DGP Shivdhar Reddy on Friendly Policing: ప్రజల పక్షం ఉంటాం.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తాం: డీజీపీ శివధర్ రెడ్డి
ABN , Publish Date - Sep 27 , 2025 | 04:46 PM
తెలంగాణ రాష్ట్రంపై తనకు పూర్తి అవగాహన ఉందని డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోలీస్ విభాగంలో అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు.
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి (DGP Shivdhar Reddy)ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Govt) నియమించింది. ఈ సందర్భంగా డీజీపీగా అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి శివధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ(శనివారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో శివధర్ రెడ్డి మాట్లాడారు. తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని ఉద్ఘాటించారు. ఇంటెలిజెన్స్‌లో ఎస్పీ స్థాయి నుంచి డీజీ స్థాయి దాకా పనిచేశానని.. తెలంగాణ రాష్ట్రంపై తనకు పూర్తి అవగాహన ఉందని వ్యాఖ్యానించారు. పోలీస్ విభాగంలో అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు డీజీపీ శివధర్ రెడ్డి.
డ్రగ్స్ (Drugs)పై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఇప్పటికే చాలా చర్యలు తీసుకుందని.. ఈగల్ టీం కూడా చాలా స్ట్రాంగ్‌గా పనిచేస్తోందని నొక్కిచెప్పారు. డ్రగ్స్ ఒక మహమ్మారి లాగా మారిందని.. ఒక పోలీసుతోనే దీన్ని నిర్మూలన కాదని.. ప్రజల నుంచి కూడా పెద్దఎత్తున సహకారం కావాలని తెలిపారు. సైబర్ క్రైమ్ సెక్యూరిటీ (Cyber Crime Security)లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ మోసాలు, సైబర్ సెక్యూరిటీ సమస్య దేశం మొత్తం పెద్ద సమస్యగా మారిందని చెప్పుకొచ్చారు. మన దగ్గర ఉన్నటువంటి సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో నేరాలను చాలావరకు అరికడుతున్నామని వెల్లడించారు డీజీపీ శివధర్ రెడ్డి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిజాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ప్రజల పక్షానే తాము ఉంటామని.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణ కోసం అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని అన్నారు. సైబర్ నేరాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కృషి చేస్తోందని వెల్లడించారు. ప్రజలకు, పోలీసులకు మధ్య సంబంధాలను పెంపొందించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తామని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
ఓటు చోరీపై మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు
Read Latest Telangana News and National News