MP Mallu Ravi: గత పార్లమెంట్ సమావేశాలు బ్రిటీష్ పాలనను తలపించాయి..
ABN , Publish Date - Sep 07 , 2025 | 08:47 PM
స్వాతంత్ర్యం రాకముందు బ్రిటీష్ పాలనలో వారు ఇష్టానుసారంగా వ్యవహరించారని మల్లు రవి గుర్తు చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణ కూడా బ్రిటిష్ వారి పాలనను తలపించిందని ఆరోపించారు.
ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్నికల కమిషన్(ఈసీ) షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 9వ తేదిన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడారు.. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పాత పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్లో ఇండియా కూటమి పార్టీల ఎంపీలకు మాక్ పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పొరపాటు జరగకుండా ఉండేందుకు మాక్ పోలింగ్‌ను నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో దాదాపు 15 మంది ఎంపీలు సరిగ్గా ఓటింగ్ చెయ్యలేదని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ ఎంపీలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
పార్లమెంట్ బ్రిటిష్ పాలనను తలపించింది...
స్వాతంత్ర్యం రాకముందు బ్రిటీష్ పాలనలో వారు ఇష్టానుసారంగా వ్యవహరించారని మల్లు రవి గుర్తుచేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణ కూడా బ్రిటిష్ వారి పాలనను తలపించిందని ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఇష్టానుసారంగా వర్షాకాల సమావేశాలు జరిగాయని విమర్శించారు. కేంద్రం తాము చెప్పిందే వినాలనే విధంగా ప్రవర్తిచిందని మండిపడ్డారు. ఎవరూ ప్రశ్నించకుండా ఉండేందుకు.. పార్లమెంటు సమావేశాలను వాయిదా వేసి విపక్ష పార్టీల.. ఎంపీలు గొంతు నొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విపక్షాలు లేవనెత్తిన ఏ అంశంపై కూడా చర్చ జరగలేదని.. పేర్కొన్నారు.
ఒత్తిడి మేరకే రాజీనామా..
ఎన్డీఏ ప్రభుత్వం ఒత్తిడి మేరకే జగదీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారని అంటున్నారని మల్లు రవి ఆరోపించారు. ఆయనకు ఎన్డీఏ ప్రభుత్వంలో సరైన గౌరవం దక్కలేదని పేర్కొన్నారు. రాజీనామా చేయడానికి గల కారణాలను కూడా వెల్లడించలేదని తెలిపారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి పొన్నుస్వామి రాధాకృష్ణన్ గతంలో ఆర్ఎస్ఎస్‌తో కలసి పనిచేసిన విషయాన్ని తమ ఎంపీలకు రాసిన లేఖలో పేర్కొన్నారని చెప్పారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని రాధాకృష్ణన్ పేర్కొన్నారని, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో దేశం ఉందన్నది ఆయన వివరించాలని కోరారు.
ఓటు వేయండి...
ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఓటు వేసినట్లయితే ప్రజాస్వామ్యం ప్రమాదం నుంచి బయట పడుతుందని మల్లు రవి స్పష్టం చేశారు. రాజ్యసభలో నిష్పక్షపాతంగా చర్చలు జరిగేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆత్మ ప్రబోధానుసారం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఎంపీలు ఓటు వెయ్యాలని ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో విప్ జారీ చేయడానికి అవకాశం ఉండదని గుర్తు చేశారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించటం ఎంపీల బాధ్యత అని హితవు పలికారు. ఆ బాధ్యతను ఎంపీలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబరు 9న పార్లమెంటు భవనం మొదటి అంతస్తులో జరుగుతుందని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
నోట్లో యాసిడ్ పోస్తా.. బీజేపీ నేతపై రెచ్చిపోయిన టీఎంసీ ఎమ్మెల్యే
ప్రజ్వల్ రేవణ్ణకు జైలులో పని, వేతనం ఎంతంటే