GHMC: జీహెచ్‌ఎంసీ మరో కీలక నిర్ణయం.. అధికారుల బదిలీలు
ABN , Publish Date - Dec 28 , 2025 | 02:55 PM
జీహెచ్‌ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్న 60 మంది డిప్యూటీ ఇంజినీర్లను బదిలీలు చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ (GHMC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్న 60 మంది డిప్యూటీ ఇంజినీర్లను బదిలీలు చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. నగర విస్తరణ నేపథ్యంలో చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని భావించారు. ఈ క్రమంలోనే బదిలీలకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఇటీవల అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధి గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో నగర జనాభా, నివాస ప్రాంతాలు, చెత్త ఉత్పత్తి పరిమాణం కూడా పెరిగాయి. ఈ మార్పులను దృష్టిలో పెట్టుకుని జీహెచ్‌ఎంసీ పరిపాలనా నిర్మాణంలో పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్‌ను 12 జోన్లు, 60 సర్కిల్స్‌గా పునర్వ్యవస్థీకరణ చేశారు. ప్రతి సర్కిల్‌లో చెత్త సేకరణ, శానిటేషన్ పనులు సక్రమంగా జరిగేలా ప్రత్యేక బాధ్యతలు కలిగిన డిప్యూటీ ఇంజినీర్లను నియమించారు. ఈ నేపథ్యంలోనే 60 మంది డీఈలకు వివిధ సర్కిల్స్‌కు బదిలీలు జరిగాయి.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని మల్కాజ్‌గిరి నుంచి కుత్బుల్లాపూర్ వరకు అన్ని జోన్లలో ఇంజినీర్లను నియమించడం ద్వారా చెత్త నిర్వహణపై మరింత పర్యవేక్షణ సాధ్యమవుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ భావిస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా విలీనమైన మున్సిపాలిటీల్లో చెత్త సేకరణలో ఉన్న లోపాలను సరిదిద్దడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
బదిలీ అయిన ఇంజినీర్లు వెంటనే తమ కొత్త పోస్టింగ్‌లలో బాధ్యతలు స్వీకరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. అలాగే, ఈ ప్రక్రియ సాఫీగా జరిగేలా సూపరింటెండింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పూర్తి సహకారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చెత్త సేకరణ కొనసాగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ బదిలీలతో నగరంలో చెత్త సేకరణ వ్యవస్థ మరింత క్రమబద్ధంగా మారుతుందని, శివారు ప్రాంతాల్లో ఉన్న పరిశుభ్రత సమస్యలు తగ్గుతాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ఆరోగ్యం, నగర స్వచ్ఛత దృష్ట్యా ఈ నిర్ణయం కీలకంగా మారనుందని భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
డ్రగ్స్ కేసులపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారు.. కవిత ఫైర్
Read Latest Telangana News And Telugu News