Veligonda Feeder Canal: వెలిగొండ ఫీడర్ కాలువ లైనింగ్‌కు రూ.456 కోట్లు
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:50 AM
ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలక అడుగు ముందుకు పడింది. ఫీడర్ కాలువకు కాంక్రీట్ లైనింగ్, సిమెంటు గోడల నిర్మాణానికి...
జలవనరుల శాఖ ఉత్తర్వులు
ఒంగోలు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలక అడుగు ముందుకు పడింది. ఫీడర్ కాలువకు కాంక్రీట్ లైనింగ్, సిమెంటు గోడల నిర్మాణానికి రూ.456 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. కృష్ణా నది నుంచి టన్నెల్ ద్వారా నీటిని తీసుకుని 21.80 కి.మీ పొడవైన ఈ ఫీడర్ కాలువ ద్వారా రిజర్వాయర్‌కు తరలించాల్సి ఉంది. వెలిగొండ పనులు పూర్తికాకుండానే.. గత ఎన్నికలకు ముందు నాటి సీఎం వైఎస్ జగన్ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నట్లు శిలాఫలకం వేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టు పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. గత ఏడాది అక్టోబరు 29న జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు.. రాష్ట్ర మంత్రులు డీఎ్‌సబీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌లతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. పలు లోటుపాట్లను గుర్తించారు. ప్రత్యేకించి ఫీడర్ కాలువ తెగిపోయి, భారీ రంధ్రాలు పడి ఉండడం గమనించి తగు చర్యలు చేపట్టాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఈ కాలువకు పూర్తిగా కాంక్రీటుతో లైనింగ్ చేయాలని, అక్కడక్కడా సిమెంటు గోడలు నిర్మించాలని.. అందుకు రూ.456 కోట్లు అవసరమవుతాయని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ప్రతిపాదనలు పంపారు. ఇటీవల సీఎం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో వచ్చే ఏడాది ఆగస్టుకు వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ పనులు, పునరావాస చర్యలకు రూ.2,059 కోట్లు అవసరమని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమీక్ష జరిగిన 20 రోజులకే వీటిలో కీలకమైన ఫీడర్ కాలువ లైనింగ్ పనులకు రూ.456 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయడం గమనార్హం.