Share News

Matheesha Pathirana: ధోనీ భాయ్‌కి రుణపడి ఉంటా.. పతిరన ఎమోషనల్ పోస్ట్

ABN , Publish Date - Dec 17 , 2025 | 09:55 AM

శ్రీలంక స్టార్ పేసర్ మతీశా పతిరనను ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.18కోట్లు పెట్టి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నైతో తనకున్న అనుభవాన్ని, ధోనీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పతిరన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

Matheesha Pathirana: ధోనీ భాయ్‌కి రుణపడి ఉంటా.. పతిరన ఎమోషనల్ పోస్ట్
Matheesha Pathirana

ఇంటర్నెట్ డెస్క్: యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ఎంఎస్ ధోనీ(MS Dhoni) ముందుంటాడు. అలా అతడి దృష్టిలో పడి ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకున్నాడు శ్రీలంక యువ పేసర్ మతీశా పతిరన. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయాల్లో పతిరన కూడా కీలక పాత్ర పోషించాడు. అయితే తాజాగా జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో పతిరనని కేకేఆర్ రూ.18కోట్లకు తీసుకుంది. ఈ క్రమంలో తనను ప్రోత్సహించిన ధోనీ, సీఎస్కేకు పతిరన(Matheesha Pathirana) ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.


‘ఎల్లో జెర్సీని ధరించాలనే కోరిక కలిగిన ఓ పిల్లాడిగా వచ్చిన నాపై సీఎస్కే నమ్మకం ఉంచింది. నన్నొక కుటుంబ సభ్యుడిగా ఆదరించింది. 2022 నుంచి 2025 సీజన్ వరకూ ప్రతి క్షణం ఆస్వాదించా. క్రికెటర్‌గా, వ్యక్తిగా అద్భుతంగా మలిచిన ఫ్రాంచైజీ. నా చివరి సీజన్‌ను అద్భుతంగా ముగించాలని అనుకున్నా. చెన్నై తరఫున 50 వికెట్ల మైలురాయిని అందుకోవాలని భావించా. దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. హృదయపూర్వకంగా నా కల కోసం శ్రమించా. నన్ను ముందుండి నడిపించిన ధోనీ భాయ్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటా. మేనేజ్‌మెంట్‌ నన్ను చాలా నమ్మింది. ప్రతి విషయంలోనూ జట్టులోని సహచరులు సోదరులుగా మద్దతు ఇచ్చారు. ఒడుదొడుకుల్లో మద్దతుగా నిలిచిన సీఎస్కే ఫ్యాన్స్‌ ప్రేమను మరిచిపోలేను. చెన్నైకి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. దీనిని నా హోమ్‌గా భావిస్తా. సీఎస్కేకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను కోల్‌కతా తరఫున కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నా’అని పతిరన పోస్టు చేశాడు. నాలుగేళ్లపాటు చెన్నైకి ఆడిన పతిరన 32 మ్యాచుల్లో 47 వికెట్లు తీశాడు.


ఇవి కూడా చదవండి:

Abhijnaan Kundu: అభిజ్ఞాన్‌ కుందు డబుల్‌ సెంచరీ.. తొలి ప్లేయర్‌గా రికార్డ్

వైభవ్ సూర్యవంశీని కట్టడి చేస్తాం: మలేసియా కెప్టెన్ డియాజ్

Updated Date - Dec 17 , 2025 | 09:55 AM