TMC Mla Threatens BJP: నోట్లో యాసిడ్ పోస్తా.. బీజేపీ నేతపై రెచ్చిపోయిన టీఎంసీ ఎమ్మెల్యే
ABN , Publish Date - Sep 07 , 2025 | 06:28 PM
బెంగాల్ మాట్లాడే వలస కార్మికులపై ఇతర రాష్ట్రాలలో దాడులు జరుగుతున్నాయంటూ శనివారంనాడు మాల్డాలో టీఎంసీ నిరసన ర్యాలీ జరిపింది. ఇందులో అబ్దుర్ రహీమ్ బక్షి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (TMC) మాల్దా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అబ్దుర్ రహీమ్ బక్షి (Abdur Rahim Bakshi) మరోసారి రెచ్చిపోయారు. బీజేపీ (BJP) సిలిగురి శాసనసభ్యుడు శంకర్ ఘోష్‌ను లక్ష్యంగా చేసుకుని 'నోట్లో యాసిడ్ పోస్తా' అంటూ బెదిరించారు. ఆయన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. బెంగాల్ మాట్లాడే వలస కార్మికులపై ఇతర రాష్ట్రాలలో దాడులు జరుగుతున్నాయంటూ శనివారంనాడు మాల్డాలో టీఎంసీ నిరసన ర్యాలీ జరిపింది. ఇందులో బక్షి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బెంగాల్ వలస కార్మికులను రోహింగ్యాలు, బంగ్లాదేశీయులుగా గతంలో మాట్లాడిన బీజేపీ నేతలపై బక్షి విరుచుకుపడ్డారు. శంకర్ ఘోష్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే.. 'మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు విన్నానంటే నీ నోట్లో యాసిడ్ పోసి గొంతును కాల్చేస్తా. నీకు తెలుసు, ఇది బెంగాల్. బెంగాలీలుగా నిన్ను మాట్లాడేందుకు మేము అనుమతించేది లేదు' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జెండాలు చించివేయాలని, పార్టీని సామాజిక బహిష్కరణ చేయాలని తన మద్దతుదారులను కోరారు. హింసాత్మక బెదిరింపులకు పాల్పడడం బక్షికి కొత్త కాదు. గతంలో ఆయన బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ కార్యకర్తల కాళ్లు, చేతులు నరికేస్తామంటూ హెచ్చరికలు చేశారు.
మండిపడిన బీజేపీ
బక్షి వ్యాఖ్యలపై శంకర్ ఘోష్ ఘాటుగా స్పందించారు. 'ఆయన ఎమ్మెల్యే కాదు, మారువేషంలో ఉన్న క్రిమినల్. రాష్ట్రాన్ని మమతా బెనర్జీ ఏవిధంగా నడుతున్నారో ఆయన వ్యాఖ్యలే చెబుతున్నాయి. విపక్షాలపై యాసిడ్ దాడులు జరుపుతామని బెదిరిస్తూ పాలన సాగిస్తున్నారు' అని అన్నారు. బీజేపీ ఎంపీ ఖగెన్ ముర్ము మాట్లాడుతూ, హింసాత్మక సంస్కృతిని టీఎంసీ వ్యాప్తి చేస్తోందని, రాజకీయ నిరాశలో కూరుకుపోయినందునే బక్షి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తప్పుపట్టారు. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో టీఎంసీపై విమర్శలు గుప్పించారు. హింస అనేది టీఎంసీకి కొత్త కాదని, అది వారి రాజకీయ సంస్కృతి అని, ముఖ్యంగా మాల్డా-ముర్షీదాబాద్‌లో ఉండే అక్రమ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు మమతాబెనర్జీ ఓటు బ్యాంకు అని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
ప్రజ్వల్ రేవణ్ణకు జైలులో పని, వేతనం ఎంతంటే
రైతులను పరామర్శించేందుకు పంజాబ్‌లో 9న మోదీ పర్యటన
For More National News And Telugu News