Phone Tapping Case To CBI: సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు..!
ABN , Publish Date - Sep 19 , 2025 | 01:58 PM
రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 19: రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంపై సిట్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విచారణలో భాగంగా సిట్ అధికారులు కీలక ఆధారాలను సేకరించారు. ఆ క్రమంలో పలువురిని సైతం విచారించారు. అందులో భాగంగా ముఖ్యమైన ఆధారాలను సేకరించిన సంగతి తెలిసిందే. మరోవైపు రూ.లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారాన్ని సైతం ఇప్పటికే సీబీఐకి రేవంత్ సర్కార్ అప్పగించిన విషయం విదితమే.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది. అయితే గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విపక్ష పార్టీల్లోని కీలక నేతలపైనే కాకుండా.. స్వపక్షంలోని పలువురు నేతల ఫోన్లు సైతం ట్యాపింగ్ గురైనట్లు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారంపై రేవంత్ సర్కార్ సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా.. పలువురు పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసును సైతం సీబీఐకి అప్పగించేందుకు రేవంత్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగాయి. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై నాటి ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. దాంతో తాము అధికారంలోకి వస్తే ఈ వ్యవహరంపై విచారణ జరుపుతామని అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ క్రమంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దాదాపు 13 నెలల విచారణ అనంతరం నివేదికను ప్రభుత్వానికి అప్పగించింది ఈ కమిషన్. ఈ కేసును సైతం సీబీఐకి అప్పగిస్తూ.. రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసును సైతం సీబీఐకి అప్పగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్సీలు..
ప్లాస్టిక్ రహిత ఏపీ కోసం కృషి: డిప్యూటీ సీఎం
For More TG News And Telugu News