IPL 2025 Mini Auction: కోట్లు కుమ్మరించారు
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:43 AM
ఐపీఎల్ వేలం ఎప్పుడు జరిగినా ఆయా ఫ్రాంచైజీలు ఎక్కువగా విదేశీ ఆటగాళ్లపైనే ఆసక్తి ప్రదర్శిస్తుంటాయి. మంగళవారం జరిగిన తాజా.....
కామెరూన్ గ్రీన్.. ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్ల ఆధిపత్యాన్ని మరోసారి చాటి చెప్పాడు. అంచనాలకు తగ్గట్టుగానే ఈ ఆసీస్ ఆల్‌రౌండర్‌పై ఫ్రాంచైజీలు అమితాసక్తిన ప్రదర్శించాయి. అధిక మొత్తం కలిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ గ్రీన్ కోసం నువ్వా.. నేనా? అనే రీతిలో బిడ్డింగ్ వేశాయి. చివరకు రూ.25.20 కోట్ల దగ్గర సీఎ్‌సకే చేతులెత్తేయగా.. కేకేఆర్ అతడిని వశం చేసుకుంది. ఇక ఈసారి వేలంలో అన్‌క్యా్‌ప్డ ప్లేయర్ల హవా సాగింది. ఎవరికీ పెద్దగా తెలియని కుర్రాళ్లు కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్‌లపై చెన్నై.. కశ్మీర్ క్రికెటర్ అకీబ్ నబీపై ఢిల్లీ కోట్లు కుమ్మరించాయి.
రూ.25.20 కోట్లతో కోల్‌కతాకు గ్రీన్
పథిరనకు రూ. 18 కోట్లు
దేశవాళీ కుర్రాళ్లపై కాసుల వర్షం
కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్‌లకు చెరో రూ.14.2 కోట్లు
అబుదాబి: ఐపీఎల్ వేలం ఎప్పుడు జరిగినా ఆయా ఫ్రాంచైజీలు ఎక్కువగా విదేశీ ఆటగాళ్లపైనే ఆసక్తి ప్రదర్శిస్తుంటాయి. మంగళవారం జరిగిన తాజా మినీ వేలంలోనూ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ అంచనాలకు తగ్గట్టుగానే అత్యధిక ధర పలికాడు. చెన్నై నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటూ కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడిని రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఏ విదేశీ ఆటగాడికి ఇంతమొత్తం లభించలేదు. దీంతో ఆసీ్‌సకే చెందిన మిచెల్ స్టార్క్ (రూ.24.75 కోట్లు) పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. ఓవరాల్‌గా రూ.27 కోట్లతో రిషభ్ పంత్ టాప్‌లో ఉన్న విషయం తెలిసిందే. మొత్తంగా 359 మంది క్రికెటర్లు వేలానికి అందుబాటులో ఉండగా ఆయా ఫ్రాంచైజీలు 77 మందిని కొనుగోలు చేశాయి. జట్లన్నీ కలిపి వీరిపై రూ.215.45 కోట్లు ఖర్చు చేశాయి. అత్యధికంగా కేకేఆర్ రూ.64.30 కోట్లు, సీఎ్‌సకే రూ.43.40 కోట్ల మొత్తంతో ఈ వేలంలో అడుగుపెట్టాయి. అందుకే ఈ రెండు జట్లే గ్రీన్ కోసం ఎంతైనా వెచ్చించేందుకు ఆసక్తి చూపాయి. ఇక నాలుగు సీజన్లపాటు సీఎ్‌సకేకు ఆడిన శ్రీలంక యువ పేసర్ పథిరన అంచనాలకు మించి రూ.18 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం. ఢిల్లీ, లఖ్‌నవూలతో పోటీపడి మరీ కేకేఆర్ ఇతడిని తమ జట్టులో చేర్చుకుంది. ఐపీఎల్‌లో ఓ లంక ఆటగాడికి ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. అలాగే బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్‌పైనా కేకేఆర్ రూ.9.20 కోట్లు పెట్టింది. మొదటి రౌండ్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిన లివింగ్‌స్టోన్‌ను సన్‌రైజర్స్ రూ.13 కోట్లకు, జోష్ ఇన్‌గ్లిస్‌ను లఖ్‌నవూ రూ.8.60 కోట్లకు, ఎన్‌గిడిని రూ.2 కోట్లకు డీసీ, మ్యాట్ హెన్రీని సీఎ్‌సకే రూ.2 కోట్లకు, రచిన్‌ను కేకేఆర్ రూ.2 కోట్లకు తీసుకోవడం విశేషం. జాసన్ హోల్డర్‌ను రూ.7 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది.
రూ.30 లక్షల నుంచి రూ.14.2 కోట్లకు..
కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి వేలంలో అన్‌క్యా్‌ప్డ ఆటగాళ్ల హవా సాగింది. ఒక్కసారి కూడా భారత్‌కు ఆడని వీరిపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా భవిష్యత్ జట్టును దృష్టిలో ఉంచుకుని సీఎ్‌సకే వీరి విషయంలో దూకుడుగా వ్యవహరించింది. దేశవాళీల్లో రాణిస్తున్న 19 ఏళ్ల వికెట్ కీపర్ కార్తీక్ శర్మ, 20 ఏళ్ల ప్రశాంత్ వీర్‌ల కనీస ధర కేవలం రూ.30 లక్షలే. అయినా ఈ ఇద్దరిపై చెన్నై రూ.14.2 కోట్ల చొప్పున ఖర్చు చేసి మరీ దక్కించుకుంది. దీంతో ఈ ఇద్దరు అన్‌క్యా్‌ప్డ ఆటగాళ్లపైనే ఆ జట్టు రూ.28.4 కోట్లు వెచ్చించడం గమనార్హం. ఈ వేలంలో వీరిదే మూడో అత్యధిక ధర కావడం విశేషం. ఇక కశ్మీర్‌కు చెందిన పేసర్ అకీబ్ నబీని ఢిల్లీ జట్టు రూ.8.40 కోట్లకు, ఆల్‌రౌండర్ మంగేశ్‌ను ఆర్‌సీబీ రూ.5.20 కోట్లకు తీసుకున్నాయి.
