Share News

Moosi River Over flows: మూసీ ఉగ్రరూపం.. హైదరాబాద్ అతలాకుతలం..

ABN , Publish Date - Sep 27 , 2025 | 11:59 AM

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూసీ ఉద్ధృత ప్రవాహానికి గోల్నాకలోని అంబేద్కర్ నగర్ నీటి మునిగింది. దీంతో పలు కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.

Moosi River Over flows: మూసీ ఉగ్రరూపం.. హైదరాబాద్ అతలాకుతలం..
Hyderabad floods

హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది. ముప్పు ప్రాంతాల వైపు రాకపోకలు నిలిపివేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదల వల్ల పాతబస్తీ, అంబర్‌పేట, చాదర్‌ఘాట్ నుంచి ఎంజీబీఎస్ వరకు నీరు చేరింది. ఎంజీబీఎస్ నుంచి బస్సు ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితి స్థానికులలో ఆందోళన కలిగిస్తోంది.


హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూసీ ఉద్ధృత ప్రవాహానికి గోల్నాకలోని అంబేద్కర్ నగర్ నీటి మునిగింది. దీంతో పలు కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. స్థానికులు సహాయక చర్యల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. నిన్న(శనివారం) రాత్రి నుంచి 20 కుటుంబాలు బిల్డింగ్‌ పైకెక్కి ఉన్నట్లు సమాచారం. బాధితుల సమాచారం తెలుసుకున్న అధికారులు, DRF బృందాల ద్వారా సహాయక చర్యలు మొదలుపెట్టారు. వరదల్లో చిక్కుకున్న బాధితులకు బోట్ల ద్వారా ఆహారం అందజేస్తున్నారు. అనంతరం బాధితులందరినీ రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.


అలాగే.. మూసీ నదిలో పెరిగిన వరద ఉద్ధృతికి పురానాపూల్ శివలఘాట్ వద్ద ఉన్న శివాలయం మునిగిపోయింది. ఆ సమయంలో దేవాలయంలో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడే చిక్కుకపోయారు. నిన్న ఒక్కసారిగా వరదరావడంతో నలుగురు ఆలయ సిబ్బంది ఆలయంలోనే ఇరుక్కుపోయారు. ఆలయంలో చిక్కుకున్న వారిని మహేందర్, రాజు, ఆకాష్, జగ్గు భాయ్‌గా అధికారులు గుర్తించారు. వారిని రక్షించేందుకు హైడ్రా, డీఆర్ఎఫ్ ఆలయం వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో నీటి ప్రవాహం పెరగడంతో రెస్క్యూ ఆపరేషన్‌‌కు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. వరద ప్రవాహం తగ్గిన తర్వాత వారిని రక్షించేందుకు మళ్లీ రంగంలోకి దిగనున్నారు.


ఇవి కూడా చదవండి

కుటుంబాల సంపద మరింత పైకి

వెలిగొండ ఫీడర్‌ కాలువ లైనింగ్‌కు రూ.456 కోట్లు

Updated Date - Sep 27 , 2025 | 03:42 PM