Ind Vs NZ: వన్డే సిరీస్‌లో పంత్‌పై వేటు.. జట్టులోకి సంచలన బ్యాటర్!
ABN , Publish Date - Dec 28 , 2025 | 03:15 PM
భారత జట్టు న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి 18 వరకు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్‌పై వేటు పడే అవకాశముంది. దేశవాళీల్లో అదరగొడుతున్న సంచలన బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా.. ప్రస్తుతం ఒక్క టెస్టు ఫార్మాట్‌లో మినహా మిగతా అన్నీ ఫార్మాట్లలో గొప్పగా రాణిస్తుంది. ఆటగాళ్ల అన్నీ విభాగాల్లో అద్భుత ప్రదర్శనలు చేస్తున్నారు. అయితే భారత జట్టు న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి 18 వరకు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. త్వరలోనే సెలక్టర్లు జట్టును ప్రకటించే అవకాశముంది. వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant)పై వేటు పడే అవకాశముంది. దేశవాళీల్లో అదరగొడుతున్న సంచలన బ్యాటర్ ఇషాన్ కిషన్(Ishan Kishan)ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.
ఆగస్టు 2024లో పంత్, శ్రీలంకతో చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఇటీవల సఫారీలతో వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. కానీ ఒక్క మ్యాచులోనూ తుది జట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పంత్‌ను కివీస్‌తో వన్డేలకు ఎంపిక చేయకూడదని సెలక్టర్లు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మరోవైపు ఇషాన్ కిషన్ వన్డేలు ఆడి రెండేళ్లు దాటిపోయింది. అతను చివరగా 2023 వన్డే ప్రపంచ కప్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచులో ఆడాడు. తర్వాత పలు అనివార్య కారణాల వల్ల జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టాప్ స్కోరర్‌గా నిలిచి మళ్లీ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. జార్ఖండ్ తొలిసారి SMAT టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఇషాన్ కిషన్‌ను టీ20 వరల్డ్ కప్ 2026కు ఎంపిక చేశారు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటకపై 33 బంతుల్లోనే శతక్కొట్టి మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలోనే ఇషాన్‌ను తిరిగి వన్డే జట్టులోకి తీసుకోవాలని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం.
వారు ఉంటారా?
మెడ నొప్పి కారణంగా సఫారీలతో వన్డే సిరీస్‌కు దూరమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కివీస్‌తో వన్డేలకు అందుబాటులో ఉంటాడా? లేదా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం అతను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స తీసుకుంటున్నాడు.
ఇవి కూడా చదవండి
తనను ఔట్ చేసిన బౌలర్‌కు విరాట్ అదిరిపోయే గిఫ్ట్!
ఇది మాకు ఎంతో ప్రత్యేకం.. తమ చారిత్రక విజయంపై స్టోక్స్