Bathukamma Short Film: బతుకమ్మ షార్ట్ ఫిల్మ్ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలు ఇవే..
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:44 PM
తెలంగాణలో బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. బతుకమ్మకు సంబంధించిన పాటలను పాడుకుంటూ సందడిగా చేసుకుంటారు. ఈ పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, సెప్టెంబరు16(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బతుకమ్మ పండుగ (Bathukamma Festival)ను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. బతుకమ్మకు సంబంధించిన పాటలను పాడుకుంటూ మహిళలు సందడిగా చేసుకుంటారు. బతుకమ్మ పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలోని యువ సృజనశీలురకు పట్టం కట్టేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (Telangana Film Development Corporation) బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ పేరిట షార్ట్ ఫిలిమ్స్ పోటీలు (Short Films Competition) నిర్వహిస్తోంది. మూడు నిమిషాలు, ఐదు నిమిషాల్లోపు నిడివి కలిగిన రెండు కేటగిరీల్లో షార్ట్ ఫిలిమ్స్‌కు పంపించాలని ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు (Dil Raju) సూచించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి , సంక్షేమం(మహిళలకు ఉచిత బస్సు, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ తదితరాలు), తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్ ఫిలిమ్స్, పాటల పోటీలను పంపించాలని సూచించారు దిల్ రాజు.
సెప్టెంబరు 30వ తేదీలోపు ఎంట్రీలను పంపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిర్దేశిత గడువులోగా అందిన ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ సభ్యులు వీక్షించి ఎంపిక చేస్తారని దిల్ రాజు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే వారికి భవిష్యత్తులోనూ అనేక రకాలుగా ప్రోత్సహం ఇస్తామని చెప్పుకొచ్చారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను ఇవాళ(మంగళవారం) విడుదల చేశారు ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు.
ఎంట్రీలను ఈ కింది మెయిల్ ఐడీ youngfilmmakerschallenge@gmail.com లేదా వాట్సాప్ నెంబర్ - 8125834009 (WhatsApp Only)కు పంపించాల్సి ఉంటుందని వెల్లడించారు. పోటీలో ఎంపికైన షార్ట్ ఫిలిమ్స్‌కు ప్రథమ బహుమతి రూ. 3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ. 2 లక్షలు, తృతీయ బహుమతి రూ. 1 లక్ష చొప్పున అందిస్తారని వివరించారు. మరో ఐదుగురికి రూ. 20 వేల చొప్పున కన్సోలేషన్ బహుమతులు అందజేస్తారని ప్రకటించారు. వీటితో పాటు బహుమతి గ్రహీతలకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను ప్రదానం చేస్తారని ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు.
పోటీలో పాల్గొనడానికి అర్హతలు:
ఈ పోటీలో పాల్గొనే వారి వయసు 40 ఏళ్లలోపు ఉండాలి.
షార్ట్ ఫిల్మ్స్ / వీడియో సాంగ్స్ 4K రిజల్యూషన్ కలిగి ఉండాలి.
షార్ట్ ఫిల్మ్స్ / వీడియో సాంగ్స్ ఏవైనా ఈ పోటీల్లో సూచించిన ‘థీమ్’ల పైనే ఉండాలి.
మీరు చేసిన వీడియోలు గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు.
బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ కోసం మాత్రమే చిత్రీకరించినవై ఉండాలని దిల్‌రాజ్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్రూప్-1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయొద్దు: ర్యాంకర్ల తల్లిదండ్రులు
ట్రాన్స్‌జెండర్‌లకు గౌరవం.. రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
For More TG News And Telugu News