Messis Historic Visit to Hyderabad Uppal Stadium: మెస్సీ..మాస్ జాతర
ABN , Publish Date - Dec 14 , 2025 | 07:07 AM
Messis Historic Visit to Hyderabad A Memorable Football Extravaganza at Uppal Stadium
సాకర్ దిగ్గజం నామస్మరణతో మార్మోగిన ఉప్పల్ స్టేడియం
స్టేడియంలో లియోనెల్, రేవంత్ పరేడ్
53 నిమిషాలు స్టేడియంలో ఉన్న అర్జెంటీనా స్టార్
కలలో కూడా సాధ్యం కాదేమో అనుకున్నది సుసాధ్యమైతే..! జీవిత కాలంలో చూడగలుగుతామా? అనుకున్న వ్యక్తి కళ్ల ముందే సాక్షాత్కరిస్తే..! ఉప్పల్ స్టేడియంలో శనివారం రాత్రి వేలాదిమంది అభిమానులకు ఇలాంటి అనుభవమే స్వానుభవంలోకి వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాలర్, అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌లో అడుగుపెట్టి అభిమానులను మురిపించాడు. తమ ఆరాధ్య ఆటగాడిని తనివితీరా చూసుకోవడమే కాకుండా.. అతడి ఫుట్‌బాల్ విన్యాసాలను కూడా కాసేపు కనులారా వీక్షించగలిగారు. మైదానమంతా కలియదిరగడంతో పాటు, స్టాండ్స్‌లోకి బంతిని కిక్ చేసి మరింత జోష్ నింపాడు. మొత్తంగా గ్రౌండంతా మెస్సీ నామస్మరణతో ఊగిపోయింది. లేజర్ షో ధగధగలు.. బాణసంచా వెలుగు జిలుగులు.. అచ్చ తెలుగు పాటలు స్టేడియంలోని అభిమానులను ఉర్రూతలూగించాయి. అయితే కోల్‌కతా రచ్చతో ఇక్కడి ఈవెంట్ సందేహంలో పడినా.. నిర్వహణలో తీసుకున్న పకడ్బందీ చర్యలతో మెస్సీ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయ్యిందని అనుకోవచ్చు.
మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా వరల్డ్ చాంపియన్, అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. ‘గోట్’ ఇండియా టూర్‌లో భాగంగా మెస్సీతో పాటు అతడి ఇంటర్ మయామీ క్లబ్ సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డిపాల్ కూడా ప్రత్యేక విమానంలో నగరానికి వచ్చారు. ఉదయం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన రసాభాస కారణంగా ఉప్పల్ మైదానంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. టూర్‌లో భాగంగా సింగరేణి రేవంత్ రెడ్డి 9-అపర్ణ మెస్సీ టీమ్ మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సీఎం రేవంత్ పాలు పంచుకోగా.. చివర్లో మెస్సీ ఎంట్రీ ఇవ్వడం అభిమానులను ఉర్రూతలూగించింది. అంతకంటే ముందు మెస్సీ హైదరాబాద్ టూర్‌ను అద్భుత ప్రణాళికతో, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతం చేయగలిగింది.
నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు..
కోల్‌కతా నుంచి సాయంత్రం 5.40 గంటలకు మెస్సీ తన బృందంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. ఆ వెంటనే స్థానిక పోలీసులు ఏర్పాటు చేసిన గ్రీన్ చానెల్ ద్వారా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్‌కు వెళ్లాడు. సాయంత్రం ఆరు గంటలకు అక్కడికి చేరిన మెస్సీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. సీఎం వెంట పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఇతర అధికారులు ఉన్నారు.

గోల్ చేసిన రేవంత్: మెస్సీ స్టేడియంలో అడుగుపెట్టక ముందే రాత్రి 7.47 గంటలకు సింగరేణి రేవంత్ రెడ్డి9-అపర్ణ మెస్సీ టీమ్‌ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ ఆరంభమైంది. సౌత్ స్టాండ్‌కు దగ్గరలో ఈ మ్యాచ్ కోసం గోల్ పోస్టులను ఏర్పాటు చేశారు. కాసేపటికే సీఎం రేవంత్, ఎంపీ రాహుల్ గాంధీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టారు. ఎరుపు టీషర్ట్, తెలుపు నిక్కర్‌తో పూర్తి స్థాయి ఫుట్‌బాల్ జెర్సీ ధరించిన సీఎం రేవంత్ తన జట్టుతో పాటు చేరారు. అప్పటికే ఆర్‌ఆర్ టీమ్ మూడు గోల్స్ చేయగా.. బరిలోకి దిగిన కొద్దిసేపటికే కీపర్‌ను ఏమార్చుతూ గోల్ పోస్టు సమీపంలో తనకు లభించిన పాస్‌ను సీఎం గోల్‌గా మలిచారు.
మెస్సీ..మెస్సీ: ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతుండగా రాత్రి 7.56 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నాడు. నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి మ్యాచ్‌ను గమనించాడు. తనను బిగ్ స్ర్కీన్‌లో చూసిన ప్రేక్షకులు మెస్సీ.. మెస్సీ అంటూ గట్టిగా అరుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. పావుగంటయ్యాక తను గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో స్టేడియం హోరెత్తి పోయింది. అక్కడే వరుసగా నిల్చొని ఇరుజట్ల ఆటగాళ్లకు కరచాలనం ఇచ్చాడు. అదే వరుసలో సీఎం రేవంత్ కూడా నిల్చొని మెస్సీకి షేక్‌హ్యాండ్ ఇవ్వడం విశేషం.

