India Women Versus Sri Lanka Women: ఎదురులేని భారత్
ABN , Publish Date - Dec 29 , 2025 | 04:50 AM
ఏకపక్షంగా సాగుతున్న భారత్-శ్రీలంక సిరీ్‌సలో నాలుగో టీ20 మస్తు మజా పంచింది. జరిగిన మూడు మ్యాచ్‌లు స్వల్ప స్కోర్లకే పరిమితం కాగా..ఆదివారంనాటి టీ20లో పరుగులు వెల్లువెత్తాయి....
మంధాన, షఫాలీ మెరుపులు
నాలుగో టీ20లోనూ శ్రీలంక ఓటమి
తిరువనంతపురం: ఏకపక్షంగా సాగుతున్న భారత్-శ్రీలంక సిరీ్‌సలో నాలుగో టీ20 మస్తు మజా పంచింది. జరిగిన మూడు మ్యాచ్‌లు స్వల్ప స్కోర్లకే పరిమితం కాగా..ఆదివారంనాటి టీ20లో పరుగులు వెల్లువెత్తాయి. రెండు జట్ల బ్యాటర్లు ధనాధన్ బ్యాటింగ్‌తో అభిమానులను అలరించారు. అయితే అంతిమంగా 30 పరుగలతో హర్మన్ సేనదే పైచేయి అయ్యింది. దాంతో అయిదు మ్యాచ్‌ల సిరీ్‌సలో భారత్ 4-0తో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత భారత్ 20 ఓవర్లలో 221/2 స్కోరు చేసింది. స్మృతీ మంధాన (48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80), షఫాలీ వర్మ (46 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 79), రిచా ఘోష్ (16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో అదరగొట్టారు. అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 191/6 స్కోరు చేసి ఓడింది. కెప్టెన్ చమరి అటపట్టు (37 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 52), హాసినీ పెరీరా (20 బంతుల్లో 7 ఫోర్లతో 33), ఇమేష (28 బంతుల్లో 3 ఫోర్లతో 29), నీలాక్షికా సిల్వా (11 బంతుల్లో 4 ఫోర్లతో 23 నాటౌట్) సత్తా చాటారు. వైష్ణవి, అరుంధతి చెరో 2 వికెట్లు తీశారు. మంధాన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది.
ధాటిగా ఆరంభించినా..: భారీ ఛేదనను లంక దూకుడుగా ఆరంభించింది. అటపట్టు, హాసినీ పెరీరా ధాటిగా ఆడి మొదటి వికెట్‌కు 59 రన్స్ జోడించారు. హాసినిని అవుట్ చేసి అరుంధతి కీలక బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత అటపట్టు భారత బౌలర్లను వణికించి ఫిఫ్టీ అందుకుంది. కానీ యువ స్పిన్నర్ వైష్ణవీ శర్మ అటపట్టుతోపాటు హర్షిత (13 బంతుల్లో 20)ను అవుట్ చేయడంతో మ్యాచ్ భారత్ చేతికొచ్చింది. ఆపై లంక బ్యాటర్లు పోరాడినా ఫలితం లేకపోయింది.
మంధాన, షఫాలీ ఆకాశమే హద్దుగా..: గత మూడు మ్యాచుల్లో విఫలమైన స్మృతీ మంధాన ఈసారి చూడముచ్చటైన భారీషాట్లతో పరుగులు కొల్లగొట్టింది. షఫాలీ కూడా ఆమెకు తోడవడంతో భారత్ స్కోరుబోర్డు రాకెట్‌లా దూసుకెళ్లింది. షెహానీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో 4,4.. కవింది వేసిన ఓవర్లో మరో రెండు బౌండ్రీలతో మంధాన కదం తొక్కింది. మరోవైపు రష్మిక ఓవర్లో 4,4తో చెలరేగిన షఫాలీ..ఆటపట్టు ఓవర్లో 2 వరుస ఫోర్లతో విరుచుకుపడింది. దాంతో పవర్‌ప్లేలో భారత్ 61/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. అయితే మధ్యలో రెండు ఓవర్లపాటు స్కోరు వేగం మందగించింది. కానీ నిమిష వేసిన 11వ ఓవర్లో బౌండ్రీతో సిరీ్‌సలో వరుసగా మూడో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన షఫాలీ ఆపై 6,4తో విజృంభించింది. దాంతో ఆ ఓవర్లో 15 రన్స్ వచ్చాయి. ఇక, సెవంది ఓవర్లో 4,6,4 బాదిన మంధాన సైతం హాఫ్ సెంచరీ పూరించింది. ఇదే ధాటిని కొనసాగిస్తూ చమరి వేసిన 13వ ఓవర్లో షఫాలీ 4, మంధాన 4, 6 తో పరుగుల సునామీ సృష్టించారు. అయితే లంకకు ఊరటనిస్తూ నిమిష 16వ ఓవర్లో షఫాలీని క్యాచవుట్ చేసింది. ఫలితంగా 162 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాతి ఓవర్లో మంధానాను షెహానీ అవుట్ చేసింది. కానీ నిమిష ఓవర్లో 4, 4తో బ్యాట్ ఝళిపించిన రిచా ఘోష్..దిల్హరీ ఓవర్లో 6, 6, 4, 6తో దుమ్ము రేపింది. దాంతో భారత్ స్కోరు 200 మార్క్ దాటగా, కెప్టెన్ హర్మన్ (10 బంతుల్లో 16 నాటౌట్) 6, 4తో ఇన్నింగ్స్‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లలో 221/2 (స్మృతీ మంధాన 80, షఫాలీ 79, రిచా 40).
శ్రీలంక: 20 ఓవర్లలో 191/6 (చమరి అటపట్టు 52, హాసినీ 33, ఇమేష 29; వైష్ణవి 2/24, అరుంధతి 2/42).
1
అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో వేగంగా (280 ఇన్నింగ్స్) 10వేల పరుగులు చేసిన బ్యాటర్ మంధాన. ఈక్రమంలో మిథాలీ రాజ్ (291 ఇన్నింగ్స్)ను అధిగమించింది.
1
221/2 టీ20లలో భారత్‌కు అత్యధిక స్కోరు.
1
మంధాన, షఫాలీ తొలి వికెట్‌కు నెలకొల్పిన 162 రన్స్ టీ20లలో భారత్‌కు ఏ వికెట్‌కైనా అత్యధికం.
4
మంధాన, షఫాలీ కలిసి 100 పరుగులకుపైగా జోడించడం ఇది నాలుగో సారి. ఈక్రమంలో వెస్టిండీ్‌సపై 2019లో వీరు నెలకొల్పిన 143 పరుగుల గత అత్యుత్తమ భాగస్వామ్యాన్ని తిరగ రాశారు.
ఇవి కూడా చదవండి
వన్డే సిరీస్‌లో పంత్‌పై వేటు.. జట్టులోకి సంచలన బ్యాటర్!
సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. పాక్ స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు