Heavy Rains: తెలుగు రాష్ట్రాలను వీడని వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్, ఎల్లో అలెర్ట్ జారీ
ABN , Publish Date - Aug 18 , 2025 | 03:55 PM
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం సోమవారం రాత్రి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మంగళవారం ఉదయానికి వాయుగుండంగా దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. దీని ప్రభావంతో మంగళవారం కోస్తాలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వివరించారు. భారీవర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలు, గోడలు వద్ద ఉండరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎగువ ప్రాంతాల్లో, మన రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదుల వరద ప్రవాహం హెచ్చరిక స్థాయికి చేరిందన్నారు. వివిధ ప్రాజెక్టుల్లోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున ఆయా నదీ పరీవాహక ప్రాంత, లోతట్టు/లంక గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
చేపల వేటకు వెళ్లవద్దు...
బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్లడం లాంటివి చేయరాదని హెచ్చరించారు ప్రఖర్ జైన్. గోదావరి నదికి వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోందని, సోమవారం సాయంత్రం 5 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 37.7 అడుగులు ఉందని పేర్కొన్నారు. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.35 లక్షల క్యూసెక్కులు ఉందని వెల్లడించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది వరద సోమవారం సాయంత్రం 5 గంటల నాటికి ఇన్, ఔట్ ఫ్లో 2.53 లక్షల క్యూసెక్కులు ఉందని చెప్పుకొచ్చారు. సోమవారం సాయంత్రం 5 గంటల నాటికి అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో 73మిల్లిమీటర్ల, మన్యం జిల్లా గుళ్లసీతారామపురంలో 66మిల్లిమీటర్ల, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో 60.2మిల్లిమీటర్ల, అల్లూరి జిల్లా కొత్తూరులో 59.5మిల్లిమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.
హెచ్చరికలు జారీ..
విశాఖపట్నం , అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు , ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. అన్ని పోర్టుల్లో మూడో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ప్రాజెక్టులకు జలకళ..
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పలు జలపాతాలు సైతం పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దీంతో పెద్దఎత్తున ప్రజలు జలపాతాల వద్దకు వెళ్తున్నారు. అలాగే ఏపీ, తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
నిలిచిన రాకపోకలు...
కాగా, హైదరాబాద్‌లోని విద్యానగర్ టీఆర్టీ కాలనీలో భారీ చెట్టు నేలకూలింది. దీంతో సమీపంలోని కారు ధ్వంసమైంది. మేడ్చల్, శామీర్‌పేట్, మూడుచింతలపల్లిలో చెరువులు అలుగు పారుతున్నాయి. మేడ్చల్-గౌడవెల్లి రహదారిపై వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలతో మూసీ ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. భారీ వరదతో ఆరు గేట్లు ఎత్తివేశారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్‌కు భారీగా వరద పోటెత్తుతోంది. భారీ వరద ప్రవాహంతో 24 గేట్లు ఎత్తివేశారు. ఏలూరు జిల్లాలోని కొల్లేరుకు భారీగా వరద చేరింది. మరోవైపు పెనుమాకలంక-కైకలూరు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.
ఛత్తీస్‌గఢ్, ఒడిశా, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు...
దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశాలను కూడా భారీ వర్షాలు ముంచెత్తుతాయని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. ఈనెల (ఆగస్టు) 18, 19 తేదీల్లో కొంకణ్ ప్రాంతం (ముంబైతో సహా) గోవా, మధ్య మహారాష్ట్ర ఘాట్ ప్రాంతాలు, తీర కర్ణాటకలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఈనెల 19, 20 తేదీల్లో గుజరాత్ రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముంబైని వరదలు ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలతో హిమాచల్‌ప్రదేశ్ అతలాకుతలమైంది. హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 15 పంచాయతీలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం, ఇంట్లో ఒంటరిగా ఉన్న పన్నెండేళ్ల బాలిక హత్య
కేంద్రం నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి.. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
Read latest Telangana News And Telugu News