సీఎం, మెస్సీ బంతాట: ప్రేక్షకులకు అభివాదం చేస్తూ మెస్సీ, రేవంత్ బంతితో డ్రిల్స్ చేయడం ఫ్యాన్స్‌లో మరింత జోష్‌ను నింపింది. వీరికి సువారెజ్, డిపాల్ కూడా కలవడంతో నలుగురి మధ్య డ్రిల్స్ అదుర్స్ అనిపించింది. అంతేకాకుండా మెస్సీ తన ఎదురుగా ఉన్న గోల్‌పోస్టులోకి బంతిని పంపి మరింత ఆనందాన్ని నింపాడు. దీంతో కాసేపు రేవంత్ గోల్ కీపర్‌గా మారి అక్కడి నుంచి బంతిని మెస్సీ వైపు పాస్ చేశాడు. ఈ సమయంలో మెస్సీ మరోసారి గోల్ చేశాడు. ఆ తర్వాత రెండు జట్లు కలిసి మెస్సీతో ఫొటో దిగాయి. అలాగే మెస్సీ అతడి సహచరులు ఫుట్‌బాల్స్‌ను కిక్స్ ద్వారా స్టాండ్స్‌లోకి పంపడంతో వాటిని అందుకునేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు.

ఫుట్‌బాల్ క్లినిక్: అనంతరం స్టేడియంలోని మూడు చోట్ల (సౌత్ వెస్ట్ స్టాండ్, నార్త్ స్టాండ్, ఈస్ట్ స్టాండ్) ఫుట్‌బాల్ క్ల్లినిక్‌లు నిర్వహించారు. రేవంత్ రెడ్డి మనమడితో సహా మొత్తం 18 మంది పిల్లలు ఈ సాకర్ క్ల్లినిక్‌లో పాల్గొన్నారు. ఇందులో పాస్‌లు చేయడం, బంతిని నియంత్రించడంపై మెస్సీ, రోడ్రిగో, సువారెజ్ పిల్లలకు చేసి చూపించారు. ఈ క్ల్లినిక్‌లో రేవంత్ రెండుసార్లు హెడర్‌తో బంతిని కొట్టారు.
నేలపై లేజర్ షో: మైదానంలో మెస్సీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫుట్‌బాల్ గ్రౌండ్ నేలపై జెర్సీ నెంబర్ 10, మెస్సీ ఫొటోతో మొదలైన లేజర్ షో, ఆతర్వాత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఫొటోలతో చేసిన ప్రదర్శన అభిమానులను మంత్రముగ్ధులను చేసింది.
బాణసంచా వెలుగులు: బాణసంచా వెలుగుల్లో ఉప్పల్ స్టేడియం మెరిసిపోయింది. సాయంత్రం ఆరు గంటల నుంచి కార్యక్రమం ముగిసేవరకు బాణాసంచా కాంతులతో స్టేడియం మిరుగొట్లు గొల్పింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలో విద్యుత్ దీపాలను మొత్తం ఆర్పేసి, గ్యాలరీలోని ఫ్యాన్స్‌తో సెల్‌ఫోన్ టార్చ్‌లు వేయించి చేసిన అభివాదం అందరిలోనూ ఉత్సాహం నింపింది.
స్పెషల్ ఆటోగ్రాఫ్..
ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడిన జట్లకు మెస్సీ ట్రోఫీలను ప్రదానం చేశాడు. ఆ తర్వాత మెస్సీకి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ప్రత్యేక జ్ఞాపికలను అందించారు. అనంతరం మెస్సీ ఒక జెర్సీ, సాకర్ బంతిపై రేవంత్‌కు ప్రత్యేకంగా సంతకం చేసి ఇచ్చారు.

ఆర్‌ఆర్9 టీమ్‌కు గోట్ కప్
ఫ్రెండ్లీ మ్యాచ్ ముగిశాక మెస్సీ బృందం, రేవంత్ కలిసి ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ స్టేడియం చుట్టూ కలియదిరిగారు. అలాగే నాలుగు చోట్ల ఆగి పిల్లలతో కలిసి వీరంతా కాసేపు డ్రిల్స్ చేసి వారిని ఆనందంలో ముంచారు. ఆ తర్వాత స్టేడియంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద విజేత సింగరేణి ఆర్‌ఆర్9కు మెస్సీ గోట్ కప్‌ను అందించాడు. అలాగే రన్నరప్ అపర్ణ మెస్సీ జట్టుకు రేవంత్ ట్రోఫీని అందించారు.
ఒకే ఫ్రేమ్‌లో మెస్సీ, రాహుల్, రేవంత్
మెస్సీ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం లోపల ఏర్పాటు చేసిన భారీ డిజిటల్ బ్యానర్ అభిమానులను విపరీతంగా ఆకర్షించింది. ఆ ఫొటోలో సాకర్ స్టార్ మెస్సీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పక్కపక్కనే ఉన్నారు. ‘ఒకే ఫ్రేమ్‌లో మెస్సీ, రాహుల్, రేవంత్’ అంటూ ఆ ఫొటోను నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు.
నేడు ముంబైలో మెస్సీ షెడ్యూల్
మధ్యాహ్నం: 3.30కు క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో
క్రికెట్ స్టార్లతో గోట్ కప్ మ్యాచ్.
సాయంత్రం: 4.00కు సెలెబ్రిటీ ఫుట్‌బాల్
మ్యాచ్‌లో పాల్గొంటాడు.
సాయంత్రం: 5.00కు వాంఖడే స్టేడియంలో
చారిటీ ఫ్యాషన్ షోకు హాజరు.
(హైదరాబాద్-ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి)
ఇవి కూడా చదవండి:
కోల్‌కతాలో మెస్సీ 'గోట్ ఇండియా టూర్' ఆర్గనైజర్ అరెస్ట్
ప్రజాతీర్పును గౌరవించాల్సిందే.. బీజేపీ విక్టరీని అభినందించిన శశిథరూర్