CP Sajjanar: హద్దు మీరితే కఠిన చర్యలు.. సీపీ సజ్జనార్ వార్నింగ్
ABN , Publish Date - Dec 23 , 2025 | 09:27 PM
నూతన సంవత్సరం సందర్భంగా భాగ్యనగరంలో పలు ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరం సందర్భంగా భాగ్యనగరంలో పలు ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇవాళ(మంగళవారం) క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి, న్యూ ఇయర్ బందోబస్తుపై టీజీఐసీసీసీలో పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీపీ సజ్జనార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
నగరంలోని హాట్ స్పాట్లు, నేరప్రాంతాల్లో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. నూతన సంవత్సరం వేడుకల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపటి(బుధవారం) నుంచి నగరవ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తనిఖీల కోసం 7 ప్లాటూన్ల అదనపు పోలీస్ బలగాలు మోహరిస్తున్నట్లు వివరించారు సీపీ సజ్జనార్.
మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేల జరిమానా, 6 నెలల జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్, వీలింగ్, రేసింగ్‌లపై జీరో టాలరెన్స్ ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీలకు వెళ్లేవారు డెసిగ్నేటెడ్ డ్రైవర్ లేదా క్యాబ్ వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. పబ్‌లు, హోటళ్లలో వేడుకలకు డిసెంబరు 31వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు సీపీ సజ్జనార్.
శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే సౌండ్ సిస్టమ్‌లు సీజ్ చేస్తామని హెచ్చరించారు. గంజాయి, మాదకద్రవ్యాలు, అశ్లీల నృత్యాలకు యాజమాన్యాలదే బాధ్యత అని చెప్పుకొచ్చారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్ రద్దు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మహిళల భద్రతకు 15 షీ టీమ్స్ మఫ్టీలో నిఘా ఉంటాయని వివరించారు. 2026 వేడుకలు తీపి జ్ఞాపకాలుగా మిగలాలని సీపీ సజ్జనార్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యోగుల సమస్యలపై స్పెషల్ ఫోకస్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
మహిళలపై వ్యాఖ్యలు... శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు
For More TG News And Telugu News