర్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకువస్తాం.. మోదీ భరోసా
బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని