CID: హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో విశాఖ వైద్యుడు
ABN , Publish Date - Aug 23 , 2025 | 06:52 AM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ (సరూర్‌నగర్) కిడ్నీ రాకెట్ వ్యవహారంలో విశాఖపట్నానికి చెందిన వైద్యుడిని సీఐడీ అరెస్టు చేసింది.
సీఐడీ అదుపులో డాక్టర్ వెంకటరామ సంతోషనాయుడు
ఈ కేసులో ఇప్పటి వరకూ 19 మంది అరెస్ట్
కీలకంగా వ్యవహరించింది నగరానికి చెందిన పవన్
విశాఖపట్నం, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ (సరూర్‌నగర్) కిడ్నీ రాకెట్ వ్యవహారంలో విశాఖపట్నానికి చెందిన వైద్యుడిని సీఐడీ అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకూ 19 మందిని అరెస్టు చేసినట్టయింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన పవన్ అనే వ్యక్తిది కూడా విశాఖపట్నమే. ఆయనను ఇప్పటికే అరెస్టు చేయగా.. శుక్రవారం నగరానికి చెందిన డాక్టర్ వెంకటరామ సంతోషనాయుడిని సీఐడీ అదుపులోకి తీసుకుంది. సరూర్‌నగర్ కిడ్నీ రాకెట్ వ్యవహారం ఈ ఏడాది జనవరిలో వెలుగుచూసింది. కిడ్నీ ఇచ్చిన ఒకరు... ముందుగా చెప్పినట్టు డబ్బు చెల్లించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు విచారణలో కళ్లు బైర్లుకమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న, నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని ఒక ముఠా పెద్దఎత్తున కిడ్నీ రాకెట్‌ను నడిపినట్టు పోలీసులు గుర్తించారు. తవ్వుతున్న కొద్దీ అక్రమాలు వెలుగులోకి రావడంతో ఈ కేసును సీఐడీ (తెలంగాణ)కి అప్పగించారు.
విశాఖ వ్యక్తే కీలకం..
ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో విశాఖకు చెందిన పవన్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించాడు. హైదరాబాద్‌లో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆస్పత్రులను గుర్తించిన పవన్ వాటిల్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించాడు. అలకనందతోపాటు మరో ఆస్పత్రిలో ఈ తరహా శస్త్రచికిత్సలు జరిగాయి. కిడ్నీ అవసరమైన వ్యక్తులను, వారికి కిడ్నీలు ఇచ్చేవారిని దళారులు, ఏజెంట్ల ద్వారా పవన్ గుర్తించేవాడు. ముఖ్యంగా తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ వంటి ప్రాంతాల వారిని తీసుకొచ్చి వారి నుంచి కిడ్నీలు తీసుకునేవాడు. అందుకు వారికి రూ.5 లక్షలు, ఆస్పత్రికి, వైద్యులకు మరో రూ.15 లక్షలు చెల్లించేవాడు. కొంత మొత్తం దళారులకు ఇచ్చేవాడు. పవన్‌కు సుమారు రూ.25 లక్షల వరకూ మిగిలేది. ఇలా పదుల సంఖ్యలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్టు సీఐడీ గుర్తించింది. డాక్టర్ వెంకటరామ సంతోషనాయుడు విశాఖ నుంచి వెళ్లి ఈ శస్త్రచికిత్సలు నిర్వహించేవారు. ఈ కిడ్నీ రాకెట్‌లో డాక్టర్ వెంకటరామ కీలకంగా వ్యవహరించినట్టు సీఐడీ అధికారులు నిర్ధారణకు రావడంతో ఆయనను అరెస్టు చేశారు. అయితే, ఆయన ఎవరన్న దానిపై విశాఖ వైద్య వర్గాల్లో ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యుడు కాదని మాత్రం చెబుతున్నారు. ఇదిలావుంటే వివిధ కేసుల్లో విశాఖకు చెందిన వైద్యులు వరుసగా అరెస్టు అవుతుండడంతో వైద్య వర్గాల్లో అలజడి రేగుతోంది. ఇప్పటికే సృష్టి కేసులో విశాఖకు చెందిన ముగ్గురు వైద్యులు అరెస్టయ్యారు.