Share News

Harish Rao: రేవంత్‌రెడ్డి.. తెలంగాణకు మరణశాసనం రాశాడు.. హరీష్‌రావు ఫైర్

ABN , Publish Date - Jul 02 , 2025 | 01:25 PM

బీఆర్ఎస్ హయాంలో బనకచర్లపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని మాజీ మంత్రి హరీష్‌రావు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం కాకుండా.. రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని హరీష్‌రావు ఫైర్ అయ్యారు.

Harish Rao: రేవంత్‌రెడ్డి.. తెలంగాణకు మరణశాసనం రాశాడు.. హరీష్‌రావు ఫైర్
BRS MLA Harish Rao

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై (Telangana CM Revanth Reddy) మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (BRS MLA Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు తాము రెడీ.. సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమా అని సవాల్ విసిరారు. బనకచర్లపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీస్తామని అన్నారు. ఇవాళ (బుధవారం) తెలంగాణభవన్‌లో హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో బనకచర్లపై చర్చ జరుగుతున్నప్పుడు తమ మైక్ కట్ చేయకూడదని కోరారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి.. సీఎం హోదాలోనూ రేవంత్‌రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్‌రావు.


రేవంత్‌రెడ్డి తెలంగాణకు పట్టిన అబద్దాల వైరస్ అని మాజీ మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. బయట వారికి సద్దులు కడుతూ.. ఇంటి మనిషి కేసీఆర్‌పై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ‌‌.. హైదరాబాద్‌లో కాకుండా అమరావతి నుంచి ఇచ్చినట్లుందని విమర్శించారు. ఉత్తమ్ పీపీటీ.. ఏపీ సీఎం చంద్రబాబు తయారు చేశాడా అనే అనుమానం కలుగుతోందని అన్నారు. చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్ట్‌లను అడ్డుకున్న విషయాన్ని పీపీటీలో ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. అహంకారంతో మాట్లాడితే.. రేవంత్‌ను ప్రజలు పాతాళానికి తొక్కుతారని హెచ్చరించారు. తెలుగుదేశం, చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని రేవంత్‌రెడ్డి ఇంకా మర్చిపోలేకపోతున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్‌రావు.


విభజన హామీల ముసుగులో ప్రజాభవన్ వేదికగా బనకచర్ల ఒప్పందం కుదిరిందని, ప్రజాభవన్ వేదికగా 2024 జులై 6వ తేదీన రేవంత్ తెలంగాణకు మరణశాసనం రాశారని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపణలు చేశారు. సెప్టెంబర్ 23వ తేదీన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా బెజవాడ పోయి బజ్జీలు తిని బనకచర్లకు పచ్చజెండా ఊపారని విమర్శించారు. బీఆర్ఎస్ పోరాటంతోనే కేంద్ర ప్రభుత్వం బనకచర్లకు అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ చచ్చిన పాము అయితే.. ఎందుకు తమపై విమర్శలు చేస్తున్నారని నిలదీశారు. కేసీఆర్ పేరు ఎత్తకుండా ఒక్కసారైనా రేవంత్‌రెడ్డి ఉండగలరా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా కాకుండా.. రేవంత్‌రెడ్డి ఇంకా ప్రతిపక్ష నేత మాదిరిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇరు రాష్ట్రాలు కూర్చుని ఆమోదయోగ్యంగా మాట్లాడుకుందామని మాత్రమే కేసీఆర్ అన్నారని తేల్చిచెప్పారు మాజీ మంత్రి హరీష్‌రావు.


బీఆర్ఎస్ హయాంలో బనకచర్లపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని మాజీ మంత్రి హరీష్‌రావు క్లారిటీ ఇచ్చారు. రేవంత్‌రెడ్డే.. ఉత్తమ్‌ కుమార్ రెడ్డిని విజయవాడ పంపించారని ఆరోపించారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా గెలవలేదని.. అంతమాత్రాన ఆ పార్టీ చచ్చిన పాము అవుతుందా అని ప్రశ్నించారు. చచ్చిన పాము ముచ్చట్లు రేవంత్‌రెడ్డి రాహుల్ గాంధీకి చెప్పుకోవాలని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలేనని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం కాకుండా.. రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బనకచర్లపై మంత్రి ఉత్తమ్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌కు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఎందుకు పిలవలేదని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు.


ఇవి కూడా చదవండి

మేడారం మహాజాతర తేదీలు ఖరారు

ఆ రోజే నా కెరీర్ క్లోజ్.. ధవన్ షాకింగ్ కామెంట్స్!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 02 , 2025 | 03:29 PM