U19 Asia Cup: వైభవ్ సూర్యవంశీని కట్టడి చేస్తాం: మలేసియా కెప్టెన్ డియాజ్
ABN , Publish Date - Dec 16 , 2025 | 09:30 AM
భారత క్రికెట్ యంగ్ సెన్సెషన్ వైభవ్ సూర్యవంశీ అండర్ 19 ఆసియా కప్‌లో అదరగొడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో 171 పరుగుల చేసిన వైభవ్.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. నేడు మలేసియాతో టీమిండియా తలపడనున్న నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ వైభవ్ గురించి మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా సెంచరీల సంచలనం వైభవ్ సూర్యవంశీ ఏసీసీ పురుషుల అండర్ 19 ఆసియా కప్(U19 Asia Cup) భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచులో 95 బంతుల్లోనే 171 పరుగులు సాధించాడు. అందులో 14 సిక్సులు, 9 ఫోర్లు ఉండటం విశేషం. అయితే టోర్నీలో పాకిస్తాన్‌తో జరగిన రెండో మ్యాచ్‌లో వైభవ్(5) విఫలమయ్యాడు. కాగా మూడో మ్యాచ్ మంగళవారం మలేసియాతో జరగనుంది. ఈ సందర్భంగా సూర్యవంశీ(Vaibhav Suryavanshi)ని పాకిస్తాన్‌లాగే తామూ కట్టడి చేస్తామని ఆ జట్టు కెప్టెన్ డియాజ్ పాట్రో ధీమా వ్యక్తం చేశాడు.
‘వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్‌లో ఎదుగుతున్న గొప్ప క్రికెటర్. అతడితో ఆడేందుకు మేం ఆత్రుతగా ఉన్నాం. వైభవ్‌ను కట్టడి చేసేందుకు మా వద్ద వ్యూహాలున్నాయి. ఈ మెగా టోర్నీ విషయానికొస్తే.. మేం ఈ టోర్నీలో ఆడటం చాలా గొప్ప విషయం. ఇక్కడ ఆడేందుకు మా జట్టు కఠిన శిక్షణ తీసుకుంది. అనంతరం మాకు పెద్దగా సమయం లభించలేదు. అయినా.. అత్యుత్తమ శిక్షణ, నైపుణ్యాలు పొందాం. భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు ఎదురు చూస్తున్నాం’ అని డియాజ్ తెలిపాడు.
కెప్టెన్ మనోడే..
మలేసియా జట్టు కెప్టెన్ డియాజ్ పాట్రో తండ్రి ఒడిశాకు చెందిన వ్యక్తి. 20 ఏళ్ల క్రితం మలేసియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నాలుగేళ్ల వయసులో డియాజ్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ‘పదేళ్ల వయసులో కౌలాలంపూర్ అండర్ 19 జట్టు కోసం ఆడాను. 13 ఏళ్ల వయసులో మలేసియా అండర్ - 16 జట్టుకు ప్రాతినిథ్యం వహించా. ఈ ఏడాది అదే జట్టుకు కెప్టెన్‌గా మారడంతోపాటు ఇప్పుడు అండర్ - 19 మలేసియా జట్టుకు సారథిగా ఉన్నాను. ఇదంతా నా తల్లిదండ్రుల సహకారంతోనే జరిగింది. మా తండ్రిది ఒడిశా కావడంతో అక్కడ చాలా మంది బంధువులున్నారు. ఏడాదిలో ఒక్కసారైనా ఒడిశాకు వెళ్లి వారందరినీ కలుస్తుంటా. ఇక డేవిడ్ వార్నర్ నా అభిమాన క్రికెటర్. అందుకే, ఆయన జెర్సీ నంబర్ (31)నే నా జెర్సీకి పెట్టుకున్నా’ అని డియాజ్ చెప్పాడు.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ ఉత్తమ మహిళా క్రికెటర్‌గా షఫాలీ వర్మ
ఐపీఎల్ వేలంలో నయా రూల్.. ఏంటో తెలుసా?