ఈసారి అదృష్టం వరించె..
దేశవాళీ మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షాలపై ఈసారి వేలంలో అందరి దృష్టి పడింది. ఈసారి కూడా మొదట ఈ జోడీపై ఏ జట్టూ ఆసక్తి ప్రదర్శించలేదు. అయితే చివరకు సర్ఫరాజ్‌ను సీఎ్‌సకే, పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ వారి కనీస ధర రూ.75 లక్షలకే తీసుకోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
గ్రీన్‌కు దక్కేవి రూ.18 కోట్లే..
కామెరూన్ గ్రీన్ రూ.25.20 కోట్లతో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచినప్పటికీ, అతడి ఖాతాలో చేరేది రూ.18 కోట్లు మాత్రమే. దీనికి కారణం ఐపీఎల్‌లో ఉన్న గరిష్ఠ ఫీజు నిబంధన. వేలంలో పాల్గొనే విదేశీ ఆటగాళ్లకు చెల్లించే గరిష్ఠ వేతనం రూ.18 కోట్లుగానే నిర్ణయించారు. అంతకుమించి ఎంత మొత్తమైనా అది బీసీసీఐ నిర్వహించే ప్లేయర్ డెవల్‌పమెంట్ ప్రోగ్రామ్‌కు మళ్లిస్తారు. భారత ఆటగాళ్లకన్నా విదేశీ ప్లేయర్లకే ఎక్కువ మొత్తం దక్కుతుందనే విమర్శల నేపథ్యంలో బోర్డు ఈ స్లాబ్ తీసుకొచ్చింది. దీంతో గ్రీన్ ధరలో మిగిలిన రూ.7.2 కోట్లు బీసీసీఐ ఖాతాలో చేరనున్నాయి.
ఎవరీ కుర్రాళ్లు?
ఐపీఎల్ మినీ వేలంలో అత్యధిక ధర పొందిన అన్‌క్యా్‌ప్డ ప్లేయర్లుగా కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్‌ల పేర్లు మార్మోగిపోతున్నాయి. దీంతో ఎవరీ ఆటగాళ్లంటూ నెట్‌లో శోధించసాగారు. రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల కార్తీక్ పవర్ హిట్టర్. అలాగే వికెట్ కీపర్ కూడా అయిన తను మిడిలార్డర్‌లో బరిలోకి దిగి భారీ షాట్లతో ఆకట్టుకోగలడు. ఉత్తరాఖండ్‌పై రంజీ అరంగేట్రంలోనే శతకం బాదగా, గత విజయ్ హజారే ట్రోఫీలో రాజస్థాన్ తరఫున ఎక్కువ పరుగులు (445) సాధించాడు. గతంలో స్థానికంగా జరిగిన వన్డే మ్యాచ్‌లో 300 పరుగులతో అదరగొట్టాడు. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల ప్రశాంత్ లెఫ్టామ్ స్పిన్ బౌలింగ్‌తో పాటు లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేయగలడు. జడేజా లోటును సీఎ్‌సకే తనతో భర్తీ చేయాలనుకుంటోంది. ఈ ఏడాది యూపీ టీ20 టోర్నీలో ప్రశాంత్ 10 మ్యాచ్‌ల్లో 320 రన్స్, 8 వికెట్లు తీశాడు. ఈ ఇద్దరూ గతేడాది సీఎ్‌సకే క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందిన వారే కావడం విశేషం.
భారత స్టార్ ఆటగాళ్లకు నిరాశే..
మినీ వేలంలో భారత స్టార్ ఆటగాళ్ల విషయంలో ఫ్రాంచైజీలు ఆచితూచి వ్యవహరించాయి. గతంలో మాదిరి ఎక్కువ ధర పెట్టేందుకు ఇష్టపడలేదు. దీంతో రవి బిష్ణోయ్‌ను రాజస్థాన్ రూ.7.20 కోట్లకు, వెంకటేశ్ అయ్యర్‌ను ఆర్‌సీబీ రూ.7 కోట్లకు తీసుకున్నాయి. గత మెగా వేలంలో వెంకటేశ్‌పై కోల్‌కతా రూ. 23.75 కోట్లు వెచ్చించిన విషయం తెలిసిందే.
తెలుగు క్రికెటర్లు ఇద్దరే..
వేలంలో పలువురు తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు అందుబాటులో ఉన్నా కొందరినే అదృష్టం వరించింది. ఇందులో ఆంధ్ర ఆటగాడు పృథ్విరాజ్ యర్రాను గుజరాత్ రూ.30 లక్షలకు తీసుకోగా, హైదరాబాద్‌కు చెందిన అమన్ రావును రాజస్థాన్ రూ.30 లక్షలకు తీసుకుంది. ఇక చామ మిలింద్, శ్రీకర్ భరత్, తనయ్ త్యాగరాజన్‌లకు నిరాశే ఎదురైంది.