Share News

CM Revanth Reddy Comments on Sudarshan Reddy: జాతీయ రాజకీయాల్లో తెలుగు వారంతా ఐక్యంగా ముందుకు రావాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Sep 01 , 2025 | 02:01 PM

తెలుగు వాళ్లందరూ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అండగా నిలబడాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సుదర్శన్ రెడ్డికి తెలుగు ప్రజల మద్దతు అవసరమని తెలిపారు. తెలుగు అస్తిత్వం కాపాడాల్సిన సమయం ఇదని ఉద్ఘాటించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి బరిలోకి రావడం ఎన్డీఏ కూటమికి అతి పెద్ద సవాల్ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

CM Revanth Reddy Comments on Sudarshan Reddy: జాతీయ రాజకీయాల్లో తెలుగు వారంతా ఐక్యంగా ముందుకు రావాలి: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy Comments on Sudarshan Reddy

హైదరాబాద్, సెప్టెంబర్1, (ఆంధ్రజ్యోతి): తెలుగు వాళ్లందరూ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి (Justice Sudhakar Reddy) అండగా నిలబడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఉద్ఘాటించారు. నీలం సంజీవ రెడ్డి, పీవీ నర్సింహారావు, నందమూరి తారక రామారావు, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారని ఉద్ఘాటించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇవాళ(సోమవారం) తాజ్ కృష్ణాలో ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.


జాతీయ రాజకీయాల్లో తెలుగు వాళ్ల అస్తిత్వం కనుమరుగవుతోందని చెప్పుకొచ్చారు. సుదర్శన్ రెడ్డి ఎన్నికల బరిలోకి రావడంతో ఎన్డీఏ కూటమికి బలమైన సవాల్ విసిరినట్లుగా అయిందని తెలిపారు. ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్ రాజీనామా అందరికీ ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి రాజీనామాపై రాజకీయ ఒత్తిళ్లు ఎన్ని ఉన్నాయో అందరం గమనించామని చెప్పుకొచ్చారు. రాజ్యాంగాన్ని మార్చాలనే వాళ్లకి రాజ్యాంగాన్ని కాపాడాలనే వారికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవని ఉద్ఘాటించారు సీఎం రేవంత్‌రెడ్డి.


జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలైట్ అని కొందరు చెబుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. నక్సలిజాన్ని ఫిలాసఫీతో వాదించి గెలవాలి కానీ అంతం చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. నక్సలిజం అనేది ఒక ఫిలాసఫీ అని.. మనకు ఒక ఫిలాసఫీ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చని చెప్పుకొచ్చారు. తెలుగు వ్యక్తికి మద్దతు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌లకు విజ్ఞప్తి చేశారు. ఆత్మప్రభోదానుసారం ఉప రాష్ట్రపతి అభ్యర్థికి ఓటేయాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలకు విన్నవించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేసేవారి ఓట్లు తొలగించాలని కొందరూ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఓటును కాపాడాలంటే దాన్ని కాపాడే వ్యక్తి కుర్చీలో కూర్చోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. టీజీఎస్పీడీసీఎల్ కొత్త నిబంధనలు

తెలంగాణ శాసనమండలిలో బీసీ బిల్లుకు ఆమోదం

Read latest Telangana News And Telugu News

Updated Date - Sep 01 , 2025 | 02:56 PM