Ind Vs NZ: వన్డే సిరీస్.. కీలక ప్లేయర్లు దూరం!
ABN , Publish Date - Dec 29 , 2025 | 10:07 AM
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. జనవరి 11నుంచి టీమిండియాతో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ.. వన్డే జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే ఇందులో స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ 2026కి ముందు న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా జనవరి 11 నుంచి మూడు వన్డేలు ఐదు టీ20లు ఆడనుంది. అయితే ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న ప్రపంచ కప్‌నకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించిన భారత జట్టును ఇటీవలే బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే టీమ్ న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో పాల్గొననుంది. అయితే న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు సంబంధించి భారత జట్టును ఇంకా ప్రకటించలేదు.
ఈ నేపథ్యంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. టీమిండియా స్టార్ ప్లేయర్లు బుమ్రా(Bumrah), హార్దిక్ పాండ్య(Hardik Pandya)కు వన్డే సిరీస్‌కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా, టీ20 ప్రపంచ కప్ 2026ను దృష్టిలో పెట్టుకుని.. ఆ సమయానికి వారు ఫిట్‌గా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇషాన్ వస్తాడా..?
టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant) స్థానంలో దేశవాళీల్లో అదరగొడుతున్న ఇషాన్ కిషన్(Ishan Kishan ) లేదా జితేశ్ శర్మను జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఇషాన్ కిషన్‌కే ఈ అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హార్దిక్ పాండ్య.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తర్వాత మళ్లీ వన్డే జట్టులోకి రాలేదు. అలాగే బుమ్రా 2023 ప్రపంచ కప్ తర్వాత నుంచి వన్డేల్లో ఆడలేదు.
ఇవి కూడా చదవండి
వన్డే సిరీస్‌లో పంత్‌పై వేటు.. జట్టులోకి సంచలన బ్యాటర్!
సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. పాక్ స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు