CM Revanth Reddy ON investments: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Sep 19 , 2025 | 04:02 PM
భవిష్యత్ అవసరాలకు తగినట్లు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర అవసరాలకు తగినట్లు రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఢిల్లీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పెట్టుబడులకు (investments) ఆహ్వానం పలుకుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు మద్దతుగా నిలుస్తామని... తెలంగాణలో పెట్టే పెట్టుబడులకు భద్రత ఉంటుందని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపడుతున్నామని వ్యాఖ్యానించారు. పరిపాలన చేసేందుకు రాజకీయ సంకల్పం ఎంతో అవసరమని చెప్పుకొచ్చారు. భవిష్యత్ తరాలకు అవకాశాలను సృష్టించాలనేది తమ ఆలోచన అని తెలిపారు. దేశంలో యంగెస్ట్ స్టేట్ (కొత్త రాష్ట్రం) తెలంగాణ అని ఉద్ఘాటించారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణ, హైదరాబాద్‌కు ఘనమైన చరిత్ర ఉందని నొక్కిచెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి.
తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047 ..
ఢిల్లీలో పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (Public Affairs Forum of India Conference) (PAFI) 12వ వార్షిక సదస్సు ఇవాళ(శుక్రవారం) జరిగింది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047 (Telangana Vision Document 2047) రూపొందించామని వివరించారు. తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్‌గా విభజించామని వెల్లడించారు. కోర్ అర్బన్ ఏరియాలో కోటి మంది నివసిస్తున్నారని... ఇక్కడ కాలుష్యకారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలిస్తున్నామని తెలిపారు. సెమీ అర్బన్ ఏరియాను తయారీ రంగం జోన్‌గా (మాన్యుఫాక్చర్) నిర్ణయించామని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి .

మెట్రో పొడిగింపు...
తెలంగాణ అభివృద్ధికి తగినట్లు 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 150 కిలోమీటర్లు పొడిగించాలని (Metro Expansion) నిర్ణయించామని పేర్కొన్నారు. ప్రస్తుతం అయిదు లక్షల మంది మెట్రోలో పయనిస్తున్నారని.. దానిని 15 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. సబర్మతీ తీరంలా మూసీని మారుస్తామని.. అందుకు మూసీ పునరుజ్జీవంపై దృష్టి సారించామని తెలిపారు. 2027 నాటికి హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాలే ఎక్కువగా ఉండనున్నాయని.. అందుకే ఈవీలకు రాయితీలు ప్రకటించామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం..
‘రాష్ట్ర అవసరాలకు తగినట్లు రీజినల్ రింగ్ రోడ్ (Regional Ring Road) నిర్మాణం చేస్తున్నాం. భవిష్యత్ అవసరాలకు తగినట్లు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. విమానాశ్రయం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ అనుసంధానిస్తాం. తెలంగాణలో సేంద్రియ పంటలు పండుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్ సమస్య ఉంది.. మేం తెలంగాణలో డ్రగ్స్‌ను కంట్రోల్ చేశాం. డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. జ్ఞానంతో పాటు నైపుణ్యం అవసరం. యువతలో నైపుణ్యాలు పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు...
‘మహాత్మా గాంధీ యంగ్ ఇండియా స్ఫూర్తిని అనుసరిస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో (Young India Skill University) చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. స్పోర్ట్స్‌లో దక్షిణ కొరియా వంటి చిన్న దేశాలకు వచ్చే మెడల్స్ చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ఒలింపిక్స్‌లో పతకాల సాధనే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ (Young India Sports University) ఏర్పాటు చేశాం. తెలంగాణకు భూపరివేష్టిత రాష్ట్రం (ల్యాండ్ లక్డ్) కావడంతో ఓడ రేవు లేదు. మచిలీపట్నం ఓడ రేవు అనుసంధానానికి ఫ్యూచర్ సిటీ నుంచి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే.. దానికి సమాంతరంగా రైల్వే లైన్ మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 2025, డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తాం. బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40 శాతం తెలంగాణనే చేస్తోంది. వ్యాక్సిన్ల తయారీలో హైదరాబద్ ముందు వరుసలో ఉంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు..!
For More Telangana News And Telugu News