CM Revanth Reddy ON Group1: పదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం గ్రూప్-1 నిర్వహించలేదు.. సీఎం రేవంత్ ఫైర్
ABN , Publish Date - Sep 27 , 2025 | 09:37 PM
తెలంగాణ భవిష్యత్ నిర్మాణం చేసేందుకు గ్రూప్-1 అభ్యర్థులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ఇక నుంచి తెలంగాణ యంత్రాంగాన్ని నడిపించే ఆఫీసర్స్ అభ్యర్థులేనని తెలిపారు. అభ్యర్థులు, ప్రభుత్వం కలిసి తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములవుదామని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
అమరావతి , సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గడ్డకు ఒక చరిత్ర, పౌరుషం ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఉద్ఘాటించారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణలో ఎన్నో పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. ఇవాళ(శనివారం) గ్రూప్-1లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందజేశారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఏ మారుమూల పల్లెకు, గూడెనికి వెళ్లినా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. కానీ కొంతమంది కారణజన్ములమని, వారి కుటుంబమే తెలంగాణ అని భావించారని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
తెలంగాణ ప్రజలు వారిని నమ్మి బాధ్యతలు అప్పగిస్తే నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. నమ్మక ద్రోహులుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారని విమర్శించారు. పదేళ్లుగా గ్రూప్ -1 పరీక్షలు నిర్వహించలేదంటే ఎంత బాధ్యతారాహిత్యమని ఫైర్ అయ్యారు. ఒక యాదయ్య, శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి లాంటి వాళ్ల త్యాగాలను అపహాస్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో అర్హత లేని వారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సభ్యులుగా నియమించారని ధ్వజమెత్తారు. ఫలితంగా ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్‌లో కనిపించాయని ఆరోపించారు. అందుకే తాము అధికారంలోకి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశామని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
తాముగ్రూప్-1 పరీక్షలు నిర్వహించామని.. ఇది కొంతమందికి నచ్చలేదని తెలిపారు. కడుపునిండా విషం పెట్టుకుని అభ్యర్థులను ఎన్నిరకాలుగా అడ్డుకోవాలని చూశారో తెలుసునని అన్నారు. కొంతమంది రూ.2 కోట్లు, 3 కోట్లు తీసుకుని గ్రూప్-1 ఉద్యోగాలు ఇచ్చామని ఆరోపించారని.. అయినా అభ్యర్థుల భవిష్యత్ కోసం తాము కొట్లాడామని వెల్లడించారు. ఎవరూ ఎన్ని కుట్రలు చేసినా, కేసులు వేసినా, తప్పుడు ప్రచారం చేసినా ఓపికతో తాము దిగమింగామని తెలిపారు. తెలంగాణ భవిష్యత్ నిర్మాణం చేసే బాధ్యత గ్రూప్-1 అభ్యర్థుల చేతుల్లో ఉందని ఉద్ఘాటించారు. మనమంతా కలిసి దేశానికి తెలంగాణ మోడల్ చూపిద్దామని నొక్కిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో గ్రూప్-1 అభ్యర్థులు భాగస్వాములు కావాలని సూచించారు. తెలంగాణ భవిష్యత్ నిర్మాణం చేసేందుకు గ్రూప్-1 అభ్యర్థులు సహకారం అందించాలని కోరారు. ఇక నుంచి తెలంగాణ యంత్రాంగాన్ని నడిపించే ఆఫీసర్స్ మీరేనని తెలిపారు. గ్రూప్-1 అభ్యర్థులు, ప్రభుత్వం కలిసి తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములవుదామని సూచించారు. గ్రూప్-1 అభ్యర్థుల భవిష్యత్ కోసం శ్రమించిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత మీదేనని చెప్పుకొచ్చారు. తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే గ్రూప్-1 అభ్యర్థుల జీతాల్లోంచి పది శాతం కట్ చేసి వారి ఖాతాల్లో వేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
ఓటు చోరీపై మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు
Read Latest Telangana News and National News