FIDE World Rapid Chess Championship: హంపి, అర్జున్ కంచు మోత
ABN , Publish Date - Dec 29 , 2025 | 04:54 AM
ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షి్‌పలో తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ఇరిగేసి అర్జున్ అసమాన పోరాటంతో పతకాలు కొల్లగొట్టారు. ఆదివారం ముగిసిన ర్యాపిడ్ పోటీల్లో ఈ ఇరువురు టైటిల్‌కు...
ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్‌లో కాంస్యాలు కైవసం
ఓపెన్ విజేత కార్ల్‌సన్
అలెక్సాండ్రాకు మహిళల టైటిల్
దోహా: ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షి్‌పలో తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ఇరిగేసి అర్జున్ అసమాన పోరాటంతో పతకాలు కొల్లగొట్టారు. ఆదివారం ముగిసిన ర్యాపిడ్ పోటీల్లో ఈ ఇరువురు టైటిల్‌కు చేరువగా వచ్చినా, చివరకు కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. వరల్డ్ నెంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ ఓపెన్ విభాగంలో ఆరోసారి ర్యాపిడ్ టైటిల్‌ను ఖాతాలో వేసుకోగా, మహిళల కేటగిరీలో రష్యా జీఎం అలెక్సాండ్రా గోర్యాచ్కినా విజేతగా నిలిచింది. ఇక.. ఓపెన్ విభాగంలో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన భారతీయుడుగా అర్జున్ రికార్డుకెక్కడం విశేషం.
టైటిల్‌కు చేరువై..
ర్యాపిడ్‌లో తిరుగులేని హంపి.. మూడో ప్రపంచ టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగింది. ఆదివారం జరిగిన ఆఖరి మూడో రౌండ్లలో డిఫెండింగ్ చాంపియన్ హంపి రెండు రౌండ్లు డ్రా చేసుకోగా, ఒక రౌండ్‌లో విజయం సాధించింది. మొత్తం 11 రౌండ్లు ముగిసేసరికి హంపి 8.5 పాయింట్లతో ఝు జినెర్ (చైనా), అలెక్సాండ్రా (రష్యా)తో సమంగా నిలిచింది. అయితే, టైబ్రేక్ నిబంధనల ప్రకారం అలెక్సాండ్రా, జినెర్ టైటిల్ వేటలో నిలవగా, హంపి మూడోస్థానానికి పరిమితమైంది. అనంతరం నిర్వహించిన టైబ్రేకర్‌లో జినెర్‌ను ఓడించి అలెక్సాండ్రా విజేతగా నిలిచింది. మిగతా భారత క్రీడాకారిణుల్లో సవిత నాలుగో స్థానం, వైశాలి ఐదో స్థానం, దివ్యా దేశ్‌ముఖ్ 8వ, తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక 19వ స్థానాల్లో నిలిచారు. ఇక, ఈ పతకంతో వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్‌షి్‌పలో హంపి పతకాల సంఖ్య ఐదుకి చేరింది. కాగా, ఈ చాంపియన్‌షిప్‌లో బ్లిట్జ్ విభాగం పోటీలు సోమవారం నుంచి జరగనున్నాయి.
అర్జున్ అదిరెన్
ఓపెన్ విభాగంలో మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) ర్యాపిడ్ కిరీటం కైవసం చేసుకోగా, వరంగల్ కుర్రాడు అర్జున్ కాంస్యం సాధించాడు. రష్యా జీఎం వ్లాడిస్లావ్ ఆర్టిమివ్ రజతంతో పోటీలను ముగించాడు. ఆదివారం జరిగిన ఆఖరి నాలుగు రౌండ్లలో అర్జున్ ప్రత్యర్థి అంచనాలను తలకిందులు చేస్తూ మూడింట్లో విజయం సాధించాడు. మొత్తంగా కార్ల్‌సన్ 10.5 పాయింట్లతో మరొకరితో పోటీ లేకుండా అగ్రస్థానంలో నిలిచి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆర్టిమివ్, అమెరికా జీఎంలు నీమన్, లీనియర్ డోమింగ్యూజ్‌తో కలిసి 9.5 పాయింట్లతో సంయుక్తంగా ద్వితీయ స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరుతో ఆర్టిమివ్ రజతం, అర్జున్ కాంస్యం దక్కించుకున్నారు. ఇతర భారత జీఎంలలో అరవింద్ చిదంబరం 16వ, నిహాల్ సరిన్ 19వ, గుకేష్ 20వ, ప్రజ్ఞానంద 28వ స్థానాలతో సరిపెట్టుకున్నారు.
వరల్డ్ ర్యాపిడ్ చెస్‌లో
హంపి హవా
2012లో కాంస్యం
2019లో స్వర్ణం
2023లో రజతం
2024లో స్వర్ణం
2025లో కాంస్యం
ఇవి కూడా చదవండి
వన్డే సిరీస్‌లో పంత్‌పై వేటు.. జట్టులోకి సంచలన బ్యాటర్!
సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. పాక్ స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు