Chidambaram: 26/11 దాడుల తర్వాత పాక్‌తో యుద్ధం వద్దని చెప్పిన ఆమెరికా.. చిదంబరం వెల్లడి
ABN , Publish Date - Sep 30 , 2025 | 03:41 PM
ముంబై ఉగ్రదాడుల్లో 175 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులకే కేంద్ర హోం మంత్రిగా పి.చిదంబరం బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ప్రపంచం అంతా యుద్ధం ప్రారంభించవద్దని చెప్పడానికి ఢిల్లీకి వస్తోందని, నాటి అమెరికా విదేశాంగ కార్యదర్శి కండోలిజా రైస్ ప్రత్యేకంగా తనను, ప్రధానిని కలిసేందుకు ఢిల్లీకి వచ్చారని చిదంబరం తెలిపారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 26/11 ముంబై ఉగ్రదాడులపై కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం (P.Chidambaram) కీలక సమాచారాన్ని వెల్లడించారు. ముంబై దాడుల అనంతరం తాను కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం నుంచి పాక్‌పై ప్రతిదాడికి అడ్డుపడిన పరిస్థితులను ఆయన ఒక ఇంటర్వ్యూలో వివరించారు. ముంబై ఉగ్రదాడుల అనంతరం పాకిస్థాన్‌పై సైనిక చర్యకు ఆలోచించినప్పటికీ అంతర్జాతీయ ఒత్తిడులు, ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా ఆ నిర్ణయం నిలిచిపోయిందని చెప్పారు. అప్పట్లో పాకిస్థాన్‌పై దాడి చేయాలని తన మనసులో ఉందని, అయితే సైనిక చర్యకు దిగరాదని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
యుద్ధం వద్దన్న అంతర్జాతీయ సమాజం
ముంబై ఉగ్రదాడుల్లో 175 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులకే కేంద్ర హోం మంత్రిగా పి.చిదంబరం బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ప్రపంచం అంతా యుద్ధం ప్రారంభించవద్దని చెప్పడానికి ఢిల్లీకి వస్తోందని, నాటి అమెరికా విదేశాంగ కార్యదర్శి కండోలిజా రైస్ ప్రత్యేకంగా తనను, ప్రధానిని కలిసేందుకు ఢిల్లీకి వచ్చారని చెప్పారు. యుద్ధంపై ముందుకు వెళ్లొద్దని తమను కోరారని వెల్లడించారు. పాకిస్థాన్‌కు బదులు చెప్పాలని తన మనసులో ఉందని, దీనిపై ప్రధానమంత్రి, ఇతర ముఖ్య వ్యక్తులతో చర్చించానని చెప్పారు. అయితే భౌతికంగా కాకుండా దౌత్యమార్గాలను ఉపయోగించాలని చివరికి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
బీజేపీ స్పందన
చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందించారు. ముంబై దాడుల అనంతరం హోం మంత్రి భాద్యతలు తీసుకునేందుకు తొలుత చిదంబరం నిరాకరించారని, పాకిస్థాన్‌పై మిలటరీ చర్యను ఆయన కోరుకున్నప్పటికీ ఆయనపై ఇతరులు విజయం సాధించారని అన్నారు. పాక్‌పై ప్రతీకార చర్యలను కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ అడ్డుకున్నారా, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అడ్డుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వంపై కండోలిజా రైస్ ప్రభావం ఉన్నట్టు కనిపిస్తోందన్నారు.
2008 నవంబర్ 8న ఏంజరిగిందంటే..
2008 నవంబర్ 8న ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన 10 మంది పాక్ ఉగ్రవాదులు ముంబైలోని పలు కీలక ప్రాంతాల్లో ఏకకాలంగా దాడులకు దిగారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ రైల్వే స్టేషన్, ఒబెరాయ్ ట్రిడెంట్, తాజ్ మహల్ ప్యాలెస్ అండ్ టవర్ హోటల్, కామా ఆసుపత్రి, నారిమన్ హౌస్‌లపై విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో 175 మంది ప్రాణాలు కోల్పోగా, 308 మంది గాయపడ్డారు. లష్కరే ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఒక్కరే ముంబై పోలీసులకు పట్టుబడగా, 2012లో అతన్ని ఉరితీశారు.
ఇవి కూడా చదవండి..
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి