MLA Harish Rao: రేవంత్ సర్కారులో డీఏ అంటే.. డోంట్ ఆస్క్
ABN , Publish Date - Oct 01 , 2025 | 07:55 PM
ఐదు డీఏలను పెండింగ్‌లో పెట్టిన ఘనత దేశంలో ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. నెలకు రూ. 750 కోట్ల ఎరియర్స్ క్లియర్ చేస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
సిద్దిపేట: దసరా సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచి తీపి కబురు చెబితే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం తమ ఉద్యోగులకు దసరాకు చేదు నింపిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఉద్యోగుల్ని చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ డీఏ ఇచ్చారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నాయకులు ఓల్డ్ డీఏ ఇస్తామని, అలాగే ఆరు నెలల్లోగా పీఆర్‌సీ ఇస్తామన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.
అధికారంలోకి రాగానే ఓల్డ్ పెన్షన్ స్కీమ్..
ఐదు డీఏలను పెండింగ్‌లో పెట్టిన ఘనత దేశంలో ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. నెలకు రూ.750 కోట్ల ఎరియర్స్ క్లియర్ చేస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. పోలీసులకు రావాల్సిన అలవెన్స్ కూడా రావడం లేదని, కనీసం పెట్రోల్ అలవెన్స్ ఇవ్వడం లేదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో పోలీసులకు కొత్త వెహికిల్స్ ఇచ్చారని గుర్తు చేశారు. రూ.12వేల హోమ్ గార్డ్స్ జీతాన్ని రూ.29 వేలకు కేసీఆర్ పెంచితే, సీఎం రేవంత్ 75 రూపాయలు పెంచారని విమర్శించారు. పోలీసుల సరెండర్ లీవ్స్ బడ్జెట్ కూడా రావడం లేదని పేర్కొన్నారు. ఇప్పుడున్న సీపీఎస్ స్థానంలో తాము అధికారంలోకి రాగానే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి మోసం చేయని వర్గం లేదు..
రెండేళ్లు గడించింది ఎక్కడ ఓపీఎస్ అని హరీష్ రావు నిలదీశారు. ఉద్యోగుల జీతాలు నుంచి రూ.5,500 కోట్లు కాంట్రిబ్యూషన్ పెన్షన్ డబ్బులు దారి మళ్లించారని ఆరోపించారు. రాష్ట్రంలో లక్షపైగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు రావడం లేదని తెలిపారు. చివరికి రేషన్ డీలర్లు కూడా 3వ తేదీ నుంచి బంద్ చేస్తామంటున్నారని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ రావడం లేదని బంద్ పెడతామన్నారు డాక్టర్లు. సీఎం రేవంత్ రెడ్డి మోసం చేయని వర్గం లేదని మండిపడ్డారు. కమీషన్లు మాత్రం దంచి వసూల్ చేసుకుంటున్నారని ఆరోపించారు.
డీఏ అంటే డోంట్ ఆస్క్ అన్నట్టుగా మారింది..
ఉద్యోగ సంఘాల నాయకులను ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని హరీష్ రావు చెప్పుకొచ్చారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడ్డదన్నారు. డీఏ అంటే డియర్నెస్ అలవెన్స్.. కానీ రేవంత్ సర్కారులో డోంట్ ఆస్క్ అన్నట్టుగా మారిందని పేర్కొన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్ పీఆర్సీలను ప్రకటించాలన్నారు. సీపీఎస్ స్థానంలో ఓపీఎస్ తీసుకురావాలని హరీష్ రావు పేర్కొన్నారు.
ఉత్తర దేశ రైతుకో నీతి, దక్షిణ దేశ రైతులకు మరో నీతా..
'ఉద్యోగులకు హెల్త్ కార్డులు వెంటనే ఇవ్వాలి. కేంద్రం గోధుమల మద్దతు ధర పెంచింది. కేంద్రం దక్షిణ భారతదేశం పట్ల వివక్ష చూపుతోంది. గోధుమల మద్దతు ధర రూ.165 పెంచి రూ.2,585గా నిర్ణయించారు. వరికి రూ.69 పెంచి రూ.2,369 మద్దతు ధర చేశారు. ఉత్తర భారతదేశ రైతుకో నీతి, దక్షిణ దేశ రైతులకు మరో నీతా. గోధుమలకు సమానంగా వరి మద్దతు ధర పెంచాలి. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. దేశంలో అత్యధికంగా వరి పంట సాగు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. బీజేపీ ప్రభుత్వ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తుంది' అని హరీష్ రావు ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
బిహార్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ
26/11 దాడుల తర్వాత పాక్‌తో యుద్ధం వద్దని చెప్పిన ఆమెరికా.. చిదంబరం వెల్లడి