Share News

England Ends 15 Year Drought: ఎన్నాళ్లకెన్నాళ్లకు..

ABN , Publish Date - Dec 28 , 2025 | 06:19 AM

ఇప్పటికే యాషెస్‌ సిరీ్‌సను ఆస్ట్రేలియాకు కోల్పోయిన ఇంగ్లండ్‌ నాలుగో టెస్ట్‌లో అద్భుతంగా పుంజుకుంది. తొలిరోజు వెనుకంజలో నిలిచినా, ఆ తర్వాత అమోఘంగా పోరాడింది...

England Ends 15 Year Drought: ఎన్నాళ్లకెన్నాళ్లకు..

15 ఏళ్లు.. 18 టెస్ట్‌ల తర్వాత

ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్‌కు విజయం

నాలుగో టెస్ట్‌లో కంగారూల చిత్తు

రెండ్రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌

యాషెస్‌ సిరీస్‌

మెల్‌బోర్న్‌: ఇప్పటికే యాషెస్‌ సిరీ్‌సను ఆస్ట్రేలియాకు కోల్పోయిన ఇంగ్లండ్‌ నాలుగో టెస్ట్‌లో అద్భుతంగా పుంజుకుంది. తొలిరోజు వెనుకంజలో నిలిచినా, ఆ తర్వాత అమోఘంగా పోరాడింది. ఫలితంగా రెండ్రోజుల్లోనే మ్యాచ్‌ను ముగిస్తూ ఇంగ్లండ్‌ నాలుగు వికెట్లతో అపురూప విజయం అందుకుంది. దాంతో 18 వరుస టెస్ట్‌ల తర్వాత, దాదాపు 15 సంవత్సరాల అనంతరం ఆస్ట్రేలియా గడ్డపై తొలి గెలుపు రుచి చూసింది. 2010-11లో సిడ్నీ టెస్ట్‌ నెగ్గిన తర్వాత ఆస్ట్రేలియాలో 16 మ్యాచ్‌లను ఓడిపోయిన ఇంగ్లండ్‌, రెండింటిని డ్రా చేసుకుంది. ఇక..ఈ నాలుగో టెస్ట్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు 4/0తో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన కంగారూలు 132 పరుగులకే కుప్పకూలారు. హెడ్‌ (46), కెప్టెన్‌ స్మిత్‌ (24 నాటౌట్‌), గ్రీన్‌ (19) మినహా అంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. బ్రైడన్‌ కార్స్‌ నాలుగు, స్టోక్స్‌ మూడు, జోష్‌ టంగ్‌ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 175 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 178/6 స్కోరు చేసి ఛేదించింది. బెథెల్‌ (40), క్రాలీ (37), డకెట్‌ (34) రాణించారు. రిచర్డ్‌సన్‌, బోలాండ్‌, స్టార్క్‌ తలా రెండేసి వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 152, ఇంగ్లండ్‌ 110 రన్స్‌ చేశాయి. ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో ఆస్ట్రేలియా 3-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ టెస్టులో ఓవరాల్‌గా 7 వికెట్లు తీసిన జోష్‌ టంగ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

సంక్షిప్తస్కోర్లు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 152, రెండో ఇన్నింగ్స్‌: 132 (హెడ్‌ 46, స్మిత్‌ 24 నాటౌట్‌, గ్రీన్‌ 19, కార్స్‌ 4/34, స్టోక్స్‌ 3/24, టంగ్‌ 2/44)

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 110, రెండో ఇన్నింగ్స్‌: 178/6 (బెథెల్‌ 40, క్రాలీ 37, డకెట్‌ 34, బ్రూక్‌ 18 నాటౌట్‌, రిచర్డ్‌సన్‌ 2/22, బోలాండ్‌ 2/29, స్టార్క్‌ 2/55).


ఆసీస్‌దే అగ్రస్థానం

ఈ ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) సైకిల్‌లో ఇప్పటి వరకు 100 శాతం పాయింట్లతో ఆస్ట్రేలియా పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కానీ బాక్సింగ్‌ డే టెస్ట్‌ ఓటమితో ఆ జట్టు పాయింట్ల శాతం 85.71కి తగ్గింది. అయినా కంగారూలే టాప్‌లో ఉన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసును మరింత పటిష్టం చేసుకున్నారు. ఇంగ్లండ్‌ (35.19 శాతం) ఏడో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్‌ (77.78), దక్షిణాఫ్రికా (75) వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

4

యాషెస్‌ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో (852) ముగిసిన నాలుగో టెస్ట్‌గా ఈ మ్యాచ్‌ రికార్డుకెక్కింది. ఓల్డ్‌ట్రాఫర్డ్‌ (1888, 788 బంతులు) లార్డ్స్‌ (1888, 792), ఈ సిరీస్‌ పెర్త్‌ తొలిటెస్ట్‌ (847 బంతులు) ముందున్నాయి.

5

ఓ సిరీ్‌సలో ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే ముగియడం టెస్ట్‌ చరిత్రలో ఇది ఐదోసారి. ఈ యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్ట్‌ (పెర్త్‌) కూడా రెండో రోజుల్లో ముగిసిన విషయం తెలిసిందే.

5

ఏ బ్యాటర్‌ కూడా అర్ధ శతకం చేయకుండా టెస్ట్‌ ముగియడం సుదీర్ఘ ఫార్మాట్‌ చరిత్రలో ఇది ఐదోసారి.

ఇవి కూడా చదవండి

తనను ఔట్ చేసిన బౌలర్‌కు విరాట్ అదిరిపోయే గిఫ్ట్!

ఇది మాకు ఎంతో ప్రత్యేకం.. తమ చారిత్రక విజయంపై స్టోక్స్

Updated Date - Dec 28 , 2025 | 06:19 AM