KTR On Open AI: హైదరాబాద్‌లో OpenAI కంపెనీకి కేటీఆర్ ఆహ్వానం..
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:04 PM
వచ్చేనెల భారత్లో పర్యటిస్తున్నానని తెలిపిన సామ్ ఆల్ట్‌మన్‌కి హైదరాబాద్ నగరానికి కేటీఆర్ స్వాగతం పలికారు. హైదరాబాద్‌ను భారతదేశానికి సరైన ప్రవేశ ద్వారంగా, OpenAI లాంటి సంస్థలకు ఆదర్శవంతమైన కేంద్రంగా అభివర్ణించారు.
హైదరాబాద్: OpenAI తన కార్యకలాపాలు ప్రారంభించడానికి హైదరాబాద్‌లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నుంచి భారతదేశ కార్యకలాపాలను ప్రారంభించాలని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌కి ఆయన విజ్ఞప్తి చేశారు. భారత దేశంలో త్వరలో కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పిన OpenAI CEO సామ్ ఆల్ట్‌మన్‌కి హైదరాబాద్ నుంచి కంపెనీ కార్యకలాపాలు ఏర్పాటు చేయాలని ఎక్స్ వేదికగా కేటీఆర్ కోరారు.
వచ్చేనెల భారత్లో పర్యటిస్తున్నానని తెలిపిన సామ్ ఆల్ట్‌మన్‌కి హైదరాబాద్ నగరానికి కేటీఆర్ స్వాగతం పలికారు. హైదరాబాద్‌ను భారతదేశానికి సరైన ప్రవేశ ద్వారంగా, OpenAI లాంటి సంస్థలకు ఆదర్శవంతమైన కేంద్రంగా అభివర్ణించారు. ఈ నగరం భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉందని, ఇందులో T-Hub, WE-Hub, T-Works, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ వంటివి ఉన్నాయని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా, ఆపిల్, క్వాల్‌కామ్ లాంటి అనేక గ్లోబల్ టెక్ దిగ్గజాలకు కేంద్రంగా మారిందని, ఇక్కడ సాంకేతిక, స్టార్టప్ రంగాలలో అపారమైన ప్రతిభ ఉందని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రభుత్వం, భారతదేశానికి AI రాజధానిగా రాష్ట్రం మారడానికి అనేక సాహసోపేతమైన చర్యలు తీసుకుందని, ఇందులో 2020ని "ఇయర్ ఆఫ్ AI" గా ప్రకటించడం అనేక AI-ఆధారిత కార్యక్రమాలను ప్రోత్సహించడం వంటివి ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతిభ, ఇన్నోవేషన్, నూతన ఆవిష్కరణలు, గ్లోబల్ కనెక్టివిటీల కలయికతో AI విప్లవాన్ని ముందుకు నడిపిస్తుందని కేటీఆర్ ఉద్ఘాటించారు.
ఇవీ చదవండి..
స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో విశాఖ వైద్యుడు
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..