Rohit Sharma: ఎడ్డం అంటే తెడ్డం.. రోహిత్-గంభీర్ కొట్లాట.. ఇలాగైతే కప్పు కష్టమే..
ABN , Publish Date - Jan 19 , 2025 | 12:58 PM
Gautam Gambhir: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ గురించి గత కొన్నాళ్లుగా అనేక గాసిప్స్ వస్తున్నాయి. సీనియర్లకు హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు మధ్య చెడిందని, రిషబ్ పంత్ సహా ఇతర స్టార్లకు గౌతీ వార్నింగ్ ఇచ్చాడని రూమర్స్ వినిపించాయి.

గెలుపు అన్నింటినీ దాచేస్తుంది. సమస్యలు, ఇబ్బందులు, అలకలు, కోపతాపాలు.. ఏవి ఉన్నా బయటపడనివ్వదు. అదే ఓటమి.. లేని సమస్యలు కూడా సృష్టిస్తుంది. ఒక్కసారిగా ప్రాబ్లమ్స్‌ను బయటపెడుతుంది. ఇప్పుడు టీమిండియా పరిస్థితి ఇలాగే ఉంది. వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో దారుణ పరాభవాలు చూడటంతో భారత డ్రెస్సింగ్ రూమ్ గురించి అనేక రూమర్స్ వస్తున్నాయి. సీనియర్లతో హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు పడదని.. రిషబ్ పంత్ సహా పలువురు స్టార్లకు అతడు వార్నింగ్ ఇచ్చాడంటూ కథనాలు వచ్చాయి. అయితే బీసీసీఐ రివ్యూ మీటింగ్‌తో వీటికి ఫుల్‌స్టాప్ పడిందని అంతా అనుకున్నారు. కానీ మరలా అగ్గి రాజుకున్నట్లే కనిపిస్తోంది. ఈసారి సారథి రోహిత్ శర్మకు గంభీర్‌కు మధ్య ఫైట్ జరిగిందని తెలుస్తోంది.
పట్టుబట్టి మరీ..!
హెడ్ కోచ్ గంభీర్ మెంటాలిటీ ఏంటో అందరికీ తెలిసిందే. తాను అనుకున్నది సాధించే వరకు అతడు విశ్రమించడు. పోరాడి మరీ అనుకున్నవి నెరవేర్చుకోవడం అతడి స్టైల్. అటు రోహిత్ కూడా దాదాపుగా ఇదే మనస్తత్వం కలవాడే. తాను నమ్మిన వారికి అండగా నిలబడటం, ప్లాన్స్‌కు అనుకున్నట్లు ఎగ్జిక్యూట్ చేయడం అతడి శైలి. అలాంటిది ఈ ఇద్దరూ ఓ విషయంలో కొట్లాడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. వెనకడుగు వేయని తత్వం గల గౌతీ-హిట్‌మ్యాన్ మధ్య ఎడ్డం అంటే తెడ్డం అంటూ గొడవ జరిగిందట. చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఎంపిక సమయంలో ఇద్దరూ తనకు ఈ ఆటగాడు కావాలంటే తనకు ఈ ప్లేయర్ కావాలంటూ వాదించారట. అయితే మొత్తానికి రోహిత్ సక్సెస్ అయ్యాడని.. తాను అనుకున్న వారిని పట్టుబట్టి మరీ టీమ్‌లోకి తీసుకున్నాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.
గంభీర్‌కు నో.. రోహిత్‌కు ఎస్!
చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌కు హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్‌గా నియమించాలని సెలెక్టర్లను గంభీర్ కోరాడట. అతడి అనుభవం, ప్రతిభ, టీ20 వరల్డ్ కప్ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొని ఈ రిక్వెస్ట్ చేశాడట. మరోవైపు శుబ్‌మన్ గిల్‌కు వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని రోహిత్ అడిగాడట. సమాలోచనలు చేసిన సెలెక్షన్ కమిటీ గిల్ వైపు మొగ్గు చూపిందట. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ పర్ఫెక్ట్ చాయిస్ అని గౌతీ చెబితే.. కాదు కాదు, ఆ బెర్త్‌కు పంతే న్యాయం చేయగలడని హిట్‌మ్యాన్ అన్నాడట. ఈ విషయంలోనూ అతడి మాటే నెగ్గిందని.. పంత్‌ను తీసుకోవడానికి రోహిత్ రిక్వెస్టే కారణమని కథనాలు వస్తున్నాయి. వైస్ కెప్టెన్సీ, వికెట్ కీపింగ్.. ఈ 2 నిర్ణయాల్లో రోహిత్‌కు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మద్దతు ఇచ్చాడని వినిపిస్తోంది. ఇది తెలిసిన నెటిజన్స్.. ఇద్దరూ ఒక మాట మీద ఉండకపోతే కష్టమని, టీమ్ కోసం కాకుండా ఈగోలకు వెళ్తే అసలుకే ఎసరు వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే చాంపియన్స్ ట్రోఫీ కప్పును భారత్ గెలవడం కష్టంగా కనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదీ చదవండి:
ఆసీస్, దక్షిణాఫ్రికా శుభారంభం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి