Share News

Chiranjeevi: చిరంజీవి గౌరవానికి రక్షణ.. కోర్టు కఠిన హెచ్చరికలు

ABN , Publish Date - Oct 25 , 2025 | 04:35 PM

ప్రముఖ న‌టుడు కొణిదెల చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు మధ్యంతర ఉత్తర్వులని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు శనివారం మంజూరు చేసింది. చిరంజీవి అనుమతి లేకుండా.. పలువురు ఆయన పేరుని వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడాన్ని న్యాయస్థానం నిషేధించింది.

Chiranjeevi: చిరంజీవి గౌరవానికి రక్షణ.. కోర్టు కఠిన హెచ్చరికలు
Chiranjeevi

హైదరాబాద్ అక్టోబరు25 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ న‌టుడు కొణిదెల చిరంజీవి (Konidela Chiranjeevi) వ్యక్తిత్వ హక్కులకు అడ్-ఇంటరిమ్ ఇంజంక్షన్ (మధ్యంతర ఉత్తర్వులు)ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు (Hyderabad City Civil Court) ఇవాళ(శనివారం) మంజూరు చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పిటిషన్‌లో పేరు పొందిన పలువురితోపాటు ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ అయినా చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులను ఉల్లంఘించే విధంగా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్‌ తదితర గుర్తించిన వాటిని అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడాన్ని న్యాయస్థానం నిషేధించింది.


తన పేరు లేదా చిత్రం లేదా ప్రసిద్ధ సినీ శీర్షికలను అనుమతి లేకుండా వాడుకోవడం, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌ మొదలైన వేదికలపై వినియోగించడం, అలాగే కృత్రిమ మేథస్సు (AI) ద్వారా రూపాంతరం చేసిన (మార్ఫ్ చేసిన) చిత్రాలు, వీడియోలను ప్రచారం చేయడాన్ని ఆపివేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు చిరంజీవి.


భారతీయ చలనచిత్ర రంగంలో అగ్ర హీరోగా ఉన్నత స్థాయిలో ఉన్న చిరంజీవి స్థానాన్ని గుర్తిస్తూ.. ఆయన పేరుపెట్టి, చిత్రాలు తీసుకొని, వీడియో-మీమ్స్ చేసి, అనుమతి లేకుండా వినియోగం, తదితర చర్యల ద్వారా ప్రతివాదులు చేసిన ఉల్లంఘనలు ఆయన ఖ్యాతి, గౌరవానికి నష్టం కలిగిస్తున్నాయని చిరంజీవి తరఫు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు.


ముఖ్యంగా డిజిటల్, ఏఐ వేదికల ద్వారా జరిగే వాణిజ్యపు దోపిడి, తప్పుడు ప్రతిరూపణలతో అపరిమిత నష్టం సంభవించే ప్రమాదాన్ని కోర్టు గమనించింది. ఈ నిషేధాజ్ఞ ప్రకారం చిరంజీవి పేరు, స్టేజ్ టైటిల్స్ (MEGA STAR, CHIRU, ANNAYYA), స్వరం, చిత్రం లేదా ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన ఇతర వ్యక్తిత్వ లక్షణాలను ఏ రూపంలోనైనా, ఏ మాధ్యమంలోనైనా, వ్యక్తిగత లేదా వాణిజ్య లాభం కోసం నేరుగా గానీ పరోక్షంగా గానీ ఉపయోగించవద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు అందరూ ప్రతివాదులకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 27 అక్టోబర్ 2025కు న్యాయస్థానం వాయిదా వేసింది.


వ్యక్తిత్వ లేదా ప్రచార హక్కుల ఉల్లంఘనలు, పరువు నష్టం చర్యలు జరిగితే, సంబంధిత పౌర, ఫౌజ్‌దారీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సిటీ సివిల్ కోర్టు స్పష్టం చేసింది. టెలివిజన్ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫార్ములు, మీడియా సంస్థలు తదితర అన్నిరకాల వ్యక్తులు లేదా సంస్థలు, టీఆర్‌పీలు పెంచడం, వీక్షణలను లేదా లాభాలను పొందడం వంటి ఉదేశ్యాలతో, చిరంజీవి పేరు, చిత్రం, స్వరం, లైక్‌నెస్ లేదా ఇతర వ్యక్తిత్వ లక్షణాలను అనుమతి లేకుండా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని న్యాయస్థానం వార్నింగ్ ఇచ్చింది. ఈ ఉత్తర్వులు అమల్లో ఉన్న సమయంలో ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ ద్వారా జరిగే ట్రోలింగ్, మార్ఫింగ్, అభ్యంతరకర కంటెంట్ ప్రచారం, లేదా అనుమతి లేని వాణిజ్య వినియోగంపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు హెచ్చరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

గుండాలకి రక్షణ కల్పిస్తున్న రేవంత్‌ ప్రభుత్వం.. ప్రవీణ్ కుమార్ ఫైర్

గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 25 , 2025 | 05:08 